ఫైబర్ ఫుడ్... ఇది అత్యంత ఆకర్షణీయమైన ఆహారమేమీ కాదు కానీ మనం ఎంత ఫైబర్ తినాలి అనే అంశంపై చేసిన పరిశోధనల్లో దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించారు. మలబద్ధకాన్ని ఫైబర్ తగ్గిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే.. కానీ పీచుపదార్థం వల్ల అంతకన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. - పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల రొట్టెలు, పాస్తాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్, పప్పులు, శనగలు, గింజలు వంటి వాటిల్లో కూడా ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఓట్స్‌లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ఉదయం పూట అల్పాహారం తీసుకుంటే మంచిది. - తృణధాన్యాల్లో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. శనగలు, బీన్స్, తృణ ధాన్యాలను కూరల్లో కలిపి వండుకుంటే కూడా శరీరానికి ఫైబర్ బాగా అందుతుంది. - మధ్యమధ్యలో స్నాక్స్‌గా గింజలు, తాజా పండ్లు తినడం వల్ల కూడా శరీరానికి పీచు పదార్థం అందుతుంది. రోజుకు కనీసం ఐదో వంతు పండ్లు, కూరగాయలు తినడం మంచిది. - టైప్-2 డయాబెటిస్ స్థాయి తక్కువగా ఉండటం, పెద్ద పేగు క్యాన్సర్ అవకాశాలు తగ్గిపోవడంతో పాటు.. బరువు, రక్తపోటు, కొవ్వు స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఎంత ఎక్కువ ఫైబర్ తింటే అంత మంచిదని కూడా అధ్యయనం సూచిస్తోంది. - ఫైబర్ వల్ల శరీరానికి పెద్దగా ఉపయోగం లేదని అనుకుంటారు. కానీ ఫైబర్ ఫుడ్ కొద్దిగా తిన్నా కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. చిన్నపేగు కొవ్వును గ్రహించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక పెద్దపేగుల్లో కోట్ల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియాకు ఆహారం లభిస్తుంది. - పెద్దపేగులో ఉన్న బ్యాక్టీరియా ఫైబర్‌ను పులియబెడుతూ అనేక రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం మొత్తంపై ప్రభావం చూపుతాయి.