బరువు తగ్గాలంటే కష్టం గానీ పెరగటం కష్టమా అని చాలా మందికి అనిపిస్తుంటుంది. కాని కొందరు ఎంత ప్రయత్నించినా బరువు పెరగరు. బరువు పెరగాలన్నా పెద్ద కసరత్తులే చేయాల్సి ఉంటుంది. ఆ విశేషాలు ఇవి... బరువు పెరగక పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, సమ యానికి తినక పోవడం వల్ల బరువు పెరగకపోవచ్చు. ము ఖ్యంగా పిల్లలు బరువు పెరగకపోవడానికి రక్త హీనత లాంటి వ్యాధులు కారణం కావచ్చు. కాబట్టి ముందుగా ఏ కారణం చేత బరువు పెరగడం లేదో ఒకసారి డాక్టరుతో పరీక్ష చేయించాలి. ఏ వ్యాధి లేదని తేలితే అప్పుడు ఆహారపు అలవాట్లే కారణం అని నిర్ధారణకు రావచ్చు. కొందరు పిల్లలు సన్నగా ఉన్న ఎనర్జిటిక్‌గా ఉంటారు. అటువంటి వారితో ఇబ్బందిలేదు. సన్నగా, బలహీనంగా ఉన్న పిల్లలతోనే సమస్యలు వస్తుంటాయి. బరువు పెరగలాంటే ఎక్కువ శక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలి. అందుకు తగ్గట్టుగా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు మూడు పూటల ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజు తీసుకునే ఆహార పదార్థాలలో డ్రైఫ్రూట్స్, నట్స్ ఉండేలా చూసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయగానే తప్పకుండా ఏదైనా ఒక ఫ్రూట్‌ను తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్-లంచ్‌కు మధ్యలో స్నాక్స్ తీసుకోవాలి. దీనివల్ల అదనపు క్యాలరీలు లభిస్తాయి. రాత్రి అన్నం తిన్న వెంటనే గ్లాసు పాలు, ఒక ఫ్రూట్ తీసుకోవాలి. బరువు పెరగాలనుకునే వారికి రోజుకు ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. కంటి నిండా నిద్ర పోతేనే బరువు పెరగటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి రోజు చేసుకునే కూరలలో నువ్వుల పొడి, పల్లీల పొడి వేసుకుంటే అదనపు శక్తి లభిస్తుంది. పిల్లలకు నువ్వులతో చేసిన లడ్డూలు, పల్లి లడ్డూలు పెడితే ఐరన్‌తో పాటు బరువు పెరగటానికి అవసరమైన పోషకపదార్థాలు లభిస్తాయి. మొక్కజొన్న, గోధుమ, రాగులు, సజ్జలు తదితర ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు పెట్టినా బరువు పెరుగుతారు. అన్నంలో నెయ్యి వేసుకుంటే అదనపు శక్తి లభిస్తుంది.