ఎండల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే సీజన్ మారినప్పుడల్లా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువగా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య జలుబు. దీంతోపాటు కొందరికి ముక్కు దిబ్బడ, దగ్గు కూడా ఉంటాయి. సాధారణంగా జలుబు వచ్చినప్పుడు మందులు వాడితే వారం రోజుల్లో తగ్గుతుంది.. లేకపోతే ఏడురోజుల్లో తగ్గుతుంది అంటారు. అయితే జలుబు నుంచి కాస్త రిలీఫ్ పొందడానికి మాత్రం ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించవచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చినచెక్క వేసి బాగా మరిగించి అనంతరం ఆ నీటిని వడకట్టి, దానికి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. జలుబును తగ్గించడంతో తులసి బాగా పనిచేస్తుంది. తులసి ఆకులతో టీ చేసుకుని తాగినా జలుబును తగ్గించుకోవచ్చు. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, దాల్చినచెక్క పొడి, తేనెలను వేసి కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగినా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే త్వరగా జలుబు అంతగా బాధించదు. రాత్రి నిద్రించబోయే ముందు పాలు తాగితే రాత్రి సమయంలో జలుబు వల్ల ఇబ్బంది కలగదు. హాయిగా నిద్రపడుతుంది.