ప్రకృతిలో జీవులందరూ సమానమే. బుద్ధి జీవి మనిషి తన తెలివితేటలను విస్తృత పరుచుకుంటూ ప్రకృతిలో మగవారు ఎక్కువ.. ఆడవారు తక్కువ అన్న వాదాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. సమస్యలన్నీ ఆడవారికే అన్నవిధంగా సైన్సును తప్పుదారి పట్టిస్తున్నారు. ఆడవారిలో మోనోపాజ్ దశ మాదిరిగానే మగవాళ్లలో కూడా ఇలాంటి దశ ఉంటుంది అన్న విషయం చాలా మంది మగవాళ్లకు తెలియదు. వయసు పెరిగేకొద్ది శరీరంలో హార్మోన్లహెచ్చుతగ్గులతో సమస్యలు ఎవరికైనా తప్పవు అన్నది వాస్తవం.
ఆడవారిలో నలభైండ్లు పైబడిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని ప్రభావం వల్ల కండరాల, ఎముకల పటుత్వం తగ్గుతుంది. ఈ హార్మోన్ లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. రుతుచక్రం క్రమక్రమంగా ఆగిపోవడంతో శరీరంలో మార్పులు వేగంగా జరుగుతాయి. ఈ దశనే మోనోపాజ్ దశ అంటారు. ఇలాంటి పరిస్థితే మగవాళ్లలోనూ కనిపిస్తుంది. వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గుతుంది. అయితే ఈ హార్మోన్ లోపం వల్ల వచ్చే మార్పులు చాలా కాలం పాటు అంతర్లీనంగా జరుగుతూ ఉంటాయి. వారివారి శరీరతత్వాన్ని బట్టి మూడు నాలుగేండ్ల పాటు 45ఏండ్ల నుంచి 52ఏండ్ల మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆడవారిలో వచ్చే దశను మోనోపాజ్ అని పిలిస్తే.. మగవారిలో వచ్చే దశను ఆండ్రోపాజ్ అని పిలుస్తారు. అయితే మగవాళ్లలో ఎప్పుడు ఈ దశ వచ్చిందో తెలసుకోవడం కాస్త కష్టమే. ఆడవాళ్లు మోనోపాజ్ తో ఇబ్బంది పడ్డట్లే మగవాళ్లు కూడా ఆండ్రోపాజ్ తో ఇబ్బంది పడతారు.
లక్షణాలు..
ఆండ్రోపాజ్ దశ ఒకసారిగా వచ్చే సమస్య కాదు. క్రమక్రమంగా లక్షణాలు కనిపిస్తాయి.
ఈ దశలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గడంతో లైంగిక సామర్ధ్యం తగ్గుతుంది.
మెల్లమెల్లగా శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతారు.
నిద్రలేమి, కుంగుబాటు, ఒంట్లో శక్తి తగ్గిపోవడం తదితర ఇబ్బందులకు గురి అవుతారు.
ఎముకల పటుత్వం దెబ్బతింటుంది.
కొందరిలో చాలా అరుదుగా మహిళల మాదిరిగా బ్రెస్ట్ పెరుగుతుంది.
అలసట, మతిమరుపు, కండరాల నొప్పులు,
ఆకలి మందగించడం, చికాకు, కోపం మొదలైనవన్నీ ఆండ్రోపాజ్ లక్షణాలుగా గుర్తించాలి. వీటిని సులభంగా గుర్తించవచ్చు.
చికిత్స..
ఇది వయసుతో పాటు శరీరంలో కలిగే మార్పులతో వచ్చే ఒక దశ మాత్రమే. క్రమక్రమంగా శరీరంలో అంతర్లీనంగా వచ్చే మార్పులను, బయటకు కనిపించే లక్షణాలను గమనిస్తే ఆండ్రోపాజ్ దశ వచ్చినట్టు తెలుసుకోవచ్చు. శరీరంలో తగ్గిన టెస్టోస్టిరాన్ హార్మన్ స్రావం తగినంత ఉండేలా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. అందుకు తగినట్టుగా జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవాలి. సమస్య ఎక్కువగా ఉంటే టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు మోతాదునుబట్టి నెలకొకసారి లేదంటే మూడు నెలలకి ఒకసారి తీసుకోవచ్చు. ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా టెస్టోస్టిరాన్ జెల్ కూడా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ చర్మం మీద అప్లై చేసుకుని వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ జెల్ రాసుకున్న తర్వాత మహిళలను, పిల్లలను అదే చేతులతో తాకితే ఆ హార్మోన్ వాళ్ల శరీరంలోకి చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జెల్ వాడేవాళ్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ తీసుకునే ముందు రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఆండ్రోపాజ్కు లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆండ్రాలజిస్టుని కలిసి అవసరమైతే హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.
లైఫ్స్టైల్లో మార్పులు..
- జీవనవిధానంలో మార్పులు, సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. ముందు నుంచే ఆహార విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే సమస్య తీవ్రతను చాలావరకు తగ్గించుకోవచ్చు.
- పొటీన్లు ఎక్కువగా ఉండే సోయా, పాలు, చికెన్ లాంటి పదార్థాలను తప్పక తీసుకోవాలి.
వేరుశెనగ, బాదం, జీడిపప్పులాంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- మద్యం సేవించడం, ధూమపానం, పొగాకు ఉత్పత్తులు తినడం వంటి అలవాట్లు టెస్టోస్టిరాన్ హార్మోన్ను తగ్గిస్తాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది.
- డయాబెటిక్, రక్తపోటుకు మందులు వాడేవారిలోనూ సమస్య ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా హెల్త్చెకప్ చేయించుకుంటూ బిపీ, షుగర్ అదుపులో ఉంచుకోవాలి.
- విటమిన్ సి, ఇ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
- ఆహార నియమాలను పాటించడంతో పాటు క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
- ఫాస్ట్ఫుడ్ తగ్గించాలి. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు మానుకోవాలి.
- ఇలా చిన్నచిన్న మార్పులతో ఆండ్రోపాజ్ సమస్య నుంచి వీలున్నంత దూరంగా ఉండవచ్చు. ఇవన్నీ పాటించీ ఆండ్రోపాజ్ సమస్య బాధపెడితే వైద్యుల సలహా మేరకు హార్మోన్ చికిత్స చేసుకోవడం మంచిది.
Authorization