మనం ఆనందంగా ఉండాలంటే శరీరంలో కొన్ని రకాల హార్మోనులు విడుదల కావాలి. మరి ఆ హార్మోన్లు విడుదల కావాలంటే మనం చిన్నచిన్న అంశాలను పాటించాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మరి ఆ హార్మోన్లు ఏమిటో, అవి విడుదల కావడానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం. 1.ఎండార్ఫిన్స్, Endorphins 2. డోపామిన్, Dopamine 3. సెరిటోనిన్Serotonin, 4. ఆక్సిటోసిన్ Oxytocin ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది. ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం ఎండార్ఫిన్స్: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. మన శరీరంలో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి. అప్పుడు మనం మన వ్యాయామాన్ని ఎంజారు చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ ఎండార్ఫిన్స్. నవ్వడం వలన కూడా ఈ ఎండార్ఫిన్స్ ఎక్కువగా విడదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం. నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం' అన్నారు జంధ్యాల ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, నవ్వుతూ ఉంటే ఎండార్ఫిన్ విడుదలై మరింత సంతోషంగా ఉంటారు. డోపామిన్ : పాజిటివ్ థింకింగ్‌తో చేసే ఎన్నో చిన్న పెద్ద పనులు మనలో డోపామిన్ హార్మోనును విడుదల చేస్తాయి. ఇతరులు మెచ్చుకోవడం వలన కూడా శరీరంలో డోపామిన్ స్థాయి పెరుగుతుంది. చిన్నచిన్న ఆనందాలు కూడా ఈ హార్మోను విడుదల కావడానికి ఉపయోగపడుతాయి. సెరిటోనిన్ : మనసుకు నచ్చిన పనులు చేసినప్పుడు సెరిటోనిన్ హార్మోను విడుదల అవుతుంది స్నేహితులతో మాట్లాడినా, ఏదైనా మంచి పని చేసినా మనలో అధిక స్థాయిలో సెరిటోనిన్ హార్మోను విడుదల అవుతుంది. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని చూడటం, ఇష్టమైన పాటలు వినడం లాంటి చిన్నచిన్న అంశాలు కూడా సెరిటోనిన్ హార్మోను విడుదలకు దోహదం చేస్తాయి. ఆక్సిటోసిన్ : ఇష్టమైన వారిని దగ్గరకు తీసుకునేటప్పుడు విడుదల అయ్యే హార్మోను. పిల్లలను ఒడిలోకి తీసుకున్నప్పుడు, స్నేహితులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, ఇష్టమైనవారిని, భాగస్వామిని ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటే వారిని హగ్ చేసుకోగానే ఏడుపు ఆపేయడానికి ఈ హార్మోనే కారణం.