ఎండాకాలం సెలవుల తర్వాత స్కూళ్లు, కాలేజీలు తిరిగి మొదలయ్యాయి. ఈ సమయంలో పిల్లల్లో చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జి, తామర తరచుగా కనబడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం సీజన్ మారడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం.
గజ్జి బారినపడ్డవారిలో దురద తీవ్రంగా వేధిస్తుంది. రాత్రిపూట దురద మరింత ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. చేతి వేళ్ల మధ్య, గజ్జల్లో, తొడల్లో సన్నటి కురుపులు వస్తాయి. శరీరంలో ఒక్క చోట గజ్జి ఉన్నా శరీరమంతా దురద, చికాకుగా అనిపిస్తుంది. గజ్జితో బాధపడేవారు డాక్టర్ సూచన మేరకు క్రీమ్స్, లోషన్స్ వాడాలి. మెడ నుంచి కాళ్ల వరకు ఒళ్లంతా రాసుకుని, కొన్ని గంటల పాటు అలాగే ఉండి ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. గజ్జి అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. గజ్జి ఉన్నవారి చేతులు తాకకుండా చూసుకోవాలి.
రోజూ వేసుకున్న దుస్తులన్నింటినీ గంటసేపు వేడి నీటిలో నానబెట్టి ఉతుక్కోవాలి. కొందరికి దురద తగ్గటానికి యాంటీహిస్టమిన్ మందులు అవసరపడొచ్చు. ఒకవేళ కురుపులు చీము పట్టి ఇన్ఫెక్షన్ తలెత్తితే డాక్టర్ సూచన మేరకు అవసరమైతే యాంటీబయోటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది.
హాస్టళ్లలో ఉండే అమ్మాయిల తలలో పేలు పడుతుంటాయి. ఇవి దువ్వెనలు, టవాల్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి. పేలను తగ్గించే లోషన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని జుట్టు కుదుళ్లకు రాసుకుని, తలకు గట్టిగా క్లాత్ చుట్టూలి. కొన్ని గంటల తర్వాత తలస్నాహం చేయాలి. కొందరికి పేలతో తలలో పుండ్లు పడొచ్చు. డాక్టర్ సూచన మేరకు యాంటీబయోటిక్ మందులు వాడాలి.
పిల్లల్లో వచ్చే మరో చర్మవ్యాధి తామర. ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. గజ్జల్లో, తొడల మీద రెండు వైపులా అర్ధచంద్రాకారంలో విస్తరించి తామరాకు మాదిరిగా కనబడుతుంది. ఇది ముఖ్యంగా ఒకరి దుస్తులు ఒకరు వాడుకోవటం, దుస్తులు కలిపి ఉతకటం, కలిపి ఆరేయటం ద్వారా ఇది వ్యాపిస్తుంది. దుస్తులను వేడి నీటితో ఉతికితేనే ఇవి చనిపోతాయి. డాక్టర్ సూచన మేరకు లోషన్ను తామర ఉన్నచోట రోజుకు రెండు సార్ల చొప్పున మూడు నెలల పాటు ే లోషన్లు రాసుకోవాలి. చాలామంది కొన్ని రోజులు వాడి మానేస్తుంటారు. ఇది తప్పు. ఫంగస్ క్రిములు చర్మం పొరల్లో చాలాకాలం జీవించి ఉంటాయి. కనీసం మూడు నెలలు మందులు వాడితేనే సమస్య పూర్తిగా నయమవుతుంది.
ముందు జాగ్రత్తలు..
- వ్యక్తిగత శుభ్రత చాలాముఖ్యం. హాస్టల్స్లో ఉండేవారు ఎవరి సబ్బులు వారే వాడుకోవాలి. ఇతరుల దుస్తులను వేసుకోవద్దు.
- ఫంగస్ సోకకుండా ఫుల్ బనియన్లు, ఫుల్ డ్రాయర్లు వేసుకోవాలి
- ఇతరుల లోదుస్తులతో కలిపి మీ దుస్తులు ఉంచొద్దు, కలిపి ఉతకొద్దు.
Authorization