జ్వరం...వైరల్ జ్వరం... డెంగ్యూ జ్వరం... టైఫాయిడ్ జ్వరం... మలేరియా జ్వరం...ఇలా ఎవర్నీ కదిలించినా ఏదో ఒక జ్వరం పేరు వినబడుతుంది. రాష్ట్రమంతా జ్వరాలమయంగా మారిన ఈ పరిస్థితుల్లో 'జ్వరం' అన్న మాట వింటేనే జ్వరం వచ్చినంత బాధ కలుగుతుంది. మరీ ఈ జ్వరాలు ఒక్కోసారి తీవ్రరూపం దాల్చి తీవ్ర అనారోగ్యానికి దారి తీయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువున్న వారిలో జ్వరాల వల్ల కాంప్లికేషన్లు (అంటే ఒక జబ్బు నుంచి ఇంకో జబ్బుకు దారితీయడం) వచ్చే అవకాశముంది. ఇలాంటి సమయంలో జ్వరం గురించి అవగాహన ఎంతో అవసరం. ముఖ్యంగా వైరల్ జ్వరాలకు, ఇతర జ్వరాలకూ ఉండే తేడా తెలుసుకోవడం వల్ల ఆందోళనలూ తగ్గి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
జ్వరమంటే..
మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 98.6 డిగ్రీల ఫారెన్ హీట్గా ఉంటుంది. అంత కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత పెరిగితే 'జ్వరం' వచ్చింది అంటాం. జ్వరం శరీరంలో జరుగుతున్న మార్పులకుఒక హెచ్చరిక. అంతేకాదు శరీరంలో చేరిన సూక్ష్మజీవులను నశింపజేసే ఒక రక్షణ ప్రక్రియ. జ్వరం రావడానికి అనేక కారణాలున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగైలాంటి సూక్ష్మజీవులు వల్లే కాక గాయాలు, గుండెపోటు, క్యాన్సర్ లాంటి సమస్యల వల్ల కూడా జ్వరం రావొచ్చు. మందుల వల్ల కూడా జ్వరం రావొచ్చు. దీన్ని డ్రగ్ ఫీవర్ అంటారు.
జ్వరం ఉంటే ఏదీ తినబుద్దికాదు. కానీ బాగా తినాలి. ఏది తినాలనిపించినా అది తినొచ్చు. ఆ పదార్థాలు శుభ్రంగా, వేడిగా ఉంటే చాలు! జ్వరంతో ఉన్నప్పుడు నీళ్లు, ద్రవాలు బాగా తీసుకోవాలి. ఉష్ణోగ్రత వల్ల కోల్పొయిన ద్రవాలను పూరించడానికి ఇది అవసరం.
లక్షణాలు
విషజ్వరాలు ప్రబలుతున్నాయనేది మనం తరచూ చూసే వార్త. నిజానికి విషజ్వరాలనేవి వైద్య శాస్త్రంలో లేవు. మన వాళ్లు మలేరియాకూ, టైఫాయిడ్కూ, వైరల్ జ్వరాలకు కూడా విషజ్వరాలనే పదం వాడుతున్నారు.
జ్వరాలు చాలా రకాలు. చికిత్సకు ముందు రోగి లక్షణాలను కనుక్కోవాలి. రోగి తన సమస్యలను పూర్తిగా వైద్యునికి చెప్పడం తప్పనిసరి. సాధారణ జలుబూ, స్వైన్ఫ్లూ రెండింటిలోనూ ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తాయి. ముక్కు నుంచి నీరు కారడం, దగ్గు, కండరాల నొప్పులూ ఉంటాయి. డెంగ్యూ, చికున్ గున్యాలలో జ్వరంతోపాటు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి.
జ్వరం రెండు వారాలకు మించి వస్తుండి, సాధారణ పరీక్షలు చేసినా జ్వరానికి కారణం తెలియకపోతే దాన్ని పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ (పియుఓ) అంటారు. నిజానికి 40 శాతం జ్వరాలు ఇన్ఫెక్షన్ల వల్ల, 30 శాతం జ్వరాలు క్యాన్సర్ల వల్ల, 20 శాతం జ్వరాలు ఇమ్యూనోజెనిక్ కారణాలతో వస్తాయి. ఐదు నుంచి తొమ్మిది శాతం జ్వరాలకు ఏ కారణమై ఉంటుందో అంతుపట్టలేదు.
వాతావరణం - జ్వరాలు
కాన్సరు నుండి కండరాల వ్యాధి దాకా అనేక రకాల జబ్బులలో జ్వరం రావొచ్చు. వైరల్ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ సాధారణంగా వచ్చే జ్వరాలు. ఈ మూడు జ్వరాలు ఏడాది పొడుగునా ఏదో ఒక స్థాయిలో ఉంటూనే ఉన్నాయి. కాని ఒక్కో సీజన్లో ఒక జ్వరం ఎక్కువైతుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. చలి పెరిగే కొద్దీ దోమలకు అననకూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దోమల వల్ల వచ్చే జబ్బులు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వైరస్లకు అననకూలత పెరుగుతుంది.దీంతో వైరస్ జ్వరాలు తగ్గుతాయి. కొందరికే ఈ జ్వరాలు ఎందుకు వస్తాయి? అంటే దానికీ కారణం శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ! పౌష్టికాహారం, ముఖ్యంగా ప్రోటీన్లు సమతుల్యంగా తీసుకునే వారిలో ఈ రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. వారి శరీరాలలో సూక్ష్మజీవులనెదుర్కొనే రక్షణ కణాలు చురుగ్గా, పుష్కలంగా ఉంటాయి.
సాధారణంగా తగ్గిపోయే గుణం..
- జలుబు తగ్గాలంటే వైద్యం చేస్తే వారం రోజులు, వైద్యం చేయకుంటే ఏడు రోజులు పడుతుందనేది సామెత. ఇది ఒక విధంగా నిజమే. ఏ వైరల్ జ్వరానికైనా సాధారణంగా ఎటువంటి వైద్యం లేకుండా దానికదే తగ్గిపోయే గుణం ఉంటుంది.
- 'వైరస్' వల్ల వచ్చే జ్వరాన్ని వైరల్ జ్వరం అంటారు. వైరల్ జ్వరాలకు వైద్యం చాలా సులభం. అయితే డాక్టర్ సలహా ప్రకారమే చికిత్స తీసుకోవాలి.
కంగారు వద్దు..
- జ్వరం వస్తే భయపడవద్దు. అన్ని జ్వరాలు ఒకటి కావు. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు కంగారు పడవద్దు.
- విశ్రాంతి తీసుకోవాలి. బయటకు వెళ్లకూడదు.
- బాగా నిద్రపోవాలి. నిద్ర వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- పోషకాహారం తీసుకోవాలి. వేడి వేడి అన్నం, పప్పు, ఇతర కూరగాయలు తినాలి.
- జ్వరం మరీ తీవ్రంగా ఉంటే గోరువెచ్చని నీటితో ఒళ్లు తుడవాలి.
- జలుబు, దగ్గుకు ఉంటే ఆవిరి పట్టాలి. గొంతు నొప్పి ఉంటే గోరువెచ్చని నీళ్లలో చిటికెడు ఉప్పువేసి పుక్కిలించాలి.
- ఈ జాగ్రత్తలు పాటిస్తూ పారాఅసిటమాల్ మాత్రలు రోజూ మూడుసార్లు వేసుకోవాలి.
జాగ్రత్తలు
- వైరల్ జ్వరాలతో ఎలాంటి ప్రాణాపాయం లేదు. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇవి కాంప్లికేషన్లకు, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందుకే జాగ్రత్త అవసరం !
- మెదడుకూ, గుండెకూ కూడా ఇవి అరుదుగా వ్యాపించ వచ్చు. చిన్న పిల్లల్లో సాధారణ జలుబు న్యూమోనియాగా మారే అవకాశముంది. నిమిషానికి 40 నుంచి 50 సార్లు శ్వాసతీసుకోవడం, డొక్కల రెండువైపులా ఎగవేయడం చేస్తుంటే ఆసుపత్రిలో చేర్చాలి.
- జ్వరం 103 నుంచి 104 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువైతే కొంత మంది పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశముంది.
- వైరల్ జ్వరాలలో వచ్చే కాంప్లికేషన్లలో ఇతర లక్షణాలు రక్తస్రావం వంటి సమస్యలు వస్తే జాగ్రత్త పడాలి. చర్మంపై ఎర్రటి మచ్చలు వచ్చినా, ఆయాసం, పల్స్ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి.
- డాక్టర్ స్వామి అల్వాల్,
ఎం.బి.బిఎస్(ఉస్మానియా), ఎండీ(నేచరోపతి)
సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీజీహెచ్ఎస్(రిటైర్డ్)
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్
Authorization