శరీర బరువు ఉండాల్సినా దాని కంటే తక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. బరువు తగ్గడం ఎంత కష్టమో బరువు పెరగడం కూడా అంతే సమస్య అంటున్నారు నిపుణులు. కాబట్టి చక్కని ప్రణాళిక వేసుకుని, ఓ పద్ధతి ప్రకారం ఆహారం తీసుకుంటే ఫలితం ఉంటుంది. - గుడ్డులో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఊడికించిన రెండు గుడ్లు తింటే సరిపోతుంది. - కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే దుంపలు, చిరుధాన్యాలను తీసుకోవాలి. అయితే వీటిని తగిన మోతాదులోనే తీసుకోవాలి. - శరీర బరువు పెరగేలా చేయడంలో ఓట్స్ పాత్ర కీలకం. దీంట్లో ఉండే పిండి పదార్థాలు బలాన్నిస్తాయి. ఓట్స్‌లో ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. - రోజు ఒక గ్లాసు పాలు తాగినా చక్కటి ఫలితం కనిపిస్తుంది. పాలలో ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే కొవ్వు పదార్థాలు బరువు పెరిగేలా చేస్తాయి. అయితే ఎంత బరువు పెరగాలి అన్నదాన్ని బట్టి తీసుకోవాలి. కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ జోలికి పోకుండా... మామూలు పాలనే తగినంత మోతాదు తీసుకోవాలి. - ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెకు ఎటువంటి హానీ చేయవు. కాబట్టి ఈ నూనెను ఉపయోగించడం మంచిది. - సాల్మన్ ఫిష్ తింటే త్వరగా బరువు పెరుగుతారు. కాబట్టి నెలకు రెండు సార్లు ఆహారంలో తీసుకుంటే సరిపోతుంది. - అలాగే బాదం, జీడిపప్పు, అవిశె గింజలు, అరటి పండ్లు, కొబ్బరి పాలు... ఇవన్నీ బరువు పెరగడానికి దోహదపడతాయి. బరువు పెరగాలి, ఎంత మోతాదులో ఆహారం తీసుకోవాలో వైద్యుల సలహా మేరకు తెలుసుకోవాలి.