మన శరీరంలో జరిగే ప్రతీ ప్రక్రియకు శక్తి అవసరం. దీనినే మనం క్యాలరీల్లో లెక్కిస్తాం. మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి జీవక్రియలకు తోడ్పడుతుంది. ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీలు అవసరమో వారి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి 2200 క్యాలరీలు తీసుకోవచ్చు. సమతుల ఆహారంలో క్యాలరీలను బట్టి ప్రొటీన్స్, ఫ్యాట్, విటమిన్స్ మారుతుంటాయి. పెరిగే వయసు వారికి, పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అవసరం కాబట్టి వారి ఆహారంలో క్యాలరీలు ఎక్కువగా ఉండాలి. మధుమేహం ఉన్నవారికి క్యాలరీలు సరిగ్గా సరిపడా ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక క్యాలరీలు తీసుకోవాలి. ఇలా క్యాలరీల అవసరం మారుతుంటుంది. అంతేకాదు మన రోజువారి పనిని బట్టి కూడా క్యాలరీల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుత జీవన విధానానికి 1600 నుంచి 1800 క్యాలరీల ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. అందుకే డాక్టర్లు క్యాలరీలు తగ్గించాలి అంటారు. చాలా సింపుల్గా క్యాలరీలు తగ్గించవచ్చు. ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహార పదార్థాలైన కొవ్వు పదార్థాలు, పంచదార, స్వీట్లు, ఫ్రై ఫుడ్, కూల్డ్రింక్స్, బిస్కెట్లు, కేకులు, ఐస్క్రీమ్లు, పిజ్జా, బర్గర్ తక్కువగా తీసుకోవాలి.