తెలుగింటి పండుగలకు గంగిరెద్దులతో ఎంతో అనుబంధం ఉంది. సంక్రాంతికి ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చినా ఆ ముగ్గు మీద ఆడేందుకు గంగిరెద్దు రాకపోతే సంక్రాంతికి కళ ఉండదని భావిస్తారు. గంగిరెద్దులు డూడూ బసవన్నల రూపంలో ఇంటిముందుకొస్తేనే పండుగ మొదలవుతుంది. పీకలు ఊదుతూ, పాటలు పాడుతూ గంగిరెద్దుల ఘల్ ఘల్ అనే గజ్జెల చప్పుడుల మధ్య బసవన్న తలాడిస్తే తమ ఇంటికి లక్ష్మీకళ రాబోతున్నదని ప్రజలు ఆనంద పడతారు. ఇక చిన్నపిల్లలైతే తమ కాలనీ, ఆడకట్టు దాటిపోయేంత వరకు బసవన్నల చుట్టే తిరుగుతారు. ఊరి మధ్యలోనో, కాలనీ విశాలమైన ప్రదేశంలోనో బసవన్నలు చిందులేస్తూ పరిగెడుతుంటే కండ్లారా చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అది బసవన్నలతో తెలుగు ప్రజలకూ, పండుగలకున్న అవినాభావ సంబంధం. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం గంగిరెద్దుల వారిని బిచ్చగాండ్లుగా పేర్కొంటూ అరెస్టు చేసి జైలుకు పంపించడం దుర్మార్గం.
హైదరాబాద్ వంటి నగరాల్లో గంగిరెద్దు కులస్తులను బిచ్చగాండ్లంటూ అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నరేండ్లు పూర్తయింది. కానీ గంగిరెద్దుల కులస్తుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా వుంది. ఈ కులస్తులు రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది వుంటారు. వీరు తరతరాలుగా కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. ఒక చేతిలో గంగిరెద్దు పగ్గాలు పట్టుకొని, మరో చేతిలో చంటి బిడ్డను ఎత్తుకుని స్త్రీలు, పురుషులు ఇంటిల్లిపాది ఇంటింటికీ తిరుగుతూ ప్రజలు ఇచ్చే డబ్బులు, బియ్యం, బట్టలు వంటి వాటితో పొట్టపోసుకుంటుంటారు. ఇటీవల వీరికి గ్రామాల్లో ఉపాధిలేక పట్టణాలకు వలస వస్తున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాలకు పండుగల సందర్భంలోనైతే పెద్ద సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా సంక్రాంతి, దీపావళి పండుగలకు వీధివీధిన నగరంలో కన్పిస్తారు. వందల సంఖ్యలో వీరు డూడూ బసవన్నల వేషధారణతో ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దులు ఆడిస్తారు. ప్రజలు వీరిని ఆదరిస్తున్నారు. సాంస్కృతికంగా, కళాత్మకంగా వీరు కన్పిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో చావు దగ్గర కూడా గంగిరెద్దులను ఆడిస్తూ వారి చరిత్రను చెప్పి మంచి జరగాలని గంగిరెద్దులతో దీవింపజేసి పొట్టపోసుకుంటారు. వీరి ఆచార వ్యవహారాలు అనేక సంవత్సరాలుగా ఒక వృత్తిలాగా కొనసాగుతున్నాయి. వీరు రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ వున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండే వారికీ స్వంత ఇండ్లు లేవు. ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద, డేరాలు వేసుకొని అడిక్మెట్, లాలాపేట, కాచిగూడ, మలక్పేట, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో గత 20 సంవత్సరాలుగా నివాసం వుంటున్నారు.
అయితే గంగిరెద్దుల కులస్తులపై గత పదిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది. ముఖ్యంగా పోలీసులు, మున్సిపల్ అధికారులు వీరి వెంటబడి బిచ్చగాండ్లు అంటూ అరెస్టు చేస్తున్నారు. బిచ్చగాండ్లు వేరు, కులవృత్తి చేసుకొని బతికేవారు వేరు అన్న విషయం ప్రభుత్వానికి తెలియదా? ఇటీవల ఇవాంకా ట్రంప్ రాక సందర్భంగా బిచ్చగాండ్లను నగరం నుండి తరలించేందుకు 77 జీవోను తీసుకొచ్చారు. దీనిప్రకారమే గంగిరెద్దుల కులస్తులను బిచ్చగాండ్ల కింద పరిగణిస్తూ అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన దిల్సుఖ్నగర్లో బత్తుల రాకేష్, గంట అశోక్లను జైలుకు పంపించారు. చంచల్గూడ, చర్లపల్లి జైళ్లలో వేసిన వీరిని కొట్టడం, గుండు పీకడం వంటి చర్యలకు పోలీసులు పాల్పడటం చాలా దారుణం. దొంగలు, రౌడీ మూకలను వేసినట్టుగా సాదాసీదా కులవృత్తిని నమ్ముకొని బతుకుతుంటే పోలీసులు అరెస్టు చేసి వేధింపులకు పాల్పడడం న్యాయమేనా? ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తామని ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఘంటాపథంగా ఢంకా మోగించి చెప్పారు. అంతేకాదు కుల వృత్తిదారులను ఆదుకుంటాం, వృత్తులను ఆధునీకరిస్తామని చెప్పిన మాటలు గుర్తుకు లేవా? అనాదిగా సంక్రాంతికి ముందు నుండి గంగిరెద్దులను ఆడించే కులవృత్తిదారులను బిచ్చగాండ్లుగా చూస్తూ పోలీసులు అరెస్టు చేయడం అన్యాయం. తెలంగాణ ఉద్యమ సమయంలో సబ్బండ కులాలతోపాటు గంగిరెద్దులవారు కూడా ఆటపాటలతో రోడ్లమీదకు వచ్చి నిరసన తెలిపారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఎన్నో కలలుగన్నారు. వీరితోపాటు సంచార కులాలు, సేవా కులాలవారు తమ ఆచార వ్యవహార పద్ధతులను పాటిస్తూ వృత్తులు చేసుకుంటున్న వారిలో గంగిరెద్దులు, బహురూపులు, శారదగాండ్లు, హరిదాసు లు వంటివారు కూడా ఇంటింటికీ తిరిగే వారిలో వున్నారు. వీరికి వృత్తితప్ప వేరే ప్రత్యామ్నాయ పనులు లేవు. ''అమ్మ పెట్టదు, అడుక్కుతింటే ఊరుకోదు'' అన్నట్టుంది సర్కారు పద్ధతి.
వృత్తిచేసుకొని జీవించేవారిని అడ్డుకొని జైళ్లలో వేస్తే, వారి భార్యా పిల్లలు ఎలా జీవిస్తారు. సంక్రాంతి పండుగపూట ఇండ్ల ముందు సందడి చేసే గంగిరెద్దులు, డూడూ బసవన్నల ఆటపాటలు ఇక కనిపించకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ, జైళ్లశాఖ వారు గంగిరెద్దుల కులస్తులను అడ్డుకోవడమంటే వారి పొట్టమీద కొట్టినట్టే. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తున్నది ఈ గంగిరెద్దులాట. తెలుగు పండుగలలో గంగిరెద్దులాటకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి 20 రోజులు, దీపావళికి మరో 20 రోజులు నగరంలో ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులను ఆడిస్తారు. కానీ వీరిని యాచకులుగా భావించి, కనిపిస్తే సమాచారమిచ్చినవారికి రూ.500 బహుమతి ఇస్తామని ప్రకటించడం దుర్మార్గం. గత వారం రోజులుగా అరెస్టు తంతు కొనసాగుతున్నది. ఇటీవల కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం, బొమ్మనపల్లికి చెందిన గంట అశోక్, బత్తుల రాకేష్, గంట అంకుష్లతోపాటు భీమాదేవరపల్లి మండలానికి చెందిన మరికొందరిని అదుపులోకి తీసుకొని చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే భిక్షాటన నిరోధించే చట్టం 1977 ప్రకారం పబ్లిక్ ప్రదేశంలో భిక్షాటన చేయడం నేరంగా పరిగణిస్తారు. కానీ గంగిరెద్దులాడించడం ఈ చట్టం పరిధిలోకి రాదు. గంగిరెద్దులాడించడం తెలుగునాట జానపద కళగా గుర్తింపు పొందింది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో గంగిరెద్దుల కులస్తులకు లభించే గుర్తింపు యాచకులంటూ అరెస్టులా? ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గంగిరెద్దుల కులస్తులను యాచకులుగా చూడకుండా వృత్తి కళాకారులుగా చూసి వారిని ఆదుకోవాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. వారి పిల్లలకు కేజీ టు పీజీ విద్యను ఉచితంగా అందించాలి. ఎంబీసీ సంచార కులాలకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు, 3 ఎకరాల భూమి, 50 సం||లు నిండిన వారికి రూ.2000 పింఛన్, ఉపాధి, ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- గుమ్మడిరాజు నరేష్
సెల్ : 9491039520
Authorization