చాలామంది తరచుగా జలుబు, జ్వరం ఇలా ఏదో ఒక ఇన్ఫెక్షన్బారిన పడుతుంటారు. ముఖ్యంగా సీజన్ మారినప్పుడల్లా చిన్నచిన్న అనారోగ్య సమస్యలలో బాధపడుతుంటారు. ఇందుకు కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ తగ్గడమే. చాలావరకు పుట్టుకతోనే ఆయా వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు తగినన్ని పోషకాలు తీసుకోకపోయినా, ఇన్ఫెక్షన్లు వచ్చినా పుట్టే బిడ్డకు వ్యాధినిరోధకతలో లోపం ఏర్పడవచ్చు. కాబట్టి గర్భిణిగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిపాల నుంచే బిడ్డకు ఈ శక్తి వస్తుంది. దీనిని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. - జీవనశైలిలో మార్పులతో అనేక ఆరోగ్యసమస్యలు వస్తున్నాయి. వాటిని తట్టుకోవాలంటే వాతావరణ కాలుష్యం బారిన పడకుండా సాధ్యమైనంతవరకు జాగ్రత్తపడాలి. - కాల్షియం లోపిస్తే ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, కోడిగుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. - తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల ఫ్రీ రాడికల్స్ తగ్గిపోయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. - అధిక ఒత్తిడికి లోనవద్దు. ఒత్తిడి తగ్గించుకునేందుకు బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ప్రాణాయామం సహకరిస్తాయి. ప్రాణాయామం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ చురుకుదనం కూడా పెరుగుతుంది. - ఇమ్యూనిటీ తగ్గకుండా ఉండాలంటే తగినంత శారీరక శ్రమ అవసరం. కాబట్టి రోజూ వ్యాయామం చేయాలి. - పొగతాగడం, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.