చలి కాలంలో చర్మం అడుగున రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాంతో కీళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా రక్తం ద్వారా కీళ్లకు అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల, మ దులాస్థి కుంచించుకుపోయి కీళ్లు బిగుసుకుని నొప్పి మొదలవుతుంది. ఇలాంటి ఇబ్బంది ఆస్టియో ఆర్థ్రయిటిస్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ ఉన్నవాళ్లకు మరింత ఎక్కువ. అంతకు ముందు ప్రమదాల్లో కీళ్లు, లిగమెంట్లకు తగిలిన దెబ్బల వల్ల కూడా చలికాలంలో నొప్పులు మొదలవుతాయి. ఈ సమస్యలన్నీ చలి వల్ల ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ సమస్యను వైద్య పరిభాషలో 'రేనాడ్స్ ఫినామినా' అని పిలుస్తారు. ఈ నొప్పుల బాధ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని ఉపశమన పద్ధతులు పాటించడంతోపాటు, కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అవేంటంటే... చలికాలంలో కీళ్లనొప్పులు ఎక్కువగా బాధిస్తాయి. చలితో పెరిగే నొప్పులు తగ్గాలంటే చల్లని వాతావరణం, ఏసీలకు దూరంగా ఉండాలి. ఇంట్లో వెచ్చదనం పెంచాలి. ఇందుకు హీటర్లు ఉపయోగించవచ్చు. స్వెటర్లు వేసుకోవాలి. శరీరానికి ఎండ సోకేలా చూసుకుంటున్నా, వాతా వరణంలో ఉన్న కాలుష్యం కారణంగా సూర్య కిరణాలు సూటిగా చర్మానికి తగలవు. ఫలితంగా చర్మంలో సింథసిస్ సక్రమంగా జరగక సరిపడా విటమిన్ 'డి' తయారవదు. విటమిన్ డి లోపంతో బాధపడేవారు చలికాలంలో ప్రతిరోజూ కనీసం 10 మైక్రోగ్రాముల విటమిన్ డి సప్లిమెంటు తీసుకోవాలి. - గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి కాళ్లు, చేతులు ముంచి, వేళ్లు కదిలిస్తూ ఉండాలి. - చేతి వేళ్లలో నొప్పులు ఉన్నవాళ్లు 'హ్యాపీ బాల్' నొక్కే వ్యాయామం చేయాలి. - మోకాలి కీళ్ల ఆర్థ్రయిటిస్తో బాధపడేవాళ్ళు ఎముకలు మరింత అరిగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. - ట్రెడ్మిల్, జుంబా, ఏరోబిక్స్కు బదులు మెత్తని పచ్చిక మీద నడక, సైకిల్ తొక్కడం, క్రాస్ ట్రైనర్ వాడడం మొదలైన వ్యాయామాలు చేయాలి. పార్షియల్ స్క్వాట్ వ్యాయామం చేయవచ్చు. - వ్యాయామం చేసేవాళ్ళు మెత్తని బూట్లు వాడాలి. - ఈత కొట్టడం కీళ్లకు అనువైన వ్యాయామం. - మెత్తని సోఫాలను వాడకూడదు. సోఫాలో కూర్చున్నప్పుడు మోకాలు 90 డిగ్రీల కోణంలో ముడుచుకుంటుంది. ఈ యాంగిల్లో ఉన్న మోకాళ్ల మీద భారం మోపుతూ లేచే ప్రయత్నం చేస్తే కీళ్ల అరుగుదల పెరుగుతుంది. కాబట్టి సోఫా బదులు, బ్యాక్ సపోర్ట్ ఉన్న చెక్క కుర్చీలు వాడాలి. - బరువును అదుపులో ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన ఫిజియోథెరపీ చేయాలి.