ముఖ్యమంత్రి,తెలంగాణ రాష్ట్రం.
విషయం:- నా కడుపులోని పిండం ఆడపిల్ల అయితే రక్షణ కోరుతూ...
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ...
నా వయసు 25 సంవత్సరాలు. సగటు ఆడ పిల్లగా పుట్టి పెరిగాను. ఊహ తెలిసినప్పటి నుంచీ ఆడవారిపై జరిగే అఘాయిత్యాలను చూస్తూనే ఉన్నాను. డిగ్రీ వరకు చదువుకున్నాను కానీ, నాకు ఏదైనా ఉద్యోగం చేయాలంటే చాలా భయం. ఎటు చూసినా మగ వారే. వారిలో నా పరిచయస్తులు కూడా ఉన్నారు. దేశంలో ఏ మూలన అత్యాచారం జరిగిందనే వార్త చదివినా, విన్నా... నా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. చాలా సాదా సీదా మధ్య తరగతి కుటుంబంలో పెరిగినదానిని కదా. ఇటువంటి భయాలకు తోడు అమ్మా నాన్న కూడా బయటకు వెళ్తే ఏదైనా జరిగితే కోలుకోలేమనే అభిప్రాయంతోనే నన్ను పెంచారు.
నాకు ఐదేండ్ల క్రితం పెండ్లి అయింది. మా ఆయన కూడా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చారు. ఆయన ఒక సాధారణ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయన కూడా ఉద్యోగం చేయమని నన్ను బలవంతం చేయలేదు. దీనితో ఇంటి వద్దనే ఉంటున్నాను. అయినా భయం నన్ను వీడనే లేదు. నా జీవితంలో పిల్లలను కనొద్దు అని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే ఆడది అయితే చాలు... వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాల వార్తలు వింటుంటే బిడ్డను కనడమెందుకు, ఇలా మృగాల మధ్య బలి ఇవ్వడమెందుకు అనే ఆలోచనలు నా నిర్ణయానికి మరింత బలం చేకూర్చాయి.
కానీ, ముఖ్యమంత్రి గారూ... మీరు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే బస్సుల్లో ఆడవారి వైపు మగవారు రాకుండా మధ్యలో అడ్డు పెట్టించారు. ఆడవారి పట్ల బాధ్యతగా ఆలోచించే ముఖ్యమంత్రి వచ్చారని ఎంత సంబరపడ్డానో. ఈ మధ్య మా అమ్మ వాళ్ల నుంచి, అత్తింటి వారి నుంచి బిడ్డలను కనాలని ఒత్తిడి బాగా పెరిగింది. దీనితో నేను, మా వారు బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. నాలో ఓ నలుసు ప్రాణం పోసుకుని మూడు నెలలు అవుతున్నది. మా ఇంటిల్లిపాదీ కొత్తగా రాబోయే మరో సభ్యుడు/సభ్యురాలు కోసం ఎంతో సంబరంగా ఎదురు చూస్తున్నారు. కానీ, నాలో గతంలోని భయోత్పాతమే పునరావృతం అయింది.
నిన్న గాక మొన్న 70ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగిందని వార్తా పత్రికలో చదివాను. ఈరోజు తొమ్మిది నెలల పసి పాపాయిపై అత్యాచారం అనే సంఘటన నన్ను నిలవనీయడంలేదు. ఆడదిగా పుట్టడమే అత్యాచారం కోసమన్నట్లుగా సమాజం మారుతుందేమో అని భయంగా ఉంది. మీ పాలనలో అత్యాచారాలు జరగడానికి గల కారణాలను అన్వేషించి, పరిష్కార మార్గాలు చూపే దిశగా చర్యలు చేపడతారని ఆశపడ్డాను. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నా కడుపులో ఉన్నది బాబు కాకుండా పాప అయితే నేను తట్టుకునే స్థితి కనిపించడంలేదు. నెలల పసిగుడ్డు నుంచి ఆ పాపాయిని ఆడతనం కనిపించని విధంగా పెంచడం నా వల్ల అయ్యే పని కాదు. అందుకే ఈ గర్భస్థ శిశువును భూమి మీదకు తీసుకురావాలంటే ఆడ పిల్లల రక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా లాంటి తల్లులకు భరోసా కల్పిచే చర్యలు చేపట్టండి. అప్పుడే మాలాంటి తల్లులు ధై ర్యంగా బిడ్డలను కనడానికి సిద్ధపడతారు.
- నస్రీన్ఖాన్
Authorization