Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయి
- ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ప్రాజెక్టును ఖచ్చితంగా నిర్మించి తీరుతామని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలకు ఇప్పుడు సోయి వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలో ప్రతిపక్షాలు కలిసి ధర్నా నిర్వహించి మాట్లాడిన తీరు సరిగా లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు అనుమతులు లేవని మాట్లాడుతున్నారని, ఇప్పటికే సర్వే పూర్తయిందని, అనుమతులు వచ్చాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. ప్రాజెక్టులకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలే అడ్డుపడుతున్నాయన్నారు. గతంలో కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉద్యమాలు చేశారని, ఇందులో భాగంగానే పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చినా కనీసం సర్వే చేయించలేకపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్వాసితులకు రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతున్న తరుణంలో కూడా తక్కువ పరిహారం ఇచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో పరిహారం ఇస్తుందన్నారు. నాగం జనార్ధన్‌రెడ్డి మాటిమాటికీ ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ మాట్లాడుతున్నారని, ప్రాజెక్టులకు అనుమతి లేదంటూనే అవినీతి ఎక్కడ జరుగుతుందని? ఇంత అవగాహనా లోపంతో నాగం మాట్లాడడం సరికాదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఏపీలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తున్నారని, తెలంగాణలో ఎందుకు జాతీయ హోదా ఇవ్వడంలేదని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా డిండీకి నీరు తరలిస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయని, అందులో వాస్తవం లేదన్నారు. గతంలో నిర్ణయించిన వాటా ప్రకారమే నీరు పోతుందితప్పిస్తే జిల్లా నీరు పోవడంలేదన్నారు. ప్రజలకు ప్రతిపక్షాలపై విశ్వాసంలేదని, వచ్చేదికూడా తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ షాద్‌నగర్ అధ్యక్షులు నటరాజ్, నాయకులు అందె బాబయ్య, మన్నె నారాయణ, కందివనం సూర్యప్రకాష్, ఆకుల మల్లేష్, త్రినాథ్, బీశ్వ రామకృష్ణ, యాదగిరిరావు, హఫీజ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.