మనదేశంలో ఎక్కువ మంది ప్రధాన అనారోగ్య సమస్యల్లో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబిఎస్)ఒకటి. ఎందుకు వస్తుంది అన్నదానికి సరైన కారణాలు తెలియలేదు. అయితే పెద్దపేగుల్లో అధిక కదలికల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అధిక కదలికలు రావడానికి కారణం నరాల్లో సమతుల్యత లోపించడం. మగవారిలో కన్నా మూడు రెట్లు ఎక్కువగా మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే వ్యాధినే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(ఐబిఎస్) అని వైద్యపరిభాషలో పిలుస్తారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కడుపులో పట్టేసినట్లు నొప్పి ఉంటుంది. తరచుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. రోజువారి పనులకు చాలా వరకు అంతరాయం కలుగుతుంది. పదిమందిలో ఉన్నప్పుడు, బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్న వారిలో, పెద్దపేగులు, జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కారణాలు..
ఐబీఎస్‌కి ప్రత్యేక కారణమంటూ ఇప్పటి వరకు తెలియలేదు. అయితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన పెద్దపేగు ఇన్ఫెక్షన్లకు గరైన వారిలో ఆరు రెట్లు ఐబీఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు తీసుకునే ఆహారపదార్థాల ద్వారా పెద్దపేగుల్లోని కండరాలు అసాధారణంగా స్పందించడం ద్వారా కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా ఐబీఎస్ రావడానికి కారణమవుతాయి.
జీర్ణవ్యవస్థను ఒకసారి పరిశీలిస్తే....మనం తీసుకునే ఆహారం పేగుల్లో జరిగే సంకోచ వ్యాకోచాల (పెరిస్టాల్టిస్)ద్వారా జీర్ణమవుతుంది. అయితే కొందరిలో ఈ సంకోచ వ్యాకోచ ప్రక్రియ అతిగా సాగుతుంది. దీనివల్ల ఆహారం స్పీడ్‌గా లోపలికి వెళ్లడం వల కడుపు ఉబ్బరంతో పాటు ఇతర జీర్ణాశయ సమస్యలన్నీ మొదలవుతాయి. సంకోచ వ్యాకోచాలు కొన్నిసార్లు అతివేగంగా సాగితే విరేచనాలు, తక్కువ వేగంతో సాగినప్పుడు మలబద్దకం సమస్యలు వస్తాయి.
లక్షణాలు
పొద్దున లేవగానే త్వరగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మలవిసర్జన సాఫీగా జరగనట్టు అనిపిస్తుంది. మలవిసర్జనకు ఎన్నిసార్లు వెళ్లినా ఇంకా పూర్తికాలేదనే భావన. మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంది. భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. బయటకు వెళ్లే ముందు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. మలబద్ధకం ఉంటుంది. కొన్నిసార్లునీళ్ల విరేచనాలు అవుతాయి. మలవిసర్జన సమయంలో పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.
కడుపు ఉబ్బరం, నొప్పి ఉంటుంది.
కడుపంతా పట్టేసినట్లు ఉండడం, విరేచనాలు, ఏ మాత్రం నిగ్రహించుకోలేక పోతారు. టాయిలెట్‌కు వెళ్లాలనిపించిన మరుక్షణమే టాయిలెట్ కోసం పరుగులు తీస్తారు.
ఏం తిన్నా ఒంటికి పట్టక, నీరసం, నిస్సత్తువ ఆవరించడం. పెద్దగా ఏమీ చేయకుండానే విపరీతంగా అలసిపోవడం
ఛాతీలో మంట, మింగడం కష్టం కావడం, రుచి తెలియకపోవడం, అజీర్తి, వికారం, వాంతులు, పెద్దగా ఏమీ తినకుండానే కడుపు నిండినట్లు, కడుపులో అసౌకర్యంగా అనిపించడం,
ఎప్పుడూ కడుపులో గుడగుడమంటూ శబ్దం రావడం, పొట్ట భాగాన్ని తాకితేనే నొప్పి అనిపించడం, పెద్ద శబ్ధంతో అపాన వాయువులు విడుదల కావడం,
మలవిసర్జన భాగంలోనూ పొడిచినట్లు నొప్పి అనిపించడం, మలంలో జిగురు పడటం, బరువు తగ్గిపోవడం, మలంలో రక్తం పడటం వీటితో పాటు తలనొప్పి, ఒంటినొప్పులు, వెన్నునొప్పి, కండరాల నొప్పులు తదితర సమస్యలు కూడా వస్తాయి.
వ్యాధి నిర్ధారణ
మలపరీక్ష చేయడం ద్వారా బ్యాక్టీరియా, అమీబిక్ సిస్ట్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. తీసుకున్న ఆహారపదార్థాలు పూర్తిగా జీర్ణం అవుతుందో లేదా తెలుసుకోవాలి. వీటితో పాటు సీబీపీ, ఈఎస్ఆర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొలనోస్కోపి పరీక్ష ద్వారా పెద్దపేగుల్లో ఇన్ఫెక్షన్లు ఉన్నాయా తెలుసుకోవచ్చు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ జబ్బులు ఉన్నాయా అనే విషయం కూడా తెలుస్తుంది.
జాగ్రత్తలు
ఆహార పదార్థాల్లో ఎక్కువ మసాలాలు, అతి కారంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
తినే ఆహార పదార్థాల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకకుండా శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి.
పాలు, పాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
చల్లని లేదా అతి వేడిగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
ఎక్కువగా కాఫీ తీసుకోవడం, అతిగా మద్యం తాగడం, ధూమపానం మానేయాలి.
వ్యక్తిగత శుభ్రత పాటించాలి. టాయిలెట్ వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
మలబద్దక సంబంధితమైన ఐబిఎస్ (ఇరిటెబుల్ బావెల్ సిండ్రోమ్) ఉంటే ఎక్కువగా పండ్లు, పీచుపదార్థాలు, అధికంగా నీరు తీసుకోవాలి.
నీటి విరేచనా సంబంధితమైన ఐబిఎస్ ఉంటే పీచుపదార్థాలు తక్కువగా తీసుకోవాలి. పాలపదార్థాలు తీసుకోకూడదు.
వీటితో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం అలవర్చుకోవాలి., రోజూ గంట పాటు వ్యాయామం చేయాలి.
Authorization