డ్రగ్స్ వ్యవహార కేసు ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న విషయం విదితమే. డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. ఇంకా పలువురిని విచారించే పనిలో ఉంది. విచారణలో భాగంగా వెలుగు చూస్తున్న కొన్ని విషయాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఎన్నో డ్రగ్స్ నేపథ్య చిత్రాలకు ప్రతిరూపాలుగా నిలిచాయనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి కొన్ని డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'...
ఫీయర్ అండ్ లోథింగ్ ఇన్ లాస్ వెగాస్
ఒక జర్నలిస్ట్, ఓ మానసిక న్యాయవాది కలిసి చేస్తున్న రోడ్డు ప్రయాణం చాలా ప్రమాదకరంగా, గజిబిజీగానూ సాగుతుంది. ఈ క్రమంలో ఓ చోట భారీ మొత్తంలో డ్రగ్స్ కనిపెడతారు. ఆ తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో రూపొందిన చిత్రం 'ఫీయర్ అండ్ లోతింగ్ ఇన్ లాస్ వెగాస్'. ఆద్యంతం వ్యంగ్య కామెడీ నేపథ్యంలో అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా దర్శకుడు టెర్రీ గిలియమ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 1998లో విడుదలైన ఈ చిత్రంలో జానీ డెప్, బెనిసియో డెల్ టోరో ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.
బ్లో
1950 టైమ్‌లో కొకైన్ స్మగ్లర్ జార్జ్ జంగ్ రియల్ లైఫ్ ఆధారంగా రూపొందించిన చిత్రం 'బ్లో'. జార్జ్ ఆర్థికంగా బాగా చితికిపోయిన కుటుంబంలో జన్మిస్తాడు. తన బాల్య జీవితం నిత్యం ఇబ్బందులతో సాగుతుంది. దీంతో కొంత మందితో కలిసి మాదక ద్రవ్యాల రవాణా చేస్తుంటాడు. అలా క్రమక్రమంగా తన మార్కెట్‌ను, పవర్‌ను విస్తరించుకుంటూ ఓ పెద్ద కొకైన్ స్మగ్లర్‌గా ఎదుగుతాడు.
ఈ నేపథ్యంతో దర్శకుడు టెడ్ డెమె ఈ డ్రగ్స్ బేస్డ్ చిత్రాన్ని రూపొందించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 50మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 83 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇందులో జార్జ్ జంగ్ పాత్రలో జానీ డెప్ నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో జోర్డి మెల్లా, పెనెలోప్ క్రజ్, రే లియోటా తదితరులు నటించి మెప్పించారు.
పైనాపిల్ ఎక్స్‌ప్రెస్
ప్రాసెస్ సర్వర్, గంజాయి డీలర్ మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారమే 'పైనాపిల్ ఎక్స్‌ప్రెస్'. ప్రాసెస్ సర్వర్, గంజాయి డీలర్ కలిసి ఓ హత్యను చూస్తారు. హత్య చేసిన వ్యక్తి సైతం పెద్ద స్మగ్లర్. హత్యను చూసిన వీరిని కూడా చంపేందుకు స్మగ్లర్ వెంటపడుతుంటాడు. మరోవైపు ఓ అవినీతి లేడీ పోలీస్ ఆఫీసర్ వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. అటు స్మగ్లర్, ఇటు లేడీ పోలీస్ ఆఫీసర్ నుంచి తప్పించుకునేందుకు ఈ ఇద్దరు పడిన ఇబ్బందులు, ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న కామెడీ ఈ చిత్రానికి హైలైట్. డేవిడ్ గోర్డన్ గ్రీన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2008లో విడుదలైన విశేష ప్రేక్షకాదరణ పొందింది. 27 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 101 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ప్రాసెస్ సర్వర్‌గా సెత్ రోగెన్, గంజాయి డీలర్‌గా జేమ్స్ ఫ్రాంకోల నటన నవ్వులు పంచుతుంది.
డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్
స్కూల్‌కు చివరి రోజు కావడంతో నలుగురు హైస్కూల్ విద్యార్థులు ఇంటికి తిరిగొచ్చే క్రమంలో బాగా ఎంజారు చేయాలనుకుంటారు. రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తమ్మీద డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకున్నాక వారిలో గొడవలు రావడం, అనంతరం చోటు గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. డ్రగ్స్ నేపథ్యంలో రూపొందిన ఈ కమింగ్ ఏజ్ కామెడీ చిత్రాన్ని దర్శకుడు రిచర్డ్ లింక్లేటర్ రూపొందించారు. 1993లో విడుదలైన ఈ చిత్రంలో జాసన్ లండన్, విలే విగ్గిన్స్, మాథ్యూ మెక్ కనౌగె, సాషా జెన్సన్ ప్రధాన పాత్రధారులు.
హ్యూమన్ ట్రాఫిక్
ఐదుగురు స్నేహితుల మధ్య ఉన్న సంబంధం నేపథ్యంలో రూపొందిన చిత్రం 'హ్యుమన్ ట్రాఫిక్'. ఐదుగురు స్నేహితులు కలిసి ఓ వారాంతంలో బాగా ఎంజారు చేయాలని క్లబ్‌కి వెళ్తారు. అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే
ఈ చిత్రం. ఎదుగుతున్న కుర్రాళ్ల ఆలోచనల్లో, చేష్టలలో వస్తున్న మార్పులను, డ్రగ్స్‌కి బానిస కావడం, క్లబ్ కల్చర్‌తోపాటు సామాజిక, రాజకీయ ప్రేరణ వంటి అంశాలను ఈ చిత్రం ప్రధానంగా ఫోకస్ చేసింది. జస్టిన్ కెరిగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1999లో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లింకన్, జాన్ సిమ్, లారైన్ పిల్కీంగ్టన్, షాన్ పార్కస్, డాని డయ్యర్ల నటన ఆకట్టుకుంటుంది.
పల్ప్ ఫిక్షన్
ఇద్దరు హంతకులు, ఒక బాక్సర్, ఓ గ్యాంగ్‌స్టర్ భార్య, అలాగే ఒక బందిపోటు జంట మధ్య చోటు చేసుకున్న హింస, డ్రగ్స్ బిజినెస్, చివరికి వాటి నుంచి విముక్తి పొందే నేపథ్యంలో రూపొందిన చిత్రం 'పల్ప్ ఫిక్షన్'. పై వారందరికీ, మిస్టీరియస్ బ్రీఫ్‌కేస్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటనేది ఆసక్తికరం. అనేక కథల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రానికి క్వెంటిన్ టరంటినో దర్శకత్వం వహించారు. బ్లాక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 1994లో విడుదలై సంచలన విజయం సాధించింది. కేవలం 9 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 214 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై గోల్డెన్ పామ్ అవార్డు దక్కించుకుంది. అలాగే ఏడు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేటై ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. ఇందులో జాన్ ట్రవోల్లా, శామ్యూల్ ఎల్.జాక్సన్, ఉమా థుర్మాన్, హార్వే కీటెల్, టిమ్ రోత్, అమండా ప్లమ్మర్, వింగ్ రేమ్స్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. చరిత్రను, సాంస్కృతిని చాటిన చిత్రంగా అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో ఈ చిత్రం భద్రపరచబడటం విశేషం.
సిటీ ఆఫ్ గాడ్
రియో డి జెనీరియో నగరంలో ఒకే వీధిలో ఇద్దరు కుర్రాళ్ళుంటారు. ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్ల నడుమ వారి జీవనం కొనసాగుతుంటుంది. దీంతో ఒకరు బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగితే, మరొకరు డ్రగ్స్ డీలర్‌గా ఎదుగడమనే ఇతివృత్తంతో యదార్థ సంఘటనల ఆధారంగా అదే పేరుతో వచ్చిన నవలను బేస్ చేసుకుని రూపొందించిన చిత్రమిది. ఫెర్నాండో మీరెల్స్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ బ్రెజిల్ చిత్రం
'బెస్ట్ మూవీ ఎవర్ మేడ్'గా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఫొటోగ్రాఫర్‌గా అలెగ్జాండర్ రోడ్రిగ్స్, డ్రగ్ డీలర్‌గా లియాండ్రో ఫర్మినో డా హోరా అద్భుతంగా నటించారు. మూడు మిలియన్ డాలర్లతో తెరకెక్కి 30 మిలియన్ డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది.
రెక్వియెమ్ ఫర్ ఏ డ్రీమ్
విభిన్న మనస్తత్వాలుగల నలుగురు వ్యక్తులు డ్రగ్స్‌కి బానిసవుతారు. అది శ్రుతి మించడంతో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది. భర్త కోల్పోయిన మహిళ, డ్రగ్స్‌కి బానిసైన ఆమె కుమారుడు, అతని ప్రియురాలు, అతని స్నేహితుడి పాత్రల మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో దర్శకుడు డారెన్ ఆరోనోఫ్క్సీ ఈ డ్రగ్స్ బేస్డ్ చిత్రాన్ని రూపొందించారు. బామ్మ పాత్రలో ఎల్లెన్ బర్ట్సిన్, ఆమె కుమారుడు పాత్రలో జారెడ్ లెటో, ప్రియురాలి పాత్రలు జెన్నిఫర్ కాన్నేల్లీ, స్నేహితుడి పాత్రలో మార్లన్ వేయాన్స్ నటించారు. 2000లో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతోపాటు మంచి కలెక్షన్లను రాబట్టింది.
స్కార్ఫేస్
1980లో క్యూబన్ శరణార్థి టోనీ మోంటానా మియామి నగరంలో జీవిస్తుంటాడు. చేయడానికి ఏ పనిలేకపోవడంతో చిన్నగా డ్రగ్స్ వ్యాపారం ప్రారంభిస్తాడు. అట్నుంచి శక్తివంతమైన డ్రగ్స్ వ్యాపారిగా, డ్రగ్స్ సామ్రాజ్యానికి రారాజుగా ఎదగడమనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం 'స్కార్ఫేస్'. బ్రియాన్ డి పాల్మా దర్శకత్వంలో రూపొందిన ఈ డ్రగ్స్ నేపథ్య చిత్రం 1983లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది.
25 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 70 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇందులో టోనీ పాత్రలో అల్ పాసినో నటన మెస్మరైజ్ చేస్తుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో హింస, ఇందులో వాడిన లాంగ్వేజ్ తదితర విషయాల్లో పలు విమర్శలెదుర్కొంది.
గుడ్ ఫెల్లాస్
చిన్న చిన్న దొంగతనాలు, నేరాలు చేసే హెన్రీ హిల్స్‌కి ఇద్దరు స్నేహితులు తోడవుతారు. ముగ్గురు కలిసి ఎంతో కష్టపడి డ్రగ్స్ డీలర్లుగా, గ్యాంగ్‌స్టర్స్‌గా ఎదుగుతారు. హెన్రీకి వస్తున్న పేరు ప్రఖ్యాతులను ఓర్వలేని పరిస్థితుల్లో ఈ ముగ్గురు మధ్యే గొడవ జరిగి, వారి నేర సామ్రాజ్యం అస్తవ్యస్థంగా మారుతుంది. ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పడిపోవడమనే ఇతివృత్తంతో దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ రూపొందించిన ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రం 1990లో విడుదలైంది. గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రానికి సంబంధించి ఉత్తమ సహాయ నటుడిగా జో పెస్కీ ఆస్కార్ దక్కించుకున్నాడు. ఇతర ప్రధాన పాత్రల్లో రాబర్ట్ డి నీరో, రే లియోట్టా, జో పెస్కీ నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
ట్రాఫిక్
ఈ చిత్రం డ్రగ్స్ వ్యాపారం గురించి చర్చించింది. డ్రగ్స్‌ను తీసుకునేవారు, డ్రగ్స్‌ను అమ్మేవారు, ఈ విషయంలో రాజకీయ నాయకుల పాత్ర, అక్రమ రవాణా వంటి అంశాలను ఆయా రంగాల వారి కోణంలో చూపించడం జరిగింది. ఈ రంగాలకు చెందిన వారి మధ్య ఉన్న సంబంధాలపై ఈ చిత్రం ఫోకస్ చేసింది. ఈ డ్రగ్స్ నేపథ్య చిత్రాన్ని స్టీవెన్ సోడెన్బర్గ్ రూపొందించారు. 2000లో విడుదలైన ఈ చిత్రం క్రిటికల్‌గానూ, కమర్షియల్గానూ విశేష ఆదరణ పొందింది. 48 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 207 మిలియన్ డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది.
Authorization