ఆరోగ్యంగా ఉండాలంటే అధిక బరువు లేకుండా చూసుకోవాలి. శరీర బరువు ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నా అనారోగ్య సమస్యలు వస్తాయి. డైట్ ప్రణాళిక వేసుకుని ఓ పద్ధతి ప్రకారం ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. దాని కోసం కింది సూచనలు పాటిస్తే మంచిది. కొలెస్ట్రాల్ లేకుండా ఆరోగ్యంగా శరీర బరువును సమతుల్యంగా ఉంచడంలో ఓట్స్ పాత్ర కీలకం. దీనిలో ఉండే పిండి పదార్థాలు బలాన్నిస్తాయి. ముఖ్యంగా దీంట్లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. పాలలో ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే కొవ్వు పదార్థాలు శరీర బరువు పెరిగేలా చేస్తాయి. అయితే ఎంత బరువు పెరగాలి అన్నదాన్ని బట్టి తీసుకోవాలి. కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ జోలికి పోకుండా... మామూలు పాలనే తగినంత మోతాదులో తీసుకోవాలి. గుడ్డులో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఒకటి తీసుకుంటే మంచిది. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెకు ఎటువంటి హానీ చేయవు. కాబట్టి ఈ నూనెను వంటకు ఉపయోగించడం మంచిది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే దుంపలు, తృణధాన్యాలను తీసుకోవాలి. అయితే ఇవి మోతాదు మించితే ప్రమాదం. కాబట్టి ఎప్పటికప్పుడు బరువును చెక్ చేసుకుంటూ, అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. సాల్మన్ ఫిష్ తింటే త్వరగా బరువు పెరుగుతారు. కాబట్టి నెలకు రెండు సార్లు ఆహారంలో తీసుకుంటే సరిపోతుంది. అలాగే బాదం, జీడిపప్పు, అరటి పండ్లు, కొబ్బరి పాలు... ఇవన్నీ బరువు పెరగడానికి దోహదపడతాయి. బరువు పెరగాలి కదా అని పద్ధతి లేకుండా ఎంత పడితే అంత తినవద్దు. ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మంచిది.