ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల బారిన పడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు గల కారణాలపై అంతర్జాతీయంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. డిప్రెషన్ తగ్గడానికి వాడే మందుల కారణంగా కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా అన్న అంశంపై ఆర్హస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. అయితే వీరి పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిప్రెషన్ మానసికంగానే కాదు, శారీరకంగానూ తీవ్రంగా దెబ్బతీస్తుంది. గుండె ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసిక సమస్యలతో బాధపడేవారి హర్ట్‌బీట్ (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) ముప్పు పెరుగుతోందని తాజాగా బయటపడింది. డిప్రెషన్ తగ్గటానికి వేసుకునే మందులకూ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పునకూ గల సంబంధంపై ఆర్హస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. డిప్రెషన్ మందులకూ ఏట్రియల్ ఫిబ్రిలేషన్కూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం కావడంతో డిప్రెషన్ కారణంగాన్ హర్డ్బీట్ తప్పటానికి కారణం అవుతుందని స్పష్టమైంది. గుండె లయ సమస్యల్లో తరచుగా కనబడేది ఏట్రియల్ ఫిబ్రిలేషనే. దీని బారినపడ్డవారిలో గుండె దడ, శ్వాస ఆడకపోవటం, అలసట, ఛాతీనొప్పి, తల తిప్పు వంటి లక్షణాలు కనబడతాయి. గుండె కొట్టుకునే క్రమం దెబ్బతినటం వల్ల పక్షవాతం ముప్పు పెరుగుతుంది. పక్షవాతం బాధితుల్లో సుమారు 20-30శాతం మంది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ బాధితులే అన్నది స్పష్టమైంది. గుండె జబ్బుకు కారణమయ్యే డిప్రెషన్‌ను తేలికగా తీసుకోవద్దని వైద్య పరిశోధకులు సూచిస్తున్నారు. డిప్రెషన్‌కు మందులు వేసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహారాన్ని డైట్లో చేర్చుకుంటే మందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. - ఫోలేట్ మోతాదులు తగ్గితే మానసికాందోళన పెరుగుతుంది. ఫోలేట్ ఎక్కువగా ఉండే పాలకూర వంటి ఆకుకూరలు తరచుగా తీసుకోవాలి. - అరటిపండులో సంతోషాన్ని కలిగించే ట్రిప్టోథాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది మానసిక సమస్యలను తగ్గించి డిప్రెషన్ నుంచి బయటపడడానికి దోహదం చేస్తుంది. - మెదడు ప్రశాంతంగా ఉండటానికి పాలు, అరటిపండు తోడ్పడతాయి. కాబట్టి వీటితో చేసిన మిల్క్‌షేక్‌లు అప్పుడప్పుడు తీసుకోవటం మంచిది. - గింజపప్పులు, అవకాడో, ఆలివ్ నూనె, చేపలు వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి డిప్రెషన్‌ను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి.