రంగనాయకమ్మ
- 10 -
ఒక నాటి 'ఆదిమ కాలాన్ని' చూసిన వాళ్లెవరూ లేరు. కుల విధానం ఎలా ఏర్పడి ఉంటుందో చెప్పే ఒక్క ఆధారం కూడా లేదు. కానీ, 'కుల విధానం' అనేది, ప్రకృతి సహజమైన, భౌతిక విషయం కాదు. వృక్షాలు, వేరు వేరు లక్షణాల తోటీ, జంతువులు వేరువేరు లక్షణాల తోటీ ఉన్నట్టు, మనుషులు వేరు వేరు లక్షణాలతో ఉండరు.
ఒక వ్యక్తి కులం చాకలీ, ఇంకో వ్యక్తి కులం మంగలీ అవడానికి కారణాలేమిటో, ఎక్కడా రాసి లేవు. వాటిని ఊహించవలిసిందే. ఆ వ్యక్తులు చేసే శ్రమల పేర్లే అవి. క్రమంగా అవే వృత్తులయ్యాయి.
ఈ రెండు వృత్తులే కాదు, సమాజం సాగడానికి రోజూ వంద రకాల శ్రమలు అవసరమౌతూ ఉంటాయి. ఆ శ్రమలు జరగడానికి అవసరమయ్యే పనిముట్లూ, కాలాలూ, తక్కువో ఎక్కువో అవుతూ ఉంటాయి. ఆ శ్రమల కొలతలే, ఆ శ్రమల విలువలు. ఇదంతా ఎప్పుడు స్తిరపడిందో ఎవ్వరూ చెప్పలేరు. ఊహించవలిసిందే.
శ్రమల కోసం అవసరమయ్యే కాలాలు, కొన్నిటికి తక్కువా, కొన్నిటికి ఎక్కువా ఉండడం నిజమే. తక్కువ శ్రమకి తక్కువ విలువా, ఎక్కువ శ్రమకి ఎక్కువ విలువా. శ్రమలు తెలిసిన తర్వాత, 'శ్రమ దోపిడీ' కూడా ప్రారంభం అయింది. శ్రమలు చెయ్యడంలో తేడాల వల్లనే, ఆ తేడాలే కులాలుగానూ, వాటికి పేర్లూ, ఏర్పడి ఉంటాయని ఊహించవలిసిందే. అది నిజం కాకపోతే, 'కుల విధానం' ఎలా పుట్టి ఉంటుందో, ఎవరైనా ఇంకో కారణం చెప్పాలి.
కుల విధానం పుట్టడానికి కారణం, శ్రమల్లో తేడాలే అని గ్రహించగలిగితే, ఆ కుల విధానం పోవడానికి కారణాన్ని కూడా, ఆ శ్రమల వేపు నించే గ్రహించవలిసి ఉంటుంది.
బానిసల కాలం నాటి నించీ మానవులు, శ్రమలు చేసే వాళ్లూ - శ్రమలు చెయ్యని వాళ్లూగా విడిపోయారు. ఆ నాటి నించీ మానవ సమాజం శ్రమ, దోపిడీ జరిగే శతృ వర్గాల సమాజంగా ప్రారంభం అయింది. ఆ తేడాలు, పెట్టుబడిదారీ విధానంలో మరింత పెరిగాయి. శ్రమలు చెయ్యడంలో తేడాలు అలాగే నడుస్తూ వుంటే, కుల విధానం కూడా అలానే వుండి పోతుంది.
వామపక్షాలు : వామపక్షాల వారు, ఆచరణకు సాధ్యం కాని సిద్ధాంతాలు చెపుతారనీ, వీరు కులాన్ని, వర్గం తాలూకు మరో పార్శ్వంగా చూడడానికే ఇష్టపడతారనీ, ఇది కూడా భ్రమే అని రచయిత అంటారు. (కుల విధానాలు, వర్గాలకు సంబంధించిన అంశమే అనడంలో ఏ తప్పూ ఉండదు. దీన్ని ఎక్కువ వివరాలతో చూడాలి.)
కులాల్లో వైరుధ్యాలన్నీ, శ్రమ సంబంధల్లోవే. శ్రమ సంబంధాలలో, భూమి పాత్ర ఉండదా? ఒక కులం, భూమిని కలిగి ఉందా, లేదా అనే విషయం ఉండదా? ఆ భూమి మీద, శ్రమలు ఎవరు చేస్తారు? ఆ ఫలితాలు ఎవరికి అందుతాయి? ఈ వివరాలు అక్కర లేదా?
ఖైర్లాంజీలో, ఒక దళిత కుటుంబం మీద ఘోర దురంతాలు జరగడానికి వున్న కారణాల్లో, ఆ కుటుంబానికి వున్న భూమి కూడా ఒక కారణం కాదనలేము. ఆ కుటుంబం, ఆ భూమిలో చాకిరీలు చేసుకుంటూ సుఖంగా బతకడం, ఇతర కులాలకు కన్నెర్రగా ఉంది అని ఈ రచయిత కూడా అన్నారు.(పేజీ: 146).
ఖైర్లాంజీ సమస్యకు, ఆ దళిత కుటుంబానికి మాత్రమే వున్న భూమితో, ఇతర కులాలకు తగాదాలే కారణం అని వామపక్షాలు భావిస్తారట! (ఆ గ్రామంలో, ఆ దళిత కుటుంబం మీద ఇతర కులాలకు కన్నెర్రగా ఉందని ఈ రచయిత కూడా అన్నారు. దీనికీ, వామపక్షాలు భావించిన దానికీ, తేడా ఏమిటి?)
కార్ల్మార్క్సుకి ఉన్న భ్రమ: మార్క్సు విషయంలో 'భ్రమ' అనే మాటను ఆనంద్ ఉపయోగించకపోయినప్పటికీ, ఇతర ధోరణుల వాళ్లతో కలిపి మార్క్సుని కూడా ప్రస్తావించడం వల్ల ఇలా అనుకోవాల్సి వస్తుంది.
మార్క్సు గురించి ఆనంద్ వ్యాఖ్య: ''ఐరోపాలో, పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించి, ఎలాగైతే, భూస్వామ్య వ్యవస్థను కూల్చివేసిందో, అలాగే, భారత్లో కూడా, పెట్టుబడిదారీ విధానం, భూస్వామ్య వ్యవస్థనూ, దానితోపాటు కుల వ్యవస్థనూ, కూల్చి వేస్తుందని (కొందరు) భావించారు. స్వయంగా కార్ల్మార్క్సు సైతం, వలస పాలనలో పెట్టుబడిదారీ అభివృద్ధి ప్రభావం కారణంగా కులాలు నశిస్తాయని ఆశించాడు. జరిగింది మాత్రం వేరు. భారతదేశంలో, భూస్వామ్య వ్యవస్థ, తను పోవడానికి బదులు, అది పెట్టుబడిదారీ వ్యవస్థతోనే సర్దుబాటు చేసుకుంది. తత్ఫలితంగా, కులాలు, కొంత మారిన రూపంలో అయినా బతికి బట్టకట్టాయి.'' (పేజీ: 143)
మార్క్సు, ఏ రచనలో, కుల నిర్మూలన గురించి ఏ సందర్భంలో, ఏమన్నదీ ఆనంద్ వివరించలేదు. 'ఇండియాలో బ్రిటిష్ పరిపాలన భావి ఫలితాలు' అనే వ్యాసంలో (1853లో) మార్క్సు రాసిన ఒక వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనంద్ అలా వ్యాఖ్యానించాడని అనుకోవాలి. ఆ వ్యాసంలో, మార్క్సు అన్న మాటలు: ''హిందూ వర్ణ వ్యవస్థకి పునాదులైనట్టీ, భారత ప్రగతికీ, భారత శక్తికీ, అంతిమ అవరోధాలైనట్టీ, అనువంశకుములైన శ్రమ విభజనలను, రైల్వే విధానం ఫలితంగా ఏర్పడే ఆధునిక పరిశ్రమ తుడిచి పెట్టేస్తుంది.'' (కార్ల్ మార్క్సు, ఫ్రెడరిక్ ఎంగెల్స్, 'వలస విధానం' వ్యాసావళి. మాస్కో ప్రచురణ. పేజీలు: 94-102).
అయితే, కులాల గురించి మార్క్సు అవగాహనను తెలుసుకోవాలంటే, ఆ వ్యాసంలో చేసిన వ్యాఖ్యల మీదే ఆధారపడితే సరిగా అర్ధం కాదు. ఎందుకంటే, ఎంగెల్స్తో కలిసి రాసిన 'జర్మన్ ఐడియాలజీ' (1845) నుంచీ, 'కాపిటల్' (1867) వరకూ రాసిన రచనల్లో, మార్క్సు కులాల గురించి అక్కడక్కడా మాట్లాడుతూనే ఉన్నాడు. వాటినన్నిటినీ దృష్టి లో పెట్టుకుంటేనే, కులాల గురించి మార్క్సు అవగాహన అర్ధమౌతుంది. అప్పుడు ఆనంద్ లాగా, 'మార్క్స్ ఆశించిన విధం గా జరగలేదు' అని వ్యాఖ్యానిం చడానికి వీలుండదు.
'కుల నిర్మూలన' గురించి మార్క్స్ అవగాహనని, ఆయన రచనల్ని ఆధారం చేసుకుని క్లుప్తంగా కొన్ని పాయింట్లు ఇలా చెప్పవచ్చును. (వివరంగా చూడాలనే ఆసక్తి ఉన్న వారు, 'దళిత సమస్య పరిష్కారానికి...' అనే నా పుస్తకానికి అనుబంధంగా చేర్చిన వ్యాసం చూడండి. దాని పేరు: మార్క్సు అవగాహనలో కులాలు.)
1.భారతీయులలో, మొర టు రూపంలో కన్పించే 'శ్రమ విభజన', వారి రాజ్యాంగ యం త్రంలోనూ, మతంలోనూ, కుల వ్యవస్థ ఉనికిలోకి రావడానికి కారణం. కానీ భావవాద దృక్పథం గల చరిత్రకారు డు మాత్రం, మొరటు సామాజిక శ్రమ విభజనా రూ పాన్ని సృష్టించిన శక్తి కులవ్యవస్తే-అని భావిస్తాడు.
2.కుల వ్యవస్థలో, సమాజం మొత్తంలో ఉండే శ్రమ విభజన, ఖచ్చితమైన, స్తిరమైన నియమాల ప్రకారం ఉంటుంది. ఆ నియమాలు, మొదట భౌతిక ఉత్పత్తి పరిస్థితుల నించే పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత చాలా కాలానికి అవి శాసనాల స్థాయికి చేరాయి.
3.వర్ణ వ్యవస్థకు పునాదులైన వారసత్వ శ్రమ విభజనలను, రైల్వే విధాన ఫలితంగా ఏర్పడే ఆధునిక పరిశ్రమ తుడిచి పెట్టేస్తుంది. కానీ, తమ ఉత్పత్తుల కోసం అవసరమయ్యే ముడిసరుకుల్ని చౌకగా గుంజుకోవడం-అనే ఏకైక లక్ష్యంతోనే, బ్రిటన్ పాలకులు రైల్వేవ్యవస్థని ప్రవేశపెట్టారు. (అంటే, బ్రిటీషు పాలకుల లక్ష్యం, భారతదేశంలో ఆధునిక పరిశ్రమని అభివృద్ధి పరచడం కాదన్న మాట. వాళ్ల దేశంలోని పరిశ్రమలకు కావల్సిన ముడి సరుకుల్ని తీసికెళ్లడమే ప్రధాన లక్ష్యం.)
4.ఆధునిక పరిశ్రమలో ఉండే ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి చెందినంత మాత్రాన, ప్రజల సాంఘిక స్థాయి మెరుగుపడదు, అవి వారిని విముక్తి చేయనూ లేవు. ప్రజలు వాటిని స్వాధీనం చేసుకుంటేనే వారికి విముక్తి.
5.ఒక 'పెద్ద సామాజిక విప్లవం' జరిగి ప్రజలలో, ప్రగతిశీలురైన వారి సమిష్టి అదుపాజ్ఞలలోకి ఆధునిక పరిశ్రమలోని ఉత్పత్తి సాధనాలు వచ్చినప్పుడే ప్రగతి సాధ్యం.
'కులాల' గురించి మార్క్సు చేసిన ప్రస్తావనలను అన్నిటినీ చూసినప్పుడు, భారతదేశంలో ఆధునిక పరిశ్రమ కొన్ని పరిమితుల్లోనే ఏర్పడడం, పెద్ద సామాజిక విప్లవం జరగకపోవడం, శ్రామికుల సమిష్టి ఆధీనంలోకి ఉత్పత్తి సాధనాలు రాకపోవడం -అంటే ఏవి ఎలా జరిగితే, కులాలు తుడుచుపెట్టుకు పోతాయో, అలా అవి జరగక పోవడం మనం గమనించవచ్చును. అలాంటప్పుడు, 'మార్క్సు ఆశించినట్టు జరగలేదు' అనకూడదు. మార్క్స్ ప్రస్తావించినవి జరిగితేనే గదా, మార్క్సు ఆశించినట్టు జరిగిందనో జరగలేదనో మనం అనగలిగేది?. ఫలానా పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఫలానా రకంగా జరుగుతుంది- అన్నప్పుడు, కావల్సిన పరిస్తితులు ఏర్పడలేదని అర్ధం.
(ఇంకా ఉంది)
Authorization