'కోటి విద్యలు కూటి కొరకే' అన్న నానుడి అందరికీ తెలిసిందే. ఆహారం తీసుకోవడంలో సమయపాలన లేకపోవడం వల్లనే అనేక రకాల వ్యాధులు వస్తున్నాయని వైద్యపరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటినే జీవనశైలి మార్పుతో వచ్చే వ్యాధులుగా పిలుస్తుంటారు. అందుకే రోజూ తినే ఆహార పదార్థాల వివరాలను డైరీలో రాసుకుంటే మంచిదని ఆహారనిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఎంత మేర తింటున్నాం, ఏం తింటున్నాం అన్నదానిపై అవగాహన పెరిగి ఆహారప్రణాళిక, నియంత్రణ సాధ్యం అవుతుంది.
ఆరోగ్య పరిశోధకులు బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా, లంచ్ మోతాదుగా, డిన్నర్ మరింత తక్కువ పరిమాణంలో ఉండాలంటారు. ఇందుకు కారణం రోజులో పొద్దున్నుంచి మధ్యాహ్నంలోగా శరీరానికి ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్, లంచ్ తగినంత తీసుకోవాలి. రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటాం. కాబట్టి తక్కువగా ఆహారం తీసుకోవాలి. ఉద్యోగంలో షిప్ట్‌ల కారణంగా లంచ్ తక్కువగా, డిన్నర్ ఎక్కువగా తీసుకోక తప్పని పరిస్థితిలో ఉన్నవారు కనీసం డిన్నర్ లో తీసుకునే ఆహారం చాలా తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా కూరగాయలు, సలాడ్ తీసుకుంటే మంచిది.
టైమ్ప్రకారం..
పొద్దున్నే నిద్రలేవడం ఆరోగ్యానికి మంచిది. నిద్ర లేచిన వెంటనే ఓ గ్లాస్ నీటిని తాగడం వల్ల శరీరంలో నీటి సమతుల్యత ఏర్పడుతుంది. దీర్ఘకాలం నుంచి ఉన్న కీళ్ల నొప్పులు ఉపశమించడంతోపాటు, క్యాన్సర్ నియంత్రణ సాధ్యమవుతుంది.
నిద్ర లేచిన తర్వాత అరగంట నుంచి గంటలోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియలు మొదలవుతాయి. స్వీట్ తినడానికి ఉదయమే సరైన సమయమని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకుల మాట. ఇది జీవక్రియలను ఉత్సాహపరుస్తుందట. కడుపు నిండిపోతుంది కనుక ఇతర ఆహారం వైపు కూడా చూడరు. నచ్చిన చాక్లెట్ ను తినవచ్చు. దీనివల్ల కార్బోహైడ్రేట్లు, షుగర్ ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరుతాయి.
పొద్దున్న తీసుకునే ఆహారం శరీరంలో బ్లడ్ షుగర్ పరిమాణాలు మిగిలిన రోజంతా ఎలా ఉండాలన్నది నిర్ణయిస్తుందట. హౌల్ గ్రెయిన్, కొంత ఫ్యాట్, ప్రొటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే బ్లడ్ షుగర్ నిదానంగా పెరిగి, నిదానంగా తగ్గుతుంది.
పొద్దున్నే బెడ్ కాఫీ తీసుకోవడం చాలా మందిలో చూడొచ్చు. కానీ, పరిశోధకులు మాత్రం కాఫీ లేదా టీ తాగేందుకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న వరకు అనువైనదని చెబుతున్నారు. పొద్దున్నే లేచిన వెంటనే కాఫీ, టీలు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కెఫైన్‌కు శరీరం అనువుగా మారుతుంది. దాంతో ఇది సహజంగా మన శరీరానికి శక్తినిచ్చే కార్టిసోల్ హార్మోన్ ను తగ్గించేస్తుంది. పొద్దున్న పదింటికి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య కాఫీ, టీ లాంటివి తీసుకోవడం మంచిది.
చాలామంది బరువు పెరిగిపోతున్నాం అంటూ డైటింగ్ మొదలు పెడతారు. అయితే డైటింగ్ చేసేవాళ్లు ఉపవాసం ఉండకుంటా భోజనానికి బదులు ఏదో ఒకటి కొద్దిమొత్తమైనా తీసుకోవాలి. ఏదీ తినకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. డైటింగ్ చేసేవాళ్లు మరీ ముఖ్యంగా పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ మానేయవద్దు. కొద్దికొద్దిగా ఆహారాన్ని రోజులో ఆరు సార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
లంచ్ టైమ్‌లో తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, తక్కువగా ప్రొటీన్స్ ఉంటేలా చూసుకోవాలి.
రాత్రి పూట తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. దాంతో నిద్ర తొందరగా రాదు. పట్టినా ఆ నిద్ర అంత గాఢంగా ఉండదు. చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోయి విశ్రాంతి భావనలను కలిగించే మెలటోనిన్ హర్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దాంతో నిద్ర లేమి సమస్య వస్తుంది.
Authorization