ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్ డి లోపిస్తే అనేక శారీరక మానసిక సమస్యలు తలెత్తుతాయి. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు కూడా విటమిన్ డి లోపమే కారణం అవు తుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. - సూర్యరశ్మి కారణంగా ఉత్పత్తి అయ్యే విటమిన్ డి శరీరంలో కొన్ని ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఈ విటమిన్ లోపంతో అనేక సమస్యలు వస్తాయి. వాటిని గుర్తించాలి. - విటమిన్ డి లోపం తరచుగా అనారోగ్యానికి గురిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడమే ఇందుకు కారణం. తరచుగా జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లైతే మీరు మీ విటమిన్ డి స్థాయిలను ఒకసారి చెక్ చేసుకోవాలి. - ఎక్కువగా జుట్టు రాలుతున్నా విటమిన్ డి స్థాయి పరీక్షించాల్సిందే. విటమిన్ డి లోపాన్ని సరైన సమయంలో గుర్తించక పోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. - దద్దుర్లు , ఎక్కువగా మొటిమలు రావడం వంటి చర్మసంబంధమైన సమస్యలకు కూడా విటమిన్ డి లోపమే కారణం అవుతుంది. విటిలిగో వంటి చర్మ సమస్యలకు కూడా విటమిన్ డి లోపమే కారణమని పరిశోధనల్లో స్పష్టమైంది. - విటమిన్ లోపిస్తే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందని పరిశోధనల్లో తేలింది. తరచుగా డిప్రెషన్ బారిన పడితే విటమిన్ డి స్థాయిని పరీక్షించి వైద్యుని సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.