Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో ప్రత్యేక పారిశుధ్యంపై గురువారం మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛత-హి-సేవ, తెలంగాణకు హరితహారంపై అవగాహన కల్పించారు. సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర మాట్లాడుతూ..నూతన మున్సిపాలిటీ చట్టం - 2019 ప్రాముఖ్యతను గురించి సిబ్బందికి వివరించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు సీజనల్ వ్యాధులలో భాగంగా జ్వరాలు, డెంగ్యూ, డయేరియా, కలరా, టైఫాయిడ్, చికెన్ గున్యా, ఇతర అంటువ్యాధులు ప్రభలకుండా పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. అలాగే తాగునీటి విషయంలో నీటి సరఫరా సిబ్బందికి నీరు కలుషితం కాకుండా నీటి పైపులైన్లకు, గేట్ వాల్ దగ్గర కానీ ఏవైనా లీకేజీలు ఉన్నచో ఎప్పటికప్పుడు గుర్తించి రిపేర్ చేసి తగు చర్యలు తీసుకోవాలని, వాటర్ ట్యాంక్లను, వాటర్ సంపులను తరచుగా శుభ్రంచేసి నీరు స్వచ్ఛంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం మహాత్మాగాంధీ 150వ జన్మదిన సందర్భంగా ఈ నెల 11నుండి 27వరకు '' స్వచ్ఛత హి సేవ'' కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమం, శ్రమ దానం, ప్రజలు వాడి పారవేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం, సంబంధిత ఫ్యాక్టరీలకు చేరవేయుట తదితర కార్యక్రమాలను మూడు విడుతలుగా చేపడతామన్నారు. మొదటి విడతలో ఈ నెల11 నుండి అక్టోబర్ 01 వరకు పట్టణంలో ప్రజలకు ప్లాస్టిక్ వాడకాల నిషేధంపై అవగాహన సదస్సుల నిర్వహణ, రెండో విడత అక్టోబర్ 02న పట్టణ ప్రజలతో సామూహిక శ్రమదాన కార్యక్రమం, మూడో విడత అక్టోబర్ 03 నుండి అక్టోబర్ 27వరకు ప్రజలు వాడి పారవేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం, సంబంధిత ఫ్యాక్టరీలకు చేరవేస్తామని తెలిపారు. హరితహారంలో భాగంగా ప్రతి వార్డుకు ఒక అధికారిని నియమించి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని అలాగే ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు, పూల మొక్కలను వారికి అవసరం ఉన్న మొక్కలను ఇవ్వాలని సూచించారు. వారికి ఆ మొక్కల పర్యవేక్షణ బాధ్యత చేపట్టాలని సూచించారు. మొక్కలు చనిపోయిన చోట మరో మొక్కలను నాటాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, తాగునీటి సరఫరా సిబ్బంది, మహిళా సంఘాల రీసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.