మన ప్రాంతంలో మలేరియా, డెంగీ జ్వరాలు రెండూ ఎక్కువగానే ఉన్నాయి. ఈ రెండు రకాల జ్వరాలు దోమల ద్వారా వ్యాపించేవే. రెంటికీ కొన్ని లక్షణాల్లో కూడా పోలికలుంటాయి. అందుకే వీటి మధ్య తేడాలు తెలుసుకోవటం మంచిది.
పరీక్షలు: డెంగీకి ఎన్ఎస్-1 పరీక్ష ఉంది. ఈ పరీక్ష చేస్తే డెంగీ జ్వరం.. వచ్చిన మొట్టమొదటి రోజునే తెలిసిపోతుంది. అలాగే మలేరియాకు కూడా ర్యాపిడ్ డయాగ్నొస్టిక్ పరీక్షలు (ఆర్డీటీ) ఉన్నాయి. ఈ 'ప్యారసైట్ ఎఫ్ అండ్ వి' పరీక్షలతో మలేరియా జ్వరాన్ని మొదటి రోజే 10-15 నిమిషాల్లో గుర్తించొచ్చు. ఈ పరీక్షలు ఇప్పుడు అన్ని చోట్లా అందుబాటులో ఉన్నాయి.
కంప్లీట్ బ్లడ్ టెస్ట్ (సీబీపీ) చేస్తే- మలేరియా, డెంగీ జ్వరాలైతే తెల్లరక్తకణాల సంఖ్య (డబ్ల్యూబీసీ) సాధారణంగానే ఉంటుంది. కొందరిలో కొద్దిగా తగ్గుతుంది. అయితే ప్లేట్లెట్లు తగ్గటం మొదలవుతుంది. ఎప్పుడైతే తెల్లరక్తకణాలు సాధారణంగానే ఉండి, ప్లేట్లెట్లు తగ్గటం మొదలైతే మలేరియా, డెంగీ ఉందని తెలుసుకోవాలి.
- డెంగీలో ఒంటిమీద దద్దులు రావచ్చు. మలేరియాలో దద్దులు రావు. డెంగీలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉండొచ్చు. మలేరియాలో అవి మరీ తీవ్రంగా ఉంటాయి.
-జ్వరం వచ్చినప్పుడు సీబీపీ, మలేరియా, డెంగీ పరీక్షలు మూడూ చేయించుకోవటం మంచిది. వచ్చిన జ్వరం మలేరియా, డెంగీ అన్నది కచ్చితంగా తెలిసిపోతుంది.
మలేరియా అయితే..
విపరీతమైన చలి, వణుకుతో తీవ్రంగా జ్వరం వస్తుంది. కొందరిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. కొందరు చిన్నపిల్లల్లో నీళ్ల విరేచనాలు అవుతాయి. మరి కొందరికి సమస్య ముదిరి కామెర్లు, ఎనీమియా వస్తుంది. ఒంటి మీద దద్దులు ఉండవు. సాధారణంగా జ్వరం ఎప్పుడూ ఉండదు. అప్పుడప్పుటూ తీవ్రంగా వస్తుంది. జ్వరం లేనప్పుడు రోగి పూర్తి సాధారణంగా ఉంటారు. మళ్లీ ఎప్పుడో ఉన్నట్టుండి జ్వరం వస్తుంది. కొంతకాలం తర్వాత ఈ తీరు మారి.. జ్వరం ఎప్పుడూ ఉండే అవకాశం ఉంది.
మలేరియా రాకుండా నివారించాలంటే - దోమలు కుట్టకుండా చూసుకోవాలి. అంతకు మించి మరో మార్గం లేదు. నిద్రించేటప్పుడు దోమ తెరలు కట్టుకోవాలి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు తెరలు వేసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూడాలి.
దోమల నివారణ చర్యలు..
దోమలను చంపటానికి మరో సమర్థవంతమైన పద్ధతి- ఇంట్లో స్ప్రేలతో మందు చల్లటం (ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రేయింగ్- ఐఆర్ఎస్). ఇది మలేరియా వ్యాప్తిని అడ్డుకోవటానికి బాగా తోడ్పడుతుంది. సాధారణంగా మలేరియాను వ్యాపింపజేసే దోమలు- మనుషులను కుట్టిన తర్వాత ఇంటి గోడలపై, కప్పుపై వాలిపోయి విశ్రాంతి తీసుకుంటాయి. తర్వాత మరొకరిని కుడతాయి, దానివల్ల మలేరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. కాబట్టి ఇంట్లో గోడలపైనా, కప్పులపైనా ఈ దోమ సంహారిణి మందును చల్లితే మలేరియా వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. ఈ మందును ఒకసారి చల్లితే 3-6 నెలల వరకూ పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి దీన్ని మరికాస్త తరచుగా కూడా చల్లాలి.
Authorization