మూత్రపిండం అనేది మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. రక్తంలోని వ్యర్థ పదార్థాలు తొలగించడంతో పాటు శరీరంలో ద్రవాల స్థాయిలు నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాలు ప్రతిరోజూ 180 లీటర్ల రక్తాన్ని వడపోయడం ద్వారా 2 లీటర్ల 800 మి.లీ వ్యర్థ పదార్థాలతో పాటు అదనపు నీటిని తొలగిస్తోంది. కాబట్టి, ఇంత కీలకమైన మూత్ర పిండాలు చక్కగా పనిచేయాలంటే, వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా కీలకం.
వ్యర్థాలు, అదనపు ద్రవాలు పోగుపడడం నివారించడంతో పాటు మూత్రపిండాలనేవి ఎలక్ట్రోలైట్ స్థాయిలను స్థిరంగా ఉంచడంతో పాటు ఎర్ర రక్త కణాలను తయారుచేసే హార్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తాయి. అత్యధిక రక్తపోటు, మధుమేహం లేదా వంశ చరిత్రలో మూత్ర పిండాల వైఫల్యం కలిగిన వాళ్లకి దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటి అత్యధిక ప్రమాదం ఉన్న విభాగంలో ఉండకపోయినా మూత్రపిండాలను ఆరోగ్యకరంగా ఉంచుకోవడం ప్రతిఒక్కరికీ చాలా ముఖ్యం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు అవి చక్కగా పనిచేయాలంటే, కింద ఇచ్చిన ఐదు జీవనశైలి మార్పులను అనుసరించడం ఉత్తమం.
1. నీళ్లు తాగుతూ ఉండండి..
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలు చక్కగా పనిచేస్తాయి. సగటున 70 కిలోల బరువుండే వ్యక్తి డీహైడ్రేషన్ సమస్య తప్పించుకోవాలంటే దాదాపు 2500 మిల్లీలీటర్ల నీళ్లు తాగాలి. శరీరంలో తగినంత నీళ్లుంటే మూత్రం లేతరంగులో ఉంటుంది. ఒకవేళ మూత్రం ముదురు రంగులో ఉంటే, మీ ఆహారంలో మరిన్ని ద్రవాలు భాగం కావాలని చెప్పేందుకు అదొక సంకేతం. కొన్ని ఔషధాల కారణంగా కూడా మూత్రం రంగు మారుతుంది. ఆహారంలో డైయూరిటిక్స్ తీసుకోవడం తగ్గించుకోండి. అవి మీ శరీరంలో మూత్రం అధికంగా తయారయ్యేలా చేయడంతో పాటు శరీరం సోడియం, నీటిని కోల్పోయేందుకు కారణమవుతాయి.
2. స్వీయ పరిశీలన
ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో 40 - 60శాతం కేసుల్లో మధుమేహం, అధిక రక్తపోటు అనేవి దీర్ఘకాలిక మూత్రపిండాాల వ్యాధికి కారణం అవుతున్నాయి. ఒకవేళ మీకు అలాంటి రుగ్మతల సమస్య ఉంటే, క్రమం తప్పకుండా వాటిని పరీక్షించుకోవడం ద్వారా, వాటి స్థాయిలు పెరగ కుండా చూసుకోవాలి. మీ ఫ్యామిలీ డాక్టర్‌తో చర్చించడం ద్వారా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడాదికి కనీసం రెండుసార్లు రక్తపరీక్షలు చేయించుకోవాలి. అయితే మీరు ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతుంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. రక్తపోటు ఎక్కువగా ఉంటే, తరచూ చెక్ చేయించుకోవడం ద్వారా దానిని నియంత్రణలో ఉంచుకుని మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీ రక్తపోటు తగ్గించడానికి సాయపడుతుంది.
3. ఆరోగ్యకరమైనవి తినండి
ఆరోగ్యకరమైన, సమతౌల్య ఆహారం తీసుకోవడం తో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసు కోవాలి. జీవనక్రియలకు అవసరమైన విటమిన్లు , ఖనిజ లవణాలు పుష్కలంగా శరీరంలోకి చేరేలా జాగ్రత్త వహించండి. శరీర అవయవాలు చక్కగా పనిచేసేలా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. చక్కటి ఆరోగ్యానికి అవసరమైన పరిమాణంలోని పోషకాలనేవి ఏ ఒక్క ఆహారం తో లభించవు. కాబట్టి, ఒకే రకం ఆహారం తీసుకోవడానికి స్వస్తి చెప్పండ. ఆయా కాలాల్లో లభించే విభిన్న ఆహారాలు తీసుకోండి. నిల్వ చేసిన ఆహారం కంటే సహజ ఆహారాలు తీసుకున్నప్పుడే ఎక్కువ పోషకాలు లభిస్తాయి. క్రమం తప్పని వ్యాయామం ద్వారా మీ రక్తపోటు, రక్తంలోని చక్కెర స్థాయిల ను నియంత్రణలో ఉంచవచ్చు. నడక, సైకిల్ తొక్కడం లేదా ప్రతివారం ఈత లాంటి వ్యాయామాలు సైతం మీ మూత్రపిండాల ఆరోగ్యానికి సాయపడుతాయి.
4. పెయిన్‌కిల్లర్స్ పక్కనపెట్టండి
రోజువారీ నొప్పి లేదా కీళ్ల వాపుల కోసం వైద్యుడి సిఫార్సు లేకుండా మీరే స్వయంగా పెయిన్‌కిల్లర్స్ కొనుగోలు చేసి ఉపయోగించడం ఆపేయండి. ఈ ఔషధాలను దీర్ఘ కాలం పాటు తరచూ తీసుకోవడం వల్ల మీ మూత్రపిండాలు దెబ్బతినే అవకాశముంది.
5. పొగతాగడం ఆపేయండి
పొగత్రాగడం వల్ల రక్త నాళాలు దెబ్బతిని, అధిక రక్తపోటుకి దారితీసే ప్రమాదం ఉంది. మూత్రపిండాల వైఫల్యానికి అధికరక్తపోటు అనేది ప్రధాన కారణంగా ఉంటోంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వారి ఆరోగ్య సంరక్షణ నిపుణుడితో మాట్లాడడం ద్వారా పొగతాగడం, మద్యం సేవించడం మానేయాలి.
Authorization