- నేడు ప్రపంచ హైపర్ టెన్షన్ డే
హైపర్‌టెన్షన్ వల్ల వేలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరిలోనా హైపర్‌టెన్షన్ కనిపిస్తుంది. అధిక రక్తపోటునే హైపర్‌టెన్షన్ అంటారు. అసలు హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అంటే ఏమిటి? ఏ కారణాల వల్ల వస్తుంది? దీనిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాల మీద అవగాహన ఉంటే హైపర్‌టెన్షన్ కారణంగా సంభవించే మరణాల సంఖ్యను చాలావరకు తగ్గించవచ్చు.
అధిక రక్తపోటు వల్ల రక్తనాళాల్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రక్తనాళ గోడలమీద ఒత్తిడి పెరగడం వల్ల రక్తనాళాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ఈ కారణంగానే హార్ట్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్ సంభవిస్తాయి. హైపర్‌టెన్షన్ కారణంగా కేవలం అమెరికాలోని 50ఏండ్లు పై బడిన వారిలో 30శాతం మంది పెద్దలు గుండె సంబంధమైన వ్యాధుల బారిన పడుతున్నారు. హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు రావడానికి అనేక కారణాలున్నాయి. లక్షణాలను బట్టీ కారణాలు తెలుసుకోవచ్చు. నిర్ధారణ పరీక్షలు, చికిత్స, నివారణ చర్యలు తీసుకుంటే అధిక రక్తపోటు నుంచి బయటపడవచ్చు.
రక్తనాళాల్లో ఒత్తిడి..
శరీరంలోని రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు రక్తనాళాల గోడల మీద పడే పీడనామే రక్తపోటు. దీన్ని 'స్పిగ్మోమానోమీటర్' సహాయంతో కొలుస్తారు. రక్తం ప్రవహించేటప్పుడు కలిగే ఒత్తిడిని కొలిచేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రెండు సంఖ్యలతో సూచిస్తారు. మొదటి (పై) సంఖ్యను 'సిస్టాలిక్ప్రెషర్ ', రెండో (కింది) సంఖ్యను 'డయాస్టాలిక్ ప్రెషర్' అంటారు. సిస్టోలిక్ ప్రెషర్ గుండె కొట్టుకునే వేగాన్ని కొలుస్తుంది. డయాస్టోలిక్ ప్రెషర్ మాత్రం రక్తనాళాల్లో ఉన్న ఒత్తిడిని కొలుస్తుంది. ఈ రెండు కొట్టుకోవడానికి మధ్యలోనే గుండె విశ్రాంతి పొందుతుంది.
పుట్టినప్పుడు 64/40 ఉన్న బ్లడ్‌ప్రెషర్ పెరిగి పెద్దయిన తర్వాత 120/80కి చేరుకుంటుంది. ఇది సాధారణ రక్తపోటు. నడుస్తున్నప్పుడు లేదా పరుగెత్తుతున్నప్పుడు ఈ రక్తపోటు అంకె పెరుగుతుంది. హైపర్‌టెన్షన్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండదు. సిస్టోలిక్ ప్రెషర్ 135 నుంచి 105 వరకు ఉండవచ్చు. డయాస్టాలిక్ ప్రెషర్ 90 నుంచి 65వరకు ఉండవచ్చు. దీనివల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదు. భావోద్వేగాల్లో కూడా రక్తపోటు హెచ్చు తగ్గులుంటాయి. బ్లడ్ ప్రెషర్ రీడింగ్ 140/90 ఉంటే అధిక రక్తపోటు వచ్చినట్లుగా పరిగణించాలి. కనీసం మూడుసార్లయినా చెక్ చేయించాలి.
లక్షణాలు..
చాలామందికి తమకు అధిక రక్తపోటు వచ్చిన విషయాన్ని కూడా గమనించలేరు. స్పష్టమైన లక్షణాలు అంటూ ఏమీ కనిపించవుద. నిశ్శబ్దంగా ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే ప్రాణాలను హరించే సైలెంట్ కిల్లర్ ఇది. కాస్తా నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. తరచుగా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్యపరీక్షలు చేయిస్తే హైపర్‌టెన్షన్ గురించి తెలుసుకోవచ్చు. కొందరిలో తరచుగా తీవ్రమైన తలనొప్పి, నీరసం, దృష్టిలోపం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, హర్ట్బీట్లో తేడాలు , చెవుల్లో శబ్దాలు వినిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి ఇతర అనారోగ్య సమస్యల్లోనూ కనిపిస్తాయి.
కారణాలు..
హైపర్‌టెన్షన్ ఎందుకు వస్తుంది అనే విషయాల మీద సమగ్రంగా అధ్యయనం చేస్తే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనదేశంలో హైపర్‌టెన్షన్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాతో పాటు మరో నాలుగు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో తాజాగా కొన్ని విషయాలు స్పష్టమైనవి.
మనదేశంలో హైపర్‌టెన్షన్ బారిన పడినవారిలో 15-49 ఏండ్ల మధ్య వయసువారే ఎక్కువగా ఉన్నారు. అయితే వారిలో 55శాతం మందికి తమకు హైపర్‌టెన్షన్ ఉందన్న సంగతే తెలియదు. గత ఏడాదిలో సంభవించిన మొత్తం మరణాల్లో 10శాతం పైగా మరణాలకు హైపర్టెన్షనే కారణం.
కుటుంబచరిత్రలో అధిక రక్తపోటు ఉన్న సభ్యులు ఉన్నప్పుడు, గుండె వ్యాధులు, మధుమేహం తదితర జబ్బులు అనువంశికత వల్ల వస్తున్నట్లయితే హైపర్ టెన్షన్ వస్తుంది.
- అధిక బరువు
- శారీరక శ్రమ తగినంతగా లేకపోవడం
- ధూమపానం, మద్యం సేవించిండం
- ఉప్పు ఎక్కువగా తింటే
- బర్త్ కంట్రోల్ పిల్స్, పెయిన్ కిల్లర్స్, బ్రూఫిన్, యాస్ప్రిన్, మాదక ద్రవ్యాలు తీసుకున్ననేవారిలోనూ, జీవనశైలి వల్ల కూడా ఎక్కువమంది హైపర్‌టెన్షన్‌కి గురిఅవుతున్నారు.
- శరీరంలో నీటి శాతం తగ్గినా లేదా బలహీనంగా ఉన్న వారు తొందరగా ఆందోళనకు గురవుతారు. ఈ సమస్యల వల్ల అల్ప లేదా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
- ప్రెగెన్సీ సమయంలో కూడా లో, హై బీపీ వస్తుంది. ఇందుకు కారణం హార్మోన్ల లో వచ్చే మార్పులు. కాబట్టి గర్భిణీలు నెలకొసారి వైద్యుల సలహా ప్రకారం బీపీ చెక్ చేయించుకోవాలి. అవసరమైతే మందులు వేసుకోవాలి.
- థైరాయిడ్, రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా ఉన్నా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.
- శరీరంలో విటమిన్ బి12, ఫోలెట్ తగ్గిన అల్ప రక్తపోటు వస్తుంది.
జాగ్రత్తలు..
హైపర్ టెన్షన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారిలో 80శాతం వరకు ఎందుకు వస్తుందో తెలియదు. కేవలం 20శాతం వారిలో మాత్రమే కారణాలు తెలుస్తాయి. బ్లడ్‌ప్రెషర్‌ను కంట్రోల్లో ఉంచుకుంటే 90శాతం వరకు దాని వలన కలిగే ప్రమాదానాలను అరికట్టవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైపర్‌టెన్షన్ రాకుండా నివారించాలి.
- హైపర్‌టెన్షన్ ప్రభావం గుండెమీద, ఇతర శరీర వ్యవస్థలపై పడకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. రెగ్యులర్ డైట్ లో హైపర్ టెన్షన్ తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి.
- కొన్నిసార్లు హైపర్ టెన్షన్ కు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల, రెగ్యురల్ గా చెకప్ చేయించుకోవడం మంచిది.
- మనం తీసుకొనే ఆహారం రక్తకణాల మీద ఎఫెక్టివ్ గా పనిచేసి హార్ట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫొల్లెట్, పొటాసియం, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆకుకూరలు హెల్తీ బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో సహాయపడుతాయి.
- బీన్స్ లో కూడా పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో సహాయపడుతాయి.
- అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీరంలో సోడియంను తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు.
- బీపీని కంట్రోల్లో ఉంచడానికి బీట్ రూట్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. చాలా తక్కువ సమయంలోనే ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది.
- రెగ్యులర్ డైట్ లో తృణధాన్యాలను తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
- శరీరబరువును అదుపులో ఉంచుకోవాలి
- ధుమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలి- ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుంటే చాలావరకు హైపర్ టెన్షన్ రాకుండా నివారించవచ్చు.
హైపర్ టెన్షన్ వల్ల వచ్చే సమస్యలు..
- హైపర్‌టెన్షన్ వల్ల ఎలాంటి లక్షణాలు బయటకు స్పష్టంగా కనిపించకున్నా అంతర్గత శరీరభాగాలను దెబ్బతీస్తుంది.
- గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతిని సరఫరాలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో గుండె కండరానికి రక్తసరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
- రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడం వల్ల గుండె మరింత బలంగా పనిచేయాలి వస్తుంది. ఈ కారణంగా కొందరిలో హర్ట్ ఎన్లార్జ్ కావచ్చు. మరి కొందరిలో గుండె తగినంత రక్తాన్ని శరీరానికి సరఫరా చేయలేక హార్ట్‌ఫెయిల్యూర్ కావచ్చు.
- కొన్ని సార్లు హైపర్‌టెన్షన్ వల్ల మెదడులోని రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కొందరిలో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడితే... మరికొందరిలో రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తం కారి బ్రెయిన్ డెడ్ కావచ్చు. కోమాలోకి వెళ్లడం, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు.
- శరీర ముఖ్యభాగల్లో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మూత్రపిండాల చుట్టూరా ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల రక్తాన్ని వడపోసే ప్రక్రియలో అడ్డంకులు వస్తాయి. ఈ కారణంగా మూత్రపిండాల పనితీరులో మార్పులు వచ్చి, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది.
- డాక్టర్ లక్ష్మణ్ రావు
ఎం.బి.బిఎస్
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్
Authorization