హారతి వాగీశ్
భావావేశం, ఉద్వేగం రెండూ సామాజిక సంవాద వివాదాలలో సాధారణం. అవి అక్కడితో ఆగక సృజనకు, ఆలోచనకూ, ఆచరణకూ దారితీస్తూ, జాగ్రత్తగా పనిలోకి మారుతూ, ఒక సమస్యకు, స్వల్ప కాల, మధ్య కాల, దీర్ఘ కాల పరిష్కారాలను వెతికే వైపుకు కదలడం సాధారణంగా సామాజిక, ఆర్థిక పరివర్తనా ప్రయత్నాలలో ఉండే ఒక క్రమం.
పుట్టుక, పునాది, ఉన్నతత్వం, నీచత్వం అనే సామాజిక సాంస్కృతిక నీతిని బహుజన శ్రేణు లలోని భావావేశ సృజనశీల నిర్మాణాత్మక గొంతులు తరాల నుండి ఎత్తి చూపుతూ నిరసన తెలుపుతూ ఉన్నాయి. దాన్ని పలుచనజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు జాంబ పురాణం వంటి కుల పురాణాలతోపాటు శంకర, చండాల సంవాదము, కబీరు వాణి వంటి అనేక రూపాలలో వాటిలో కూడా ఈ నిరసన గొంతు వినిపిస్తూనే ఉంది. 19 శతాబ్దం నుండి నిరసనతోపాటు నిర్మాణాత్మక ప్రయత్నం వేగంగా మారి ఒక మేరకు వర్ణ, కుల పవిత్రత అనే భావన కొంత బీటలు వారింది. అంటే కేవలం భావావేశం వలన కాదు, దానితోపాటు సాగిన ప్రయత్నం వలన పుట్టుకతోనే ఉన్నతులం అని భావించే వారి ఆలోచనలను, ఆచరణను సమీక్ష చేసుకొని, అది సరి కాదు అనే వైపుకు కొంత మేరకైనా జరిగిన స్థితి ఏర్పడింది. సామాజిక స్థాయిలో నిరసన, నిర్మాణం వలన, అదే విధంగా రాజ్య శక్తి కొంత మేరకైనా కుల వర్ణ పవిత్రతను పలుచబరిచే దానికి తోడ్పడింది. అంటే దీర్ఘ కాలం చాలా ఓపికగా, ఒకప్పుడు ఎక్కువ వేగంగా, ఒకప్పుడు తక్కువ వేగంగా జరిగిన బహుజన శ్రేణుల ప్రయత్నాలు, వాటికి అనుకూలమైన సామాజిక ఆర్థిక మార్పులు మాత్రమే బహుజన శ్రేణులకు మేలు చేయగలవని అర్థమవుతూ ఉంది.
ఈ మార్పు వేగాన్ని పెంచడం ఎట్లా?
పుట్టుక, పునాది, ఉన్నతత్వం, నీచత్వం అనే మానసిక, సామాజిక, సాంస్కృతిక నిర్మితిని బాగా బలహీనపరిచి దానిని రూపుమాపడం ఎట్లా? అనే ప్రశ్నలు చాలా ముఖ్యం. ఇవి చాలా చికాకు పరచే ప్రశ్నలు కూడా. వీటికి జిందా తిలస్మాత్ (ఏక మూలికా) సమాధానాలు ఉండవనేది స్పష్టం. కానీ ఈ ప్రశ్నలు మన ముందు ఇంకా చాలా కాలం పాటు ఉంటాయి. ఇలాంటి స్థితిలో బహుజన శ్రేణులకు చెందిన కొందరు స్వయం ప్రకటిత మిలిటెంట్ బృందాల వారు ఆవేశాన్ని మాత్రమే చూపుతూ ఉంటారు. దానిని ఆలోచన, ఆచరణ వైపుకు తీసుకుపోయే మార్గంలోకి పయనం చేయరు. చేసినా అది అరుదై ఉంటుంది. వీళ్లలో చాలామటుకు బహుజన విముక్తి మహాప్రయత్నాన్ని, తక్కువ శ్రమతో, తమ పేరు ప్రఖ్యాతులను పెంచుకోవడం కోసం వాడుకుంటూ ఉంటారు. వీళ్లకు ఉపయోగపడిన దానిలో ఒకటో వంతు కూడా వీరు ఆ మహా ప్రయత్నానికి పనికి రారు. వీరు తమ ఆవేశ పూరిత స్వరాన్ని, దానికి అదే ఒక గొప్ప విమోచనా శక్తి అని అనుకుంటూ ఉంటారు. తమ పెద్ద నోటిని, బొడ్డుకింది మాటలద్వారా బహుజన శ్రేణుల మెప్పు పొందటం చేస్తూ ఉంటారు. వీరి ఆవేశం, సాహిత్య సృజన రూపం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆ సాహిత్యం ఒక మేరకు సమకాలీన బహుజన శ్రేణులకు కొంత ప్రేరణగా, ముందు తరాలకు పరిశీలక అంశాలుగా కూడా ఉండవచ్చు. వాటి ప్రాసంగికత, ప్రయోజనం, సాహిత్య విలువ వంటివి తరువాతి తరం సాహిత్య, సామాజిక విశ్లేషణలో నిగ్గు తేలుతాయి. నోటి దురుసుతనం, ఎంత పచ్చిగా మాట్లాడితే అంత గొప్ప అనుకునే స్వభావం ఈ మిలిటెంట్ బృందాలకు సహజ లక్షణం. వీరు సాధారణంగా నిర్మాణాత్మక పనులనుండి దూరంగా ఉంటారు. ఒక అంశం నుండి మరో అంశం వైపుకు ఆవేశంగా దూకుతూ, నిప్పులు కక్కుతూ, ఏదో పెద్ద పని చేశామనే తీరులో గోల పెడుతూ ఉంటారు. ఆవేశం, వాగాడంబరం ప్రధానంగా ఉండే ఈ గుంపు జనం దృష్టిని ఆకర్షించి, చప్పట్లు కొట్టించుకోవడం అనే జనరంజక వ్యసనానికి గురై ఉంటారు.
హద్దు లేని, వివేచనతో పనిలేని ఆవేశం వలన వీరు అనేక వ్యక్తిగత, సాముదాయిక చిక్కులు కొనితెచ్చుకుంటూ, వాటిని గొప్ప సర్టిఫికెట్లుగా భావిస్తూ ఉంటారు. ఆ బాధలకు కూడా తమ శత్రువులే ప్రధాన కారణమని అంటూ ఉంటారు. మొత్తానికి attention seeking addictionకు వారు గురై ఉంటారు. నిర్మాణాత్మక ప్రయత్నం అలవాటు లేని వీరు తమను తాము మొత్తం బహుజన శ్రేణి విమోచనా పోరాటపు అగ్రగామి దళం అని అనుకుంటూ ఉంటారు. మొత్తానికి ఆవేశం, సృజన, ఆలోచన, ఆచరణ అనే దారి వారికి పట్టదు. కొంచం మౌనం, కాస్తా నిశ్శబ్దంతో పరిచయం పెంచుకొని కొంత లోచూపు పెంచుకోవాలి అని వీళ్లకు తోచదు. విపరీత ఆవేశ గుణం వలన వీరికి ఎదుటి వారిలో తప్పులు చూడటం అనే గుణం విస్తరించి, సామాజిక ఆర్థిక మార్పు సందర్భంలో సాధారణ గుణదోష విచారణ చేయడం అనే సామర్థ్యం లోపిస్తుంది. దాని వలన శత్రు, మిత్ర వివేకమూ దెబ్బతిని ఉంటుంది. కనుక వీరి హేతుబుద్ధి, తర్కమూ, భాష, సృజనశీలత బూడిదలో పోసిన పన్నీరు అవుతూ ఉంటుంది.
పైన రాసిన ప్రధాన ప్రశ్నలకు వీరు ఇవ్వగలిగిన విలువైన సమాధానాలు ఏమీ ఉండవు. పనిలో నిమగం కాకపోవడం వలన, వాళ్లకు మంచిగా అనిపించిన వాటినే (వాటిలో పస లేకపోయినా), లేక పెద్దగా లోతు లేని జనప్రియ వ్యాఖ్యలను సౌండ్ పెంచి, కొంత రంగు రాసి, మాట్లాడుతూ ఉంటారు. బహుజన శ్రేణులలో ఆవేశమూ, ఆలోచనా, కార్యాచరణను కలిపి నడిపే కార్యశూరులు వీరిని కాలక్రమంలో పక్కన పెడుతారు. ఎందుకంటే చప్పట్లకు, ఈలలకు మరిగిన ఈ బాచ్ నుండి ఒరిగేది ఏమీ ఉండదని వారికి అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు వైవిధ్యభరితం అయిన సమ భావన, ఆసక్తి గల బృందాలు తీవ్రంగా ఆలోచన చేస్తూ ఆచరణలో సాగుతూ పోయినప్పుడు మాత్రమే వస్తాయి. అడ్డూ అదుపూలేని నోటి దూల చూపే ఈ గుంపు శాసనాలలో తప్ప కనిపించని కాలముఖ శైవ శాఖ వంటి గుంపు మాత్రమే. అయితే అర్థం పర్థంలేని, హేతువు లేని ఈ వదరుబోతులను కట్టడి చేయాల్సిన అవసరం క్రియాశూరులు అయిన బహుజన శ్రేణి నాయకత్వం మీద, వారికి మద్దతుగా నిలిచే బృందాల మీద ఉంటుంది. ఎందుకంటే కాలు గడప దాటించని ఈ హైపెర్ ఆక్టివ్ నోటి మిలిటెన్సీ గుంపు బహుజన విమోచనా ప్రయత్నానికి చేసే మేలు కంటే కీడే ఎక్కువ. పదిమందిని కలుపుకుపోయే సామర్థ్యం బహుజన విమోచనా పోరాటాలకు చాలా అవసరం. ఎందుకంటే వాటి శత్రు పక్షం బలమైనది, మాయా యుద్ధాలలో ఆరితేరినది. గనుక బహుజన శ్రేణులలో పుట్టని వాళ్లు అందరూ ఆ శ్రేణికి ద్రోహం చేయడం కోసమే పుట్టినారు అనే ఎసెన్షియలిస్టూ/ మిని మలిస్ట్ అతివాదాలు చేయడం ఈ క్రియారహిత భావావేశ గుంపులకు నిత్యకృత్యమై ఉంటుంది. ఇది ఒక అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు వంటి కథ.
సామాజిక, ఆర్థిక మార్పు సంవాదాలు మర్యాదస్తుల మాటల వలే సాగవు. కానీ శత్రు, మిత్ర వివేకం లేని, నిర్మాణాలలో ఇమడని పనికిరాని, స్వీయ నియంత్రణ లేని ఈ loose canons ను కట్టడి చేయాల్సి ఉంటుంది.
గత శతాబ్ది చివర, ఈ శతాబ్దిలో వెల్లువలా వస్తున్న ధర్మ బద్దమైన బహుజన శ్రేణి పోరాటాలు, అవి వేస్తున్న ప్రశ్నలూ శతాబ్దాల చారిత్రిక ప్రవాహంలో భాగమని గుర్తించాలి. అవి రాబోయే కాలంలో ఈ దేశం ముందున్న పలు ప్రశ్నలకు సమాధానాలు వెతికే శక్తిని పుట్టిస్తాయి. ఆవేశం ఆలోచన కార్యాచరణ వైపుకు పయనిస్తూ పోయే ప్రయాణంలోనే అది సాధ్యం. కాలం పనికి పూనుకునే వారిని, ఓపికతో కూడిన కార్యాచరణ అనే సానరాయి మీద రాసినప్పుడు సారం లేని మట్టిగడ్డలు పెగిలిపోతాయి. మణులు మిగిలిపోతాయి. వొట్టి వదరుబోతుతనానికి చరిత్రలో ఉండవలసిన స్థానమే ఉంటుంది.
Authorization