వీడీసీల ఆగడాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్.. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. తాము ఆదేశించినంత పన్ను కట్టడం లేదని గౌడకులస్తులను బహిష్కరించింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లి వీడీసీ తీరుపై బాధితులు నిజామాబాద్ జేసీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
లక్కంపల్లి గ్రామంలో గీత కార్మికులు టీఎఫ్టీ లైసెన్స్‌తో కల్లు దుకాణం, గ్రామ శివారులో చెరువు కట్టపై ఈత చెట్ల కల్లు విక్రయిస్తున్నారు. వీటి నిర్వహణకు గాను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాదీ వీడీసీకి ఎంతో కొంత కట్టబెడుతూ వస్తున్నారు. కాగా గ్రామంలోని కొందరు వీడీసీ సభ్యులను ప్రభావితం చేసి రూ.2లక్షలు అడిగేలా ఉసిగొల్పారు. నెల రోజులుగా గ్రామ కమిటీకి గౌడ కులస్తుల మధ్య డబ్బుల విషయంలో రాజీ కుదరలేదు. తాము చెప్పినంత ఇవ్వాలని లేకపోతే గ్రామంలోని ఏ వ్యక్తీ కల్లు తాగకుండా చేస్తామని కరాఖండిగా చెప్పారు. దీంతో సమాధానం చెప్పలేక, కమిటీకి ఎదురు తిరగలేక గౌడకులస్తులు గ్రామ కమిటీతో సయోధ్యకు దిగివచ్చారు. అంత డబ్బు తాము చెల్లించలేమని, రూ.50వేలు ఇస్తామని ప్రాధేయపడ్డారు. చివరకు రూ.1 లక్ష పదివేలు చెల్లించాలని హుకూం జారీ చేసింది వీడీసీ. తమ వద్ద అంత స్థోమత లేదని, మునిపటిలా కల్లు విక్రయం జరగడం లేదని వారు ప్రాధేయపడ్డారు. మద్యంతో కల్లు విక్రయాలు తగ్గిపోయాయని వారి దృష్టికి తీసుకొచ్చారు. అయినా వినిపించుకోని వీడీసీ సభ్యులు గ్రామంలో దండోరా వేయించారు. ఎవరైనా కల్లు తాగినా, వారి హోటళ్లలో ఛారు తాగినా, వారి పొలాల్లో పనికి వెళ్లినా రూ.5వేల జరిమానా విధిస్తామని దండోరా వేయించారు. దీంతో 20 రోజులుగా కల్లు దుకాణంలోకి గానీ హోటల్లోకి గానీ పొలాల్లోకి గాని ఎవరు వెళ్లకపోవడంతో ఆందోళన చెందిన గౌడకులస్తులు జేసీకి ఫిర్యాదు చేశారు.
అంజయ్య
సెల్ : 9948802082
గౌడకులస్తులకు ఆదాయం తక్కువ
గౌడ కులస్తులకు కల్లుపైన వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. అయినా మా వంతు సాయంగా గ్రామాభివృద్ధి కమిటీకి ఎంతోకొంత చెల్లిస్తున్నాం. తోచిన విధంగా అందజేస్తున్నాం. వీడీసీ డబ్బులను డిమాండ్ చేయడం తగదు. ఇలా అయితే గౌడ కులస్తుల కుటుంబాలు వీధిన పడుతాయి.
- ఎనుగంటి దశగౌడ్, గౌడసంఘం మండలాధ్యక్షులు
మా బాధను అర్థం చేసుకోండి
గతంలో లిక్కర్ వినియోగం తక్కువ ఉన్నప్పుడు కల్లు దుకాణంలో ఎక్కువగా కల్లు తాగేవారు. కాలం మారుతున్నా కొద్ది వైన్‌షాపుల్లో మద్యం ఎక్కువ తాగుతున్నారు. దీంతో మా దుకాణాలు నడవడం లేదు. మా బాధను అర్థం చేసుకోవాలి.
- నరేష్‌గౌడ్, గ్రామస్తుడు
Authorization