పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. చేతులు, చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోకపోయినా నులిపురుగుల సమస్య వస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వల్ల కూడా నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. నులి పురుగుల వల్ల పిల్లలకు అనేక అనర్థాలు కలుగుతాయి. 1 నుంచి 19 సంవత్సరాల వయసువారిలో నులిపురుగులు ఉంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నులిపురుగులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివద్ది చెందే పరాన్న జీవులు. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహారలోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని నివారించ డానికి పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రలు వేయాలి. అయితే వీటిని డాక్టర్ సూచన మేరకు మాత్రమే వాడాలి. పిల్లల్లో సాధారణంగా మూడు రకాల నులిపురుగులు కనబడే అవకాశముంది. ఏలిక పాములు, నులిపురుగులు, కొంకిపురుగులు ఉంటాయి. వీటిని నిర్మూలిం చేందుకు 1 నుంచి 2 ఏండ్ల వయసు కలిగిన పిల్లలు 400 ఎంజీలో సగం 200 ఎంజీ మాత్రను వేయాలి. కడుపులో నులి పురుగులు ఉంటే మాత్రలు వేసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి. దీర్గకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నవారు వేసుకోకూడదు. కొన్నిసార్లు వికారం, వాంతులు, స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశం ఉంది. దాని వల్ల భయపడాల్సిన అవసరం లేదు. నివారణ... చిన్నచిన్న జాగ్రత్తలతో నులిపురుగులను నివారించవచ్చు. - పిల్లల చేతి వేళ్ల గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. చిన్నవిగా ఉంచుకోవాలి. గోర్లలో మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఎల్లపుడూ పరిశుభ్రమైన నీటినే త్రాగాలి. తినే ఆహారం కలుషితం కాకుండా ఎల్లపుడూ కప్పి ఉంచాలి. - సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న పదార్థాలే తీసుకోవాలి. - ఈగలు, దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్తపడాలి. - పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను శుభ్రమైన నీటితో క డిగిన తర్వాతే వండాలి. - బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనను మానేసి మరుగుదొడ్ల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. - ఇంటి చుట్టు పక్కల పరిసరాలను అన్ని వేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్యకేంద్రాల్లో.. పిల్లలకు నులిపురుగుల నివారణా మాత్రలు (ఆల్బెండజోల్)అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఉచితంగా ఇస్తారు.