మారుతున్న జీవనశైలి కారణంగా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు బాధిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదువందల రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయి. వాటిలో ఎక్కువ మందికి వచ్చే క్యాన్సర్లో
కొలొరెక్టల్ క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రతిఏడాది మార్చి నెలను కొలొరెక్టల్ క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు.
ఇతర దేశాలలో పోలిస్తే కొలొరెక్టల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య మన దేశంలో తక్కువగా ఉంది, కానీ, ఈ వ్యాధితో బాధపడేవాళ్ళ మనుగడ రేటు ఇతర దేశాలతో పోల్చితే తక్కువగా ఉంది. వ్యాధి బాగా ముదిరిన తర్వాత బయటపడటం ఇందుకు కారణం కావచ్చు. కొలొరెక్టల్ క్యాన్సర్ వ్యాధి లక్షణాలపై ముందుగా అవగాహన ఉంటే మొదటి దశలోనే గుర్తించవచ్చు. అందుబాటులో ఉన్న చికిత్సలో నయం చేసుకోవచ్చు.
కొలొరెక్టల్ క్యాన్సర్(పెద్ద పేగు కాన్సర్), అనేది పెద్ద పేగు భాగాలను బాధించే వ్యాధి. ఇది పెద్ద పేగు, పురీష నాళం లోనూ , కొన్నిసార్లు రెండు భాగాల్లోనూ వచ్చే ప్రమాదం ఉంది. పెద్దపేగు, పురీషనాళం లోపలి గోడల్లో బుడిపెల్లా పైకి ఉబికివచ్చినట్లు ప్రారంభమవుతుంది ఈ వ్యాధి. మలంలో అధిక నీటిని పెద్ద పేగు పీల్చుకుంటుంది, మలవిసర్జన అయ్యేంతవరకూ పురీషనాళం మలాన్ని నిల్వ చేస్తుంది.
లక్షణాలు :
- మలవిసర్జన అలవాట్లలో మార్పు, నీళ్ల విరేచనాలు లేదా మలబద్దకం లో మలం గట్టిపడం
- మలవిసర్జన అసంపూర్తిగా అయిందన్న భావన
- పెద్ద ప్రేగు లేదా పురీషనాళంలో రక్తస్రావం కారణంగా రక్తంతో కూడిన (లేదా రక్తం చారలతో కూడిన)మలం.
- పొత్తి కడుపు నొప్పి,
- అలసటగా , బలహీనంగా అనిపిస్తుంది.
- బరువు తగ్గుతారు.
- సాధారణంగా, వ్యాధి లక్షణాలు రుగ్మత వచ్చిన తరువాతి దశలలో కనిపించటం మొదలుపెడతాయి. వ్యక్తి నుండి వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు, వ్యాధి తీవ్రత మారుతాయి.
కారణాలు
వ్యాధికి కచ్చితమైన కారణం ఇంకా కనుగొనబడలేదు. కానీ పెద్ద పేగు క్యాన్సర్ వయసు పై బడిన పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. అరదుగా మహిళల్లోనూ కనిపిస్తుంది. ఈ వ్యాధి రావడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు కొన్నిసార్లు కారణం కావచ్చు:
- పెద్ద పేగు కాన్సర్ వ్యక్తి కుటుంబంలోని వారికి ఉన్నప్పుడు.
- ఊబకాయంతో ఉన్నవారు
- సిగరెట్ ధూమపానం చేసేవారు, మద్యం సేవించే వారు.
- రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం తినే వారు...
- పీచుపదార్ధాలు (ఫైబర్) తక్కువగా ఉండే ఆహారం తినే వారు.
- శారీరక వ్యాయామం చేయనివారు.
- అవయవ మార్పిడి తరువాత యాంటిబయాటిక్స్ వాడుతున్న వారు
- హెచ్ఐవి సంక్రమణ, ఇన్సులిన్ నిరోధకత కల్గిన డయాబెటిస్ మెల్లిటస్ వ్యాధి వంటి రుగ్మతలతో బాధపడుతున్నవారు..
- ప్రోస్టేట్ క్యాన్సర్ కు చికిత్స తీసుకున్నవారు
నిర్ధారణ
- మలవిసర్జనలో మీకు రక్తసిక్తమైన మలం పడినా, మూత్రంలో రక్తస్రావం కనిపించిన వెంటనే డాక్టరును సంప్రదించాలి.
వైద్య పరీక్షలు
- హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల లెక్కింపు, కాలేయ, మూత్రపిండల పనితీరు పరీక్షలు నిర్వహిస్తారు.
- రెక్టోస్కోపీ (మలద్వారం ద్వారా గొట్టం ప్రవేశపెట్టి పరీక్షించడం)
- కొలొనోస్కోపీ(ఈ పరీక్ష ద్వారా పెద్దపేగులను చూడవచ్చు) దీనివల్ల పాలిప్లను గుర్తించడానికి వీలుంటుంది.
- 40 - 50 ఏండ్ల మధ్య వయసు వారు మలవిసర్జన లో రక్తం పడితే వెంటనే ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది
- బయాప్సీ చేయడం చాలా ముఖ్యం.
- కొన్నిసార్లు ఛాతీ ఎక్స్రే, అల్ట్రాసోనోగ్రఫీ, సిటి స్కాన్ పరీక్షలు కూడా అవసరం అవుతాయి. ఈ క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాప్తి చెందిందేమోనని కనుగొనటానికి నిర్వహిస్తారు.
చికిత్స..
కెమోథెరపీ ఔషధాలు కూడా చికిత్స కోసం ఇవ్వబడుతాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే రేడియేషన్ థెరపీ ఉపయోగిస్తారు.
- ఈ క్యాన్సర్ ముదిరిపోయిన దశల్లో రోగనిరోధకచికిత్స చేస్తారు.
- ముందుగానే లక్షణాలు గుర్తించి డాక్టరును సంప్రదిస్తే కొలొరెక్టల్ క్యాన్సర్ బారి నుంచి బయటపడవచ్చు.
- డాక్టర్ లక్ష్మణ్ రావు
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్
Authorization