శరీరబరువు తగ్గించుకోవడం కోసమో, మెరుగైన ఆకృతి కోసమో ఎక్సర్సైజ్లు చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అయితే చాలా కొద్దిమంది మాత్రమే ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఇందుకు కారణం వారు శ్వాస తీసుకునే విధానం అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్లు. వర్కవుట్స్‌తో మంచి ఫలితాలు రావాలంటే గంటల తరబడి ఎక్సర్సైజ్లు చేయడమే కాదు శ్వాస మీద ధ్యాస కూడా ముఖ్యం అన్నది స్పష్టం చేస్తున్నారు. అన్ని సార్లు ఒకే మాదిరిగా కాకుండా కొన్ని రకాల జబ్బులకు శ్వాస తీసుకునే విధానంలో పద్ధతి పాటించాలని సూచిస్తున్నారు. చెమట చిందేలా ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు శ్వాస తీసుకోవడం పై శ్రద్ద వహించినప్పుడే వర్క్‌వుట్స్ మెరుగైన ఫలితాలను ఇస్తాయి. అయితే ఎక్సరెసైజ్లు ఎందుకోసం చేస్తున్నారో దానిని బట్టి శ్వాస తీసుకోవడంతో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. ఫిట్నెస్ట్రైనర్కు ముందుగానే ఎందుకోసం వర్క్‌వుట్స్ చేస్తున్నారన్నది చెప్పితే వారు సరైన బ్రీతింగ్ విధానం సూచిస్తారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడేవారిని ఎక్సర్సైజ్లు చేయమని డాక్టర్లు సూచిస్తారు. అయితే వారు ఎక్సర్సైజ్లు చేసేటప్పుడు గాలి ఎక్కువసేపు పీల్చుకోవాలి. తక్కువగా గాలి పీలుస్తున్నారు అంటే మీరు ఎక్కువగా కష్ట పడుతున్నారన్న మాట. పరిగెత్తేటప్పుడు వేగానికి అనువుగా ఊపిరి తీసుకోవడం చాలా కీలకం. నడిచేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, ట్రెడ్మీల్పై ఉన్నప్పుడు శ్వాస తీసుకునే విధానంలో మార్పు ఉండే మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది బాడీబిల్డింగ్ కోసం ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. వీరు ముఖ్యంగా షోల్డర్స్ షేప్ కోసం డంబెల్స్ ఎత్తేటప్పుడు, పుషప్స్, బైసిప్స్ చేసేటప్పుడు గాలి బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా బరువులు ఎత్తగలరు. మోచేతుల మీద శరీర బరువును నిలిపి, శరీరాన్ని నేలకు వంచి వ్యాయామాలు చేసేటప్పుడు గాలి పీల్చుకోవాలి. చేసే ఎక్సర్సైజ్లకు తగ్గట్టు, శ్వాస తీసుకుంటే తొందరగా అలసిపోరు. ఆశించిన విధంగా బాడీ బిల్డప్ చేసుకోవడం సాధ్యమవుతుంది. మరి కొంతమంది స్ట్రెచప్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. వీరు గుర్తించుకోవల్సిన ముఖ్యమైన విషయం స్ట్రెచప్స్ సేటప్పుడు నెమ్మదిగా, తక్కువగా శ్వాస పీల్చుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చి వదలడం వల్ల పొట్ట కండరాలకూ వ్యాయామం లభిస్తుంది. మెరుగైన శరీరాకృతి సొంతమవుతుంది.