శరీరంలో జరిగే ప్రతి చర్య మెదడుతో అనుసంధానమై ఉంటుంది. మెదడులో వచ్చే అనేక రకాల సమస్యల్లో ట్యూమర్స్ ఒకటి. ఇటీవల కాలంలో బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల మరణాల సంఖ్య పెరుగుతుంది. వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడకపోవడం ఇందుకు ప్రధానకారణం. బ్రెయిన్ ట్యూమర్స్ గురించిన అవగాహన ఉంటే ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవడం సాధమవుతుంది.
సూక్ష్మమైన నాడులు, నాడీకణాలు ఉంటే మెదడులో ఎలాంటి చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం శరీరంపై ఉంటుంది. అయితే చాలాసార్లు మెదడులో వచ్చే మార్పుల కారణం కనిపించే లక్షణాలను గమనించకపోవడం వల్ల ప్రాణాంతకంగా మారుతుంది. వీటిలో మెదడులో వచ్చే ట్యూమర్స్ ముఖ్యమైనవి. మెదడులో రక్తం గడ్డకట్టడం ద్వారా ఏర్పడే ట్యూమర్స్, క్యాన్సర్ కారణంగా వచ్చే ట్యూమర్స్ అనేక రకాలు. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజిస్తారు.
1. మందులతో తగ్గేవి
2. సర్జరీతో నిర్మూలించేవి
3.సర్జరీతో పాటు కీమో థెరపీ, రేడియోషన్ థెరపీ అవసరమయ్యేవి
మందులతో తగ్గేవి: బ్రెయిన్లో ఏర్పడే టిబి గడ్డలు, నులిపురుగుల కారణంగా వచ్చే గడ్డలు, చీముగడ్డలు, మొదలైనవి. ఈ విధమైన గడ్డల కారణంగా వచ్చే తలనొప్పి క్రమపద్ధతిలో మందుల వాడకంతో పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఈ విధమైన ట్యూమర్స్ 80-90 శాతం పిల్లల్లోనే వస్తాయి.
ఉదా: ట్యూబర్ క్యులోమా, న్యూరో సిస్టిసర్ క్రోషిస్.
సర్జరీతో నిర్మూలించేవి: కొన్ని సార్లు మెదడులో రక్తం గడ్డకట్టడంతో తలనొప్పి వివరీతంగా వస్తుంది. ఈ ట్యూమర్స్ ను సర్జీరీతో తొలగించడంతో 98 శాతం మందికి పూర్తిగా నయమవుతుంది.ఉదా: మెనిండియేమా, ఆస్టియో సైటోమా గ్రేడ్ 1, న్యూరో ఫైబ్రోమా.
సర్జరీతో పాటు కీమో థెరపీ, రేడియోషన్ థెరపీ అవసరమయ్యేవి: కాన్సర్ కారణంగా మెదడులో ట్యూమర్స్ ఏర్పడితే, వాటిని సర్జరీతో తొలగించడంతో పాటు కీమో థెరపిల ద్వారా 50శాతం రికవరీ వుంటుంది. ఉదా: గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మా ఆస్టియోసైటోమా స్టేజ్ 3, 4. మెడల్లా బ్లాస్టోమా మెటాస్టాటిక్ ట్యూమర్.
ట్యూబర్క్యులోమా(టిబిగడ్డలు): మెదడులో క్షయ కారణంగా వచ్చే గడ్డలను ట్యూబర్క్యులోమా అంటారు. ఈ విధమైన గడ్డలు పిల్లల్లో 80 శాతం, పెద్దల్లో 20శాతం వరకు వస్తాయి. ఒక సెంటి మీటర్ నుంచి నాలుగు సెంటి మీటర్లు వ్యాసంతో వుండే ఈ గడ్డలు, మెదడులోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఆయా భాగాన్ని బట్టి వ్యాధి లక్షణాలు వుంటాయి. 70 శాతం రోగులలో ఫిట్స్, 30 శాతం వారిలో పక్షవాత లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి తరచుగా రావడం, చూపులలో తేడాలు, తడబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాధినిర్ధారణ
సిటి స్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. సరైన మోతాదులో మందులు 12 నెలల వరకు వాడితే వ్యాధినయమవుతుంది. అయితే ఫిట్స్ తగ్గడానికి కొన్ని మందులు వాడాలి. చికిత్స పూర్తి అయిన తరువాత మళ్ళీ సిటి స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేసి వ్యాధి పూర్తిగా తగ్గిందని నిర్ధారించుకున్న తరువాతే, చికిత్స ఆపేయాలి.
న్యూరో సిస్టిసర్ క్రోషిస్ (ఎన్సిసి): మెదడులోకి నట్టలు, నులిపురుగులు వెళ్లి గుడ్ల రూపం దాల్చడాన్ని ఎన్సిసి అంటారు. ఈ వ్యాధి పిల్లల్లో 90 శాతం వస్తుంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా 5-15 సంవత్సరాల వయస్సు పిల్లలు ఈ వ్యాధి బారిన పడతారు. సిటి స్కాన్, ఎంఆర్ఐల ద్వారా వ్యాధినిర్ధారణ చేసి, పూర్తిగా ఈ వ్యాధిని నయం చేయవచ్చు.
చికిత్స
యాంటి - హైత్మిథక్ మెడిసిన్ వర్మి సైడ్స్‌ను 21 రోజులు వాడటంతో పూర్తిగా నయం అవుతుంది. అయితే ఈ వ్యాధి నివారణకు పరిశుభ్రత, పౌష్టికాహరం అందించడం చాలా ముఖ్యం. సంవత్సరానికి ఒక్కసారి వర్మిసైడ్స్ పిల్లలకు ఇచ్చి నట్లయితే, నులిపురుగులు నశిస్తాయి.
చీము గడ్డలు (అబ్సెస్)
ఈ చీముగడ్డలు చాలా అరుదుగా వస్తాయి. అయితే అనేక కారణాలతో ఈ రకమైన గడ్డలు మెదడులో వస్తాయి. శరీరంలోని ఏదో ఒక భాగంలో ఇన్ఫెక్షన్ వున్నపుడు, అది మెదడులోకి చేరుతుంది.
ఉదాహరణకు చెవిలో చీము-చెవిలో ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ వ్యాధి జ్వరంతో ప్రారంభమై తలనొప్పి క్రమంగా పెరుగుతుంది. కొన్ని సార్లు ఫిట్స్ రావచ్చు. వ్యాధి తీవ్రమైతే రోగి కోమాలోకి వెళతాడు. ఈ వ్యాధిని సిటీస్కాన్, ఎఆర్ఐ పరీక్షల ద్వారా నిర్థారణ చేసిన తరువాత, తగిన యాంటీ బయాటిక్స్ వాడటంతో పూర్తిగా నయం చేయవచ్చు.
సర్జరీతో నయమయ్యే బ్రెయిన్ ట్యూమర్స్
శస్త్రచికిత్సతో 98 శాతం బ్రెయిన్ ట్యూమర్స్ పూర్తిగా నయం అవుతాయి. ఈ రకమైన వాటిలో న్యూరో ఫైబ్రోమా, మెనింజియోమా, ఆస్టియోసైటోమా స్టేజ్1, ఎఫెన్ డైమోమా, యాంటిబైయోమా మొదలైనవి వున్నాయి.
ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తలనొప్పి కారణాలు తెలుసుకొని, బ్రెయిన్ ట్యూమర్స్ అని తేలితే, సర్జరీతో తొలగిస్తారు. పుర్రెను తెరచి (క్రెనియాటమీ) బ్రెయిన్‌ను చూస్తూ ట్యూమర్‌ను తొలగిస్తారు. ఈ రకమైన సర్జరీలో వారం రోజుల పాటు యాంటి బయాటిక్స్ వాడితే పూర్తిగా నయమవుతుంది. నూటికి 95-98 శాతం రోగులలో ఎలాంటి రిస్క్ వుండదు. అయితే 2 నుంచి 5 శాతం మంది రోగులలో మాత్రం, పెద్దగా వున్న ట్యూమర్‌ను తొలగిస్తున్నప్పుడు, బ్రెయిన్‌కు దెబ్బ తగలడంతో కాలూ, చేయీ చచ్చుబడిపోతుంది. కొద్ది మందిలో మూతి వంకరపోతుంది, కొద్ది మందిలో ట్యూమర్ తొలగించినప్పుడు, మెదడుకు అయిన మచ్చ కారణంగా ఫిట్స్ వస్తాయి. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్ ్స వల్ల ఎలాంటి ప్రమాదమూ వుండదు. సరైన మందులు వాడుకుని పూర్తిగా నయం చేయవచ్చు.
ఈ రకమైన ట్యూమర్స్ పెద్ద మెదడులో 70 శాతం, చిన్న మెదడులో, వెన్నుపాములో 30 శాతం వచ్చే అవకాశాలు వున్నాయి. ఈ ట్యూమర్స్ రావడానికి జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్యమైన అంశాలు కారణం. పెద్ద మెదడులో కన్నా చిన్న మెదడులో ట్యూమర్ వుంటే లక్షణాలు త్వరగా తెలియడంతో పాటు, రిస్కూ ఎక్కువ వుంటుంది. శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన నాడులూ చిన్న మెదడుకు అనుసంధానమై వుండటమే ఇందుకు కారణం. జీవన ప్రక్రియను నిర్దేశించే రెస్పిరేటరీ సెంటర్, గుండె పని తీరుకు కారణమయ్యే కార్డియాక్ సెంటర్, హైపోథేలమస్, పిట్యూటరీ మెడుల్లా అబ్లాంగేటా మొదలైనవి చిన్న మెదడుకు అనుసంధానమై వుంటాయి. చిన్న మెదడులో ట్యూమర్ వచ్చినప్పుడు లక్షణాలు త్వరగా అగుపిస్తాయి.
వెన్నుపాములో వచ్చే ట్యూమర్ కారణంగా కాళ్లూ, చేతులూ పడిపోవడం, క్రమంగా చచ్చుబడిపోవడం (పారాప్లెజియా) జరుగుతుంది. మలమూత్ర విసర్జనలపై అదుపు తప్పుతుంది. ట్యూమర్ వున్న భాగానికి కింది భాగమంతా స్పర్శ వుండదు. ఎంఆర్ఐ పరీక్ష ద్వారా ట్యూమర్ వున్న ప్రాంతాన్ని గుర్తించి, ఏ రకమైన ట్యూమరో నిర్ధారణ చేసుకున్న తరువాత, సర్జరీ ద్వారా దాన్ని తొలగిస్తారు.
తలనొప్పి లక్షణాలతో పాటు, కాళ్లూ, చేతులూ చచ్చుబడినట్లు అనిపిస్తే, తరచుగా ఫిట్స్ వస్తుంటే, వెంటనే న్యూరో డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ విధమైన ట్యూమర్స్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే, పూర్తిగా నివారించడానికి వీలుంటుంది. రోగి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కోలుకోగలుగుతాడు.
- డా|| ముదిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి,
ఎం.డి, డి.ఎం(న్యూరో), నిమ్స్
సీనియర్ కన్సెల్టెంట్ న్యూరాలజిస్ట్,
ఎంసిఎస్ న్యూరో హాస్పిటల్,
కెపిహెచ్బి కాలనీ, హైదరాబాద్.
Authorization