ఇంటినుంచి కాలు బయటపెడితే చాలు.. వాహనాలు నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళితో కూడిన గాలిని పీల్చాల్సిన పరిస్థితి. ఇది కేవలం నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. గాలి పీల్చకుండా నిమిషమైనా బతకలేం. మనకు ప్రాణాధారమైన గాలి కలుషితమైతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నైట్రోజెన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తులోకి చేరితే పలు శ్వాస సమస్యలు ముంచుకొస్తాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి శ్వాసనాళాలలో ఒక పొర ఉంటుంది. ఈ పొరను యాంటీఆక్సిడెంట్లు నిరంతరం కాపాడుతాయి. మనం కలుషితమైన గాలిని పీల్చుకుంటే వెంటనే ఈ యాంటీఆక్సిడెంట్లు వాటిని నివారించేందుకు దోహద పడతాయి. అయితే కాలుష్య కారకాల స్థాయి ఎక్కువగా ఉంటే యాంటీఆక్సిడెంట్లు అడ్డుకోలేవు. ఫలితంగా శ్వాసనాళాల పొర ఉబ్బుతుంది. దాంతో దీర్ఘకాల బ్రాంకైటిస్, అస్తమా, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ రోజులు ఇదే సమస్యలతో ఉంటే గుండెజబ్బు, ఊపిరితిత్తుల క్యాన్సర్కూ కూడా కాలుష్యవాతావరణం కారణం అవుతుంది. ఇలాంటి సమయంలో ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సహజ యాంటీఆక్సిడెంట్లతో కూడిన పదార్థాలను తీసుకోవాలి.
- ఊపిరితిత్తుల్లో యాంటీఆక్సిడెంట్ల స్థాయి తగ్గకుండా ఆహారం ద్వారా విటమిన్ 'సి' ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ' సి' అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లు, కొత్తిమీర, తోటకూర, మునగాకు వంటివి ఎక్కువగా తినాలి.
- యాంటీఆక్సిడెంట్లపై ఒత్తిడి పెరగడం వల్ల తలెత్తే శ్వాసనాళాల వాపును నివారించడంతో బీటా కెరొటిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారపదార్థాల్లోని బీటా కెరొటిన్ శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ 'ఏ'గా మారుతుంది. విటమిన్ 'ఏ' ఎక్కువగా లభించే క్యారెట్, తోటకూర, కొత్తిమీర, మెంతికూర వంటి ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల కూడా గాలికాలుష్యం వల్ల వచ్చే శ్వాససంబంధమైన వ్యాధులను నివారించవచ్చు.
-గుండె, రక్తంలో కొవ్వుల స్థాయిపై గాలి కాలుష్యం చూపే దుష్ప్రభావాల నుంచి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కాపాడతాయి. బాదం, అక్రోట్లు, అవిసె గింజల వంటి గింజపప్పులు (నట్స్), గింజల్లో ఇవి దండిగా
ఉంటాయి. మెంతులు, ఆవాలు, తాజా ఆకుకూరలు, రాజ్మా, శనగలు, సజ్జల వంటి వాటితోనూ ఈ కొవ్వులు లభిస్తాయి. రోజూ తీసుకునే ఆహారంలో విటమన్స్, బీటా కెరొటిన్ తగినంతగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే గాలికాలుష్యం నుంచి శ్వాసనాళాలను, ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.