ప్రమాదంలో గాయపడినప్పుడు తుంటి కీలు వ్రంగా దెబ్బతిన్న సందర్భంలో శస్త్రచికిత్స అత్యవసరం అవుతుంది. అలాంటి సందర్భంలో సర్జరీ అనేది ఎంత ముఖ్యమో సర్జరీ తర్వాత జీవితం సాఫీగా కొనసాగడం కూడా అంతే ముఖ్యం. తుంటి కీలు శస్త్రచికిత్సలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను నివారిస్తూ.. చిన్నకోతలతో, తక్కువ నొప్పితో, కండరాలు దెబ్బతినకుండా, వీలనంత త్వరగా రోగి కోలుకువే విధంగా ఆధునాతన శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చింది. తుంటి కీలు నొప్పితో బాధపడేవారు చిన్న కోతల శస్త్రచికిత్స ద్వారా ఉపశమనం పొందవచ్చు..
ఎలా చేస్తారు?
ఈ శస్త్రచికిత్స తుంటి ఎముక కీలు ముందు భాగం నుంచి చేస్తారు. ఎందుకంటే తుంటి ఎముకకు దగ్గరగా ఉండే ప్రాంతమిది. కాబట్టి నేరుగా శస్త్రచికిత్స చేయవచ్చు. ఎటువంటి పెద్ద కోతలు లేకుండా కండరాలు దెబ్బతినకుండా శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది. రక్తస్రావం పెద్దగా ఉండదు. తక్కువ నొప్పి ఉంటుంది. రోగి చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
రోగికి జరిగే మేలు..
మన దేశంలో ఈ ఆధునాతన సాంకేతికత ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుంది. యూరప్‌లో అయితే 1930 నుంచే తుంటి ఎముక కీలు సర్జరీలో ఈ ఆధునాతన విధానం ప్రాక్టీసు చేస్తున్నారు. అనేక పరిశోధనల్లో తుంటి ఎముక భాగంలో చిన్నకోతల శస్త్రచికిత్స సత్ఫలితాలను ఇస్తున్నట్టు రుజువయ్యింది. ఈ విధమైన శస్త్రచికిత్స ద్వారా రోగి తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉంటుంది. పాత పద్దతుల్లో చేసే శస్త్రచికిత్సతో పోలిస్తే ఈ శస్త్రచికిత్సలో రోగి వెంటనే కోలుకుని సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. మరో పరిశోధనలో పాతపద్దతుల్లో అయితే ఎంఆర్ఐ చేసిన ఏడాది తర్వాత మొత్తం తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగేది. అదే చిన్నకోతల శస్త్రచికిత్స వల్ల అంత సమయం పట్టదు. ఈ సాంకేతికత వల్ల కండరాలు దెబ్బతినవు. రోగి పిరుదుల భాగం సహజంగా ఉంటుంది.
సైడ్ ఎఫెక్ట్స్‌ను నివారిస్తూ..
తుంటి కీలు సర్జరీ చాలా కీలకమైంది. అయితే పాతపద్ధతుల్లో చేసే సర్జరీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన చిన్నకోతల శస్త్రచికిత్సలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ విధమైన శస్త్రచికిత్స వల్ల తక్కువ రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా పూర్వపు పద్దతుల్లో చేసే తుంటి ఎముక శస్త్రచికిత్స వల్ల కీళ్లు స్థానభ్రంశం జరిగి రెండు కాళ్ల పొడవులో తేడా వస్తుంది. రెండు కాళ్లు ఒకే పొడవు ఉండకపోవడంతో రోగి నడకలో వ్యత్యాసం ఉంటుంది. ఒక కాలు పొట్టిగా, ఒక కాలు పొడువుగా ఉంటుంది. హిప్ సర్జరీ చేయించుకున్న చాలామందిలో ఈ అవలక్షణం అతి సాధారణంగా కనిపిస్తుంది.
అయితే చిన్నకోతల శస్త్రచికిత్స వల్ల ఇలాంటి ప్రమాదం ఉండదు. ప్రతీ ప్రక్రియకు ఎక్స్‌రే తీసుకోవాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స చేసే సమయంలో కీళ్లు స్థానభ్రంశం కావడానికి వీలుండదు. శరీరాకృతిలో ఎలాంటి లోపం రాదు. కాబట్టి తుంటి ఎముక శస్త్రచికిత్స విజయవంతం అవుతుంది. ఇది ఎంతో సురక్షితమైన శస్త్రచికిత్స అని చెప్పవచ్చు.
నైపుణ్యత అవసరం..
ఈ ప్రక్రియను ప్రతి సర్జన్ పూర్తి చేయలేరు. కీలుమార్పిడి శస్త్రచికిత్సలో ప్రావీణ్యులైన వారు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. సాంకేతికతను ఉపయోగించి శస్త్రచికిత్స చేసేందుకు ప్రాక్టీస్ ఉండాలి. సురక్షితమైన శస్త్రచికిత్స చేయడానికి చాలా నైపుణ్యత అవసరం అవుతుంది. ఆధునాతన సాంకేతికతను అనుసరిస్తూ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత భారతదేశంలో కొత్తది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిన ఈ విధానం కొన్నేండ్ల తర్వాత ప్రాముఖ్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఈ విధానాన్ని 1930 నుంచి యూరప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పాతపద్దతుల్లో చేసే శస్త్రచికిత్సలకు బదులుగా ఈ సాంకేతికతతో అనుభవం గడించిన సర్జన్స్ మాత్రమే దీన్ని సురక్షితంగా చేయగలుగుతారు. ఈ సర్జరీకి నైపుణ్యత ఎంతో అవసరం. సరైన విధానంలో సర్జరీ చేసినప్పుడే రోగి తర్వగా కోలుకుంటారు.
కండరాలకు నష్టం వాటిల్లకుండా..
సర్జరీ చేసే సమయంలో కండరాలకు నష్టం జరుగుతుంది. అయితే ఈ విధమైన చిన్నకోతల శస్త్రచికిత్స వల్ల ప్రమాదాలు దాదాపు లేనట్టే. రెండు కాళ్ల పొడవులో అసమానతలు ఉండవు. కీళ్ల స్థానభ్రంశం ఉండదు. దీంతో చాలా సైడ్ ఎఫైక్స్ట్ తొలిగిపోయినట్టే. కాకపోతే సర్వసాధారణమైన సమస్యలు వస్తాయి. కీలుమార్పిడి శస్త్రచికిత్సలో ఉండే అతి సాధారణ సమస్యలైన చీము రావడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలుంటాయి. ఆరోగ్యమైన వ్యక్తికి అవి కూడా ఒక శాతానికి మించి ఉండవు.
చాలా ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు, ఆధునాతనసాంకేతిక పరిజ్ఞానం కొన్ని హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఐసీయు, ఆధునాతన పర్యవేక్షణా వ్యవస్థ ఉన్న చోట సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటువ్యాధులు ప్రబలకుండా , సురక్షితమైన వ్యవస్థ వల్ల రోగి స్నేహపూర్వక వాతావరణంలో త్వరగా కోలుకునే వీలు ఉంటుంది.
మరుసటి రోజే..
ఏదైనా సర్జరీ జరిగినప్పుడు రోగి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అయితే ఈ విధమైన శస్త్రచికిత్స జరిగిన మరుసటి రోజే రోగి ఇంటికి వెళ్లిపోవచ్చు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉన్న వైద్యషరతులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వర్తిస్తాయి. శస్త్రచికిత్స సమయంలో ఒకటి, రెండు రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. కొద్ది రోజుల రెస్ట్ తర్వాత యధావిధిగా తమ పనులన్నీ చేసుకోవచ్చు. అయితే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. ఫిజియోథెరపీ చేయించుకోవాలి.
Authorization