కాలి సిరల్లో రక్తం నిల్వ ఉండటం వల్ల తలెత్తే ఉబ్బు (వెరికోజ్ వీన్స్) చాలామందిని పెద్దగా ఇబ్బందేమీ పెట్టదు. కానీ కొందరిని నొప్పితో తీవ్రంగా వేధిస్తుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో దీని ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సిరల్లో నిల్వ ఉన్న రక్తం పైకి చేరుకోవటానికి దోహదం చేస్తుంది. కాబట్టి పిక్క కండరాలకు పని కల్పించే తేలికైన వ్యాయామాలు- ఈత, నడక, సైకిల్ తొక్కటం వంటివి చేయటం మంచిది. ప్రత్యేకంగా తయారుచేసిన బిగుతైన సాక్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి కాలి కండరాలకు గట్టిగా పట్టుకొని.. రక్తం పైకి చేరుకోవటానికి తోడ్పడతాయి. ఉప్పు ఒంట్లోంచి నీరు బయటకు వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి ఉప్పు తగ్గించటం మంచిది. అలాగే ఒంట్లోంచి నీరు బయటకు వెళ్లేలా చేసే పొటాషియంతో కూడిన బాదం, పిస్తా వంటి గింజపప్పులు తినటం మేలు. మరీ బిగుతైన దుస్తులు ధరిస్తే నడుం కింది భాగానికి రక్త సరఫరా తగ్గుతుంది. కాబట్టి వదులైన దుస్తులు ధరించాలి. అలాగే ఎత్తు మడమల చెప్పులకు బదులు మామూలు చెప్పులు ధరిస్తే మంచిది. మల విసర్జనకు కూచున్నప్పుడు బాగా ముక్కితే సిరల్లోని కవాటాలు దెబ్బతినొచ్చు. ఇది సమస్యను మరింత తీవ్రం చేయొచ్చు. కాబట్టి మలబద్ధకం దరిజేరకుండా పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువసేపు కూర్చొని పనులు చేసేవారు మధ్య మధ్యలో లేచి అటూఇటూ అడుగులు వేయటం మంచిది. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే కాళ్లకు, పాదాలకు రక్తసరఫరా తగ్గుతుంది. అందువల్ల కాలు మీద కాలు వేసుకొని కూర్చోవద్దు. నిద్రపోయేటప్పుడు కాళ్ల కింద ఎత్తు పెట్టుకోవటం మేలు. గుండెకు సమానంగా లేదా ఎత్తుగా కాళ్లు ఉంటే సిరల్లో ఒత్తిడి తగ్గుతుంది. గురుత్వాకర్షణ ప్రభావంతో రక్తం తేలికగా గుండెకు చేరుకుంటుంది.