భూభాగంలో పుట్టిన వారంతా ఒకే రకంగా బతకడం లేదు. ఒకే రకమైన ఆచారాలు, వ్యవహారాలు కావు. ఒకే విధమైన బతుకుదెరువూ లేదు. దేశంలోని ప్రజలందరికీ రాజ్యాంగంలో ఒకేరకమైన హక్కులు కల్పించబడ్డాయి. మనుషులంతా సమానమేనని చట్టం చేయబడింది. కానీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నా ప్రజల స్థితిగతులు మారలేదు. వివక్ష ఎదుర్కోవడం తగ్గలేదు. దేశంలో దళితులు అత్యధికంగా అనేక రకాల వివక్షలకు గురవుతున్నారు. దేశంలోని అన్ని వర్గాల మహిళలు ఆ బాధను అనుభవిస్తున్నారు. మరోవైపు దేశంలో అనేక రకాల హక్కులకు నోచుకోకుండా తీవ్రమైన వివక్షకు గురవుతున్నది ట్రాన్స్‌జెండర్స్ (హిజ్రాలు). వీరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా అందరూ వారివారి పరిధిలో అనేక రకాల వివక్షలకు గురవుతున్నారు.
ఆమె పేరు శ్రీనిధి అలియాస్ శ్రీకాంత్‌రెడ్డి. హైదరాబాద్ నగరానికి చెందిన ఆమెకు చిన్నతనం నుండి ఆడవారిలా తయారు కావడం, బొట్టు పెట్టుకోవడం, లిఫ్ట్స్టిక్ రాసుకోవడం వంటివంటే ఆమెకు ఎంతో ఇష్టం. దీంతో చాలా మంది ఆమెను హేలన చేసేవారు. స్కూల్లో స్నేహితులు కూడా 'నువ్వు తేడా' అంటూ గేలి చేసేవారు. మనోవేదనకు గురిచేసేవారు. ఇంట్లోనూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక లాభం లేదని 9వ తరగతి చదివే సమయంలో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. ట్రాన్స్ జెండర్స్‌ను కలిసి వారితోనే ఉండిపోయింది. అయితే అక్కడి సమస్యల నుండి బయటపడ్డాననుకుంటే ఇక్కడ సమస్యలు అంతకన్నా అధికంగా ఉండటంతో ఆమె ఎన్నో సార్లు బాధపడింది.
శ్రీనిధి ఇంటి నుంచి పారిపోయి వచ్చిన తర్వాత ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి పోయింది. అయితే ఇక్కడ ట్రాన్స్‌జెండర్స్‌లో గురువు, నాని అంటూ పలు తరగతులుంటాయి. ప్రతి రోజు వీరు సంపాదించిన దాంట్లో గురువుకు కొంత చెల్లించాలి. వీరి ఆలనాపాలనా అన్నీ గురువుగా ఉన్న వ్యక్తే చూసుకుంటుంది. మరి డబ్బు సంపాదించడం ఎలా? ట్రాన్స్‌జెండర్స్‌కు ఎవరూ పని ఇవ్వరు. తిండి పెట్టరు. ఆలనా పాలనా అడిగేవారే ఉండరు. ఓ రకంగా ట్రాన్స్‌జెండర్స్‌ను ఈ సమాజం వెలివేసినట్టుగానే భావిస్తోంది. వారు కూడా మనుషులేనని, వారూ మనతో సమానమని ఎవరూ భావించరు. దీంతో వీరు బతకడమే భారంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో వీరి ప్రధాన వృత్తి లైంగిక సంపర్కంగా మారిపోయింది.
ఓ టీవీ చానెల్ ట్రాన్స్జెండర్ల సమస్యలపై కథనం ప్రసారం చేసే సమయంలో శ్రీనిధి తల్లిదండ్రులు ఆమెను గుర్తించారు. వెంటనే ఆమెను వెతుక్కుంటూ వచ్చి చాలా బాధపడ్డారు. ''జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి వెళ్దాం పదా..'' అని బతిమిలాడినా ఆమె ఇంటికి వెళ్లడానికి ఇష్టపడలేదు. తిరిగి ఇంటికెళ్తే చుట్టాలు, పక్కాలు తమ తల్లిదండ్రులను మరింత అవమానకరంగా చూస్తారు. ఇదివరకటిలా కలిసి ఉండలేరు. మాట్లాడరు. తాను హిజ్రాగా మారడం తమ తల్లిదండ్రులకు అవమానంగా ఉంటుందని ఆమె ఆలోచన. అందుకే ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. ఆమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆయన పెండ్లికి కూడా శ్రీనిధి విషయం తెలిసి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. ఏదేమైనా తన బతుకు ఇలా అయిపోయింది. తన వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఇబ్బంది రాకూడదని ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు అప్పుడప్పుడూ ఇంటికి వెళ్లి అలా కనిపించి ఇలా తిరిగొస్తూ ఉంటుంది.
ఎన్నో కష్టాలు...
కన్నవారి వద్దకు వెళ్దామంటే చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేస్తారని భయపడతారు. ''అయ్యో.. నీ కొడుకు ఇలా అయిపోయాడా?'' అంటూ హేలనగా మాట్లాడతారు. మరోవైపు సమాజం చూసే వివక్ష పూరిత చూపులు మరింత మనస్తాపానికి గురి చేస్తాయి. తాము కనిపిస్తే చాలు వారు మనుషులే కాదు అన్నట్టుగా దూరంగా జరిగిపోతారు. ''చిన్న పిల్లలు మమ్మల్ని చూసి భయపడుతుంటారు. ఆ సమయంలో ఎంతో హృదయవిదారకమైన బాధను అనుభవిస్తాం'' అని హిజ్రాలు మధనపడుతూ చెబుతుంటారు.
అందరితో సమానంగా మమ్మల్ని గుర్తించాలి
అందరితో సమానంగా బతకాలని మాకూ ఉంటుంది. కానీ సమాజం మమ్మల్ని అలా గుర్తించడం లేదు. అయితే ఈ నిరీక్షణ ఎంత కాలం, ఇలా అవమానాల పాలవడం ఎంతకాలమో చెప్పలేం. మమ్మల్ని పెండ్లి చేసుకునే వారు కూడా దొరుకుతారు. అలా హాయిగా పెండ్లి చేసుకొని కుటుంబంతో మా జీవితం మేము బతకాలని కోరుకుంటున్నాం. అప్పటి వరకు ఈ నిరీక్షణ తప్పదు. అయితే మా సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. కచ్చితంగా మాకు న్యాయమైన విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
- శ్రీనిధి, ట్రాన్స్‌జెండర్
హక్కుల కోసం పోరుబాట
సమాజంలో మాకూ గుర్తింపు రావాలని వారు కోరుకుంటున్నారు. విద్యా, ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. అన్ని రంగాల్లో ఆడ, మగలకు కేటాయింపులు ఉన్నట్టే ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా కేటాయింపులు ఉండాలని కోరుతున్నారు. ట్రాన్స్‌జెండర్స్‌ను ఎవరైనా ఇష్టపడి పెండ్లి చేసుకుంటే వారు బతికేందుకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించి అండగా నిలవాలి. రౌడీ మూకల నుంచి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డిమాండ్లతో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో గోషామాహల్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా చంద్రముఖిని భరిలోకి దింపారు. ఆమె గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆమె గెలిచినా, ఓడినా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని చెబుతున్నారు.
కిరణ్‌కుమార్ ఓగోటి
సెల్:9666011107