ఆస్టియోపోరోసిస్ వ్యాధి సైలెంట్ కిల్లర్ లాంటిదని వైద్యులు అంటున్నారు. కారణం ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు త్వరగా బయట పడవు. 'బోన్ మాస్' లేదా 'బోన్ టిష్యు'లకు సంబంధించిన ఈ వ్యాధి కారణంగా ఎముకలు గుల్లబారి విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనదేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో (మెనోపాజ్ తర్వాత) ఒకరు, అరవై ఏండ్లు పైబడిన వారు ఈ వ్యాధిబారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ప్రతి ఏడాది ఎముకలు విరిగినవారిలో 80 శాతంమందిలో ఆస్టియోపోరోసిస్యే కారణం...
వయసు పెరిగే కొద్ది ఎముకలు గుల్లబారి సులువుగా విరిగిపోవడాన్ని 'ఆస్టియోపోరోసిస్' అంటారు. ఈ వ్యాధి శరీరములో సైలెంటుగా ఉండి, రోగ లక్షణాలు బయటపడకుండానే చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోతాయి. ఎముకలు పలుచబడి బోన్ మినరల్ డెన్సిటీ తగ్గి ఎముక పటుత్వాన్ని కోల్పోయి తేలికగా ఎముకలు విరగడం జరుగుతుంది. ఈ ఫ్రాక్చర్ ఎక్కువగా మణికట్టు (రిస్ట్), తొంటి (హిప్స్), వెన్నుఎముకల దగ్గర ఎక్కువగా జరుగుతుంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వచనం ప్రకారం ఎముక సాంద్రత 2.5కంటే తక్కువ ఉండడానిన ఎనర్జీ ఎక్స్‌రే అబ్బార్ప్పమెట్రీ ద్వారా ఆస్టియోపోరోసిస్ అని నిర్థారిస్తారు.
ఆస్టియోపోరోసిస్ ఎన్ని రకాలు?
ఆస్టియోపోరోసిస్‌ను రెండు రకాలుగా విభజించారు.
ప్రైమరీ టైప్
టైప్ 1 మెనోపాజ్ తర్వాత వయసులో ఉన్నవారిలో వచ్చే సమస్య
టైప్ 2 సెనిల్ ఆస్టియోపోరోసిస్. ఇది 75 ఏండ్ల వయసు తర్వాత వచ్చే సమస్య
సెకండరీ ఆస్టియోపోరోసిస్ - ఇది ఇతర అనారోగ్య కారణాల వల్ల వచ్చే సమస్య
ఎవరిలో ఎక్కువగా..
ఒకప్పుడు ఇది వ ద్ధాప్యంలో మాత్రమే వచ్చే సమస్యగా ఉండేది. కాని మారిన జీవనశైలి వల్ల ఈ సమస్య చిన్నవయసు వారిలోనే వస్తోంది.
- మహిళల్లో మెనోపాజ్ వల్ల లేదా అండాశయాలు తొలగించడం వల్ల ఈస్ట్రోజన్ లోపం ఏర్పడిన మహిళలకు,
- మెనోపాజ్ దశకు త్వరగా చేరిన వారిలో
- ఎముకల స్ట్రక్చర్ చిన్నగా ఉండేవారిలో
- ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేవారిలో
- విటమిన్ డి లోపం ఉన్నవారిలో
- పౌష్టికాహార లోపం ఉన్నవారికి ఎక్కువగా ఈ సమస్య వస్తుంది.
- కార్పోనేటెడ్ పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది.
కారణాలు
- కాల్షియం, విటమిన్ డి తక్కువ కావటం
- అధిక బరువు, వ్యాయామం లేకపోవటం
- మద్యపానం, ధూమపానం అధికంగా సేవించడం
- కొన్ని వ్యాధులకు వాడే స్టిరాయిడ్స్ వలన
రోగ నిర్థారణ
చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం, తరుచుగా ఎముకలు నొప్పిగా ఉండటం, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఉండటం.
పరీక్షలు: బోన్ మినరల్ డెన్సిటీ ఎస్టిమేషన్, ఎక్స్‌రేలు, రక్తపరీక్షలు
చికిత్సా విధానాలు
కాల్షియం థెరపీ: కాల్షియం కార్బోనేట్(40శాతం ఎలిమెంటల్ కాల్షియం ఈసీ), కాల్షియం ఫాస్పేట్(31శాతం ఈసీ), కాల్షియం లాక్టేట్ (13శాతం ఈసీ), కాల్షియం సిట్రేట్ కలిగిన సప్లిమెంట్లు ఇస్తారు.
విటమిన్ డి: ఎముకల గట్టిదనానికి కావల్సిన కాల్షియం శోషణకు విటమిన్ డి ఎంతో ఉపయోగపడుతుంది.
ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ : ఇది చాలా అరుదుగా అవసరమవుతుంది.
క్యాల్షిటోనిన్ : మెనోపాజ్ తర్వాత కనీసం ఐదేండ్లు గడిచిన వారికి క్యాల్షిటోనిస్ అనే కృత్రిమ హార్మోన్ ఆస్టియోపోరోసిస్‌కు చికిత్సగా వాడుతారు. ఇది ముక్కుద్వారా ఉపయోగించే స్ప్రేరూపంలో అందుబాటులో ఉంటుంది.
డీనో సుమాట్ (ప్రోలియా) : దీన్ని ఆస్టియోపోరోసిస్ చాలా ఎక్కువగా ఉండి ఎముకలు విరగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న మహిళలకు ఇది ఇస్తారు.
రిలాక్సిఫిన్ : ఇది ఈస్ట్రోజన్ అంటగొనిస్ట్. ఇది ఈస్ట్రోజన్ కాదు, హార్మోన్ కూడా కాదు. కానీ ఈస్ట్రోజన్లా పనిచేస్తుంది. దీన్ని రోజుకు 60ఎంజీ టాబ్లెట్ భోజనంతో గానీ, భోజనానికి ముందుగానీ తీసుకోవచ్చు.
బై పాస్పనేట్స్ : అలెండ్రోనేట్ గ్లూకోకార్డియిడ్ వల్ల ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు ఈ మందు ఉపయోగిస్తారు. ఇది ఎముక నష్టాన్ని తగ్గించి, ఎముక సాంద్రత పెంచుతుంది.
రెసిడ్రొనేట్ సోడియం: మెనోపాజ్ తర్వాత వయసులో ఉన్న మహిళలకు ఇబాండ్రోనేట్ సోడియం మందు వాడుతారు. రోజుకు 5ఎంజీ టాబ్లెట్ వేసుకోవాలి. ఇవి కాల్షియంతో కలిసి , కాల్షియం లేకుండా కూడా మార్కెటులో లభిస్తాయి.
జోలెండ్రోనిక్ ఆసిడ్: దీన్ని ఏడాదికి ఒకసారి ఆస్టియోపోరోసిన్ రాకుండా నివారించడానికి కూడా ఇవ్వవచ్చు. ఈ చికిత్సకు ముందు రెండు రక్తపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకటి కిడ్ని పనితీరు తెలుసుకోవడానికి, మరొకటి రక్తంలో కాల్షియం స్థాయి ఎలా ఉందో తెలుసుకోవడానికి
అనబాలిక్ మందులు..
టెరిపారైడ్ : ఇది పారాథైరాయిడ్ హార్మోన్ రూపం. ఇది ఎముక నిర్మాణానికి తోడ్పడే హార్మోన్. ఇది ఆస్టియోపోరోసిన్ తగ్గించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన మందు. ఈ మందులు గుళ్లబారిన ఎముక సాంద్రతను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇది ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు విరిగే పరిస్థితి ఉన్నవారికి చాలా మంచి మందు.
కాంబినేషన్ డ్రగ్ థెరపీ: రెండు రకాల మందులు కలిపి చికిత్సకు ఉపయోగిస్తారు. చెరిపారటైడ్ అనే అనబాలిక్ ముందు ఎముక సాంద్రత పెంచుకోవడానికి, డెనోసంబ్ అనే మందు ఎముక నష్టాన్ని నివారించడానికి ఈ రెండు మందులను కలిపి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
జాగ్రత్తలు
- సూర్యరశ్మి తగిలేటట్లుగా ఉదయం ఎండలో నడవాలి.
- కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
- బరువున్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.
- అధిక బరువు వ్యాయామాలు చేయకూడదు. సాధారణ వ్యాయామాలు రోజూ చేయాలి.
- పెద్ద పెద్ద బరువులు మోయడం మానివేయాలి
- సరైన పాదరక్షలు వాడాలి (హైహీల్స్ వాడటం తగ్గించాలి)
- వయసు పైబడినవారు చేతి కర్రను ఉపయోగించాలి.
- ఇంటి ఆవరణలు, బాత్రూముల్లో జారుడు స్వభావం లేకుండా చూసుకోవాలి.
- మద్యపానం, ధూమపానం మానివేయాలి
Authorization