ఎక్కువసేపు కూర్చున్నా, ప్రయాణాలు చేసినా కాళ్లల్లో వాపు కనిపిస్తుంది. ఎలాంటి కారణం లేకున్నా వాపు కనిపిస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి అంటున్నారు పరిశోధకులు. - రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, క్యాన్సర్, గుండెజబ్బు, ఆస్థమా, అల్జీమర్స్..లాంటి ఎన్నో సమస్యల కారణంగా దీర్ఘకాలంగా శరీరంలో వాపు ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఎక్కువ రోజులు ఉండే వాపు గురించి తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు నిర్వహించారు. ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య తలెత్తుతుందన్న విషయం స్పష్టమైంది. - మన పేగుల్లోని బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనాలు వాపు కలిగించడంలో, తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందువల్ల దీర్ఘకాల వాపు ప్రక్రియకూ తీసుకునే ఆహారానికీ సంబంధం ఉందని పరిశోధన ద్వారా తెలిసింది. వాపు తగ్గించే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. - పండ్లు, మంచి రంగుతో కూడిన కూరగాయల్లో సహజంగానే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ అనే రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపు ప్రక్రియ అదుపులో, శరీర కణాల్లో నీరు చేరకుండా ఉండటానికీ ఉపయోగపడుతాయి. - గింజపప్పులు, విత్తనాలు తీసుకునేవారిలో వాపు చాలా తక్కువగా కనిపించడంతో పాటు వారిలో గుండెజబ్బు, మధుమేహం సమస్య తక్కువగా ఉందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. - కాఫీ, టీల కన్నా గ్రీన్ టీలోనూ పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని, గ్రీన్‌టీని తరచుగా తీసుకునేవారిలో కండరాల వాపు సమస్య తక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు.