కొలెస్టరాల్ అన్నది మన శరీరానికి అవసరమైన ముఖ్య పదార్థాల్లో ఒకటి. కానీ, అవసరానికి మించితే ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అసలు ఈ కొలెస్టరాల్ పని ఏంటి, ఎంత మేర అవసరం అన్నది తెలుసుకోవాలి. దీని కారణంగా వచ్చే అనారోగ్యసమస్యలను నివారించడం సాధ్యమవుతుంది.
- తీసుకున్న ఆహార పదార్థాల జీర్ణానికి అవసరమైన రసాలను పేగుల్లో ఉత్పత్తి చేసేందుకు కొవ్వు కావాలి. శరీరంలో విటమిన్ డి, హార్మోన్లు తయారు చేసేందుకు ఇది అవసరం. కొలెస్టరాల్ రక్తంలో కలిసిపోదు. లిపో ప్రోటీన్లతో పాటు శరీరంలోని అన్ని కణాలకు చేరుతాయి. కణాలకు గోడలుగా కొవ్వు పనిచేస్తుంది. మనకు ఎంత కావాలో అంత మేర కొవ్వును మన శరీరమే సహజసిద్ధంగా తయారు చేస్తుంది. తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి అధిక కొవ్వు వచ్చి చేరుతుంది. సూర్యరశ్మి మన చర్మంపై పడినప్పుడు, చర్మంలో ఉండే కొలెస్టరాల్ ఆ కిరణాలను విటమిన్ డిగా మారుస్తుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుని, సూర్యరశ్మి సోకకుండా ఉండేవారిలో ఇది అధికబరువు, అనారోగ్యసమస్యలకు కారణం అవుతుంది.
- మన శరీరంలోని ప్రతీ కణంలోనూ కొలెస్టరాల్ ఉంటుంది. కానీ పరిమితి దాటితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె నుంచి రక్తం తీసుకెళ్లే ధమనుల్లో అది పేరుకుపోతుంది. అప్పుడు ధమనులు గట్టిపడిపోతాయి. కొన్నిసార్లు కొవ్వు కారణంగా రక్త సరఫరా సమస్యలు ఏర్పడతాయి. ధమనులు కుచించుకుపోయి రక్తసరఫరాలో అడ్డంకులు వస్తాయి. ఈ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
- కొలెస్టరాల్ ను ఎల్ డీఎల్, హెచ్ డీఎల్ అని రెండు రకాలు. ఎల్ డీఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. ఇది పరిమితి దాటితే ముప్పు తెచ్చి పెడుతుంది. అందుకే దీన్ని బ్యాడ్ కొలెస్టరాల్ గా పిలుస్తుంటారు. హైడెన్సిటీ లిపోప్రొటీన్స్ (హెచ్ డీఎల్)ను మంచి కొవ్వుగా చెబుతారు. ఎల్ డీఎల్ ఎక్కువైతే గుండె జబ్బులు, గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్టుగా భావించాలి. హెచ్ డీఎల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం తక్కువ అన్నట్టు భావించొచ్చు. ఓ వ్యక్తి గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందా, లేదా అన్నది వైద్యులు నిర్ధారించేందుకు ఈ కొలెస్టరాల్ స్థాయిలు కీలకమైనవి. మధుమేహం, లివర్ లేదా కిడ్నీ వ్యాధులు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, గర్భం దాల్చినప్పుడు హార్మోన్ల స్థాయిలు పెరగడం, థైరాయిడ్ గ్రంధి క్రియాశీలకంగా లేకపోవడం, కొన్ని రకాల ఔషధాలు (స్టెరాయిడ్స్) వాడకం వంటి సందర్భాల్లో అధిక కొలెస్టరాల్ కు దారితీయవచ్చు.
- ఆరోగ్యవంతులైన వారు రోజులో 300 మిల్లీ గ్రాములకు మించి కొవ్వు తీసుకోరాదు. మధుమేహంతో బాధపడే వారు, అప్పటికే అధిక కొలెస్టరాల్, గుండె జబ్బులున్నవారు రోజులో తీసుకునే కొవ్వు పరిమాణాన్ని 200 మిల్లీ గ్రాములకు మించకుండా జాగ్రత్త తీసుకోవాలి.
Authorization