కంటినిండా నిద్రపోతే చాలా అనారోగ్యసమస్యల నుంచి ఉపశమనం ఉంటుందని అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నిద్రలేమి సమస్యకు, గుండె ఆరోగ్యానికి ఉన్న సంబంధం తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. మీకు రాత్రిపూట నిద్ర సరిగా పట్టక సతమతమవుతున్నారా? అయితే గుండె ఆరోగ్యం దెబ్బతింటుందేమో కూడా ఒకసారి చూసుకోండి అంటున్నారు ఆరోగ్య పరిశోధకులు. ఎందుకంటే గుండెలయను దెబ్బతీసే 'ఏట్రియల్ ఫిబ్రిలేషన్'కూ రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవటానికీ సంబంధం ఉంది అంటున్నారు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో బాధపడేవారు రాత్రిపూట ఎక్కువసార్లు నిద్ర నుంచి మేల్కొంటున్నట్టు ఒక అధ్యయనం పేర్కొనగా.. నిద్ర సరిగా పట్టక తరచుగా మెలకువ వచ్చేవారికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు పొంచి ఉంటున్నట్టు మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమితో గుండె జబ్బులు వస్తాయా? గుండె జబ్బులతో నిద్రలేమి సమస్య వస్తుందా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. గుండెలయ తప్పటానికి నిద్రలేమి ఎలా దోహదం చేస్తోందన్నది స్పష్టంగా బయటపడలేదు. అయితే నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి కాసేపు శ్వాస ఆగిపోయే (స్లీప్ అప్నియా) సమస్యతో బాధపడేవారికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు పెరుగుతున్నట్టు గత అధ్యయనాలు సూచిస్తున్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరముందని పరిశోధకులు అంటున్నారు. గుండెలయ తప్పటం మూలంగా గుండెదడ, గుండెపోటు ముప్పులూ పెరుగుతాయి. కాబట్టి నిద్ర సమస్యలతో బాధపడేవారు ఒకసారి వాటిని డాక్టర్ ద ష్టికి తీసుకుపోవటం మంచిది. అలాగే రోజూ ఒకే సమయానికి నిద్రపోవటం.. పడకగదిలో చల్లటి, మసక వాతావరణం ఉండేలా చూసుకోవటం.. సాయంత్రం వేళల్లో కాఫీల వంటివి తాగకపోవటం.. టీవీలు, మొబైళ్ల వంటివి ముందుగానే కట్టేయటం వంటి వాటితో నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.