సూపర్ హీరో చిత్రాలు, యుద్ధ నేపథ్య చిత్రాలు, ప్రేమ కథలు, కామెడీ ఫిల్మ్స్, అడ్వెంచరస్, క్రైమ్ థ్రిల్లర్, హర్రర్ చిత్రాలు.. ఇలా విభిన్న కథా చిత్రాలను ఇప్పటి వరకు చూశాం. ఈ కోవలో చిన్న పిల్లల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందాయి. సున్నితమైన భావోద్వేగాలు, తల్లిదండ్రులతో తమకున్న అనుబంధాలు, చిన్నతనంలోనే ప్రేమలు, మానసిక సంఘర్షణలు, చిల్లరి పనులు.. ఇలా కథాంశం ఏదైనా ఇందులో హీరోలు మాత్రం పిల్లలే. అలాంటి పిల్లల నేపథ్యంలో వచ్చిన చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'..
చిల్డ్రన్ ఆఫ్ హెవెన్
చెల్లి కోసం కొన్న కొత్త చెప్పులను పోగొడతాడు అన్న. చెత్తను కలెక్ట్ చేసే వ్యక్తి వాటిని తీసుకెళతాడు. చెప్పులు పోయిన విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అన్నా, చెల్లెలు ఎలా మ్యానేజ్ చేశారు. స్కూల్‌కి వెళ్లేటప్పుడు వాళ్ళు ఎలాంటి సాహసం చేశారు. చివరికి కొత్త చెప్పులను ఎలా సాధించారనేది ఈ సినిమా కథాంశం. పిల్లల ప్రధానంగా సాగే ఈ ఇరానియన్ ఫ్యామిలీ చిత్రాన్ని దర్శకుడు మజిద్ మజిదీ రూపొందించారు. 1997లో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలతోపాటు కలెక్షన్ల పరంగానూ సత్తాచాటింది. అయితే ఈ చిత్రం ఒక సాధారణ పేద కుటుంబం పరిస్థితిని ప్రతిబింబించింది. అన్న పాత్రలో అమిర్ ఫార్రోఖ్ హెషిమియన్, చెల్లి పాత్రలో బహరే సిద్ధీఖిల నటన అబ్బురపరుస్తుంది. మనసు పొరల్ని కదిలిస్తుంది. ఈ సినిమా విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్‌కు నామినేటైంది.
ది కలర్ ఆఫ్ ప్యారడైజ్
ఈ చిత్ర కథ అంధుడైన బాలుడు మహ్మద్ చుట్టూ తిరుగుతుంది. మహ్మద్‌కు అమ్మ లేదు. నాన్న, ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. భార్య లేకపోవడంతో మహ్మద్ తండ్రి మరో మహిళను పెళ్ళి చేసుకునేందుకు సన్నద్ధమవుతుంటాడు. తనకు బ్లైండ్ కొడుకు ఉండనే విషయాన్ని తను పెళ్ళి చేసుకోబోయే మహిళ వద్ద దాచిపెడతాడు. స్పెషల్ స్కూల్లో చదువుకుంటున్న మహ్మద్ వేసవి సెలవుల నిమిత్తం ఇంటికి వస్తాడు. ఇంట్లో ఆ బాలుడు ఉండటం వల్ల కాబోయే భార్య తనను తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని తండ్రి ఇబ్బందిగా ఫీలవుతుంటాడు. దీంతో ఓ వైపు ఆ బాలుడు, మరో వైపు ఆ తండ్రి ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. 1999లో విడుదలైన ఈ ఇరానియన్ సినిమాను దర్శకుడు మజిద్ మజిదీ రూపొందించారు. బ్లైండ్ బాలుడి పాత్రలో మోహ్సెన్ రమేజాని, తండ్రి పాత్రలో నటించిన హోస్సీన్ మహ్జౌబ్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ద కిడ్
అనాధ బాలుడిని పెంచే క్రమంలో ట్రంప్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. దుర్భర పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఏం చేశారనే ఇతివృత్తంతో 1921లో చార్లీ చాప్లిన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పూర్తి స్థాయి తొలి సైలెంట్ కామెడీ డ్రామా చిత్రమిది. ఈ చిత్రానికి చాప్లిన్ సంగీతం కూడా సమకూర్చారు. బాలుడు ముందుగా రాళ్ళతో ఇతరుల ఇండ్ల కిటికీలను పగుల గొడుతుండగా, వాటిని బాగు చేసే పనిలో ట్రంప్ ఉంటాడు. ఆ టైమ్‌లో బాలుడికి, ట్రంప్‌కి మధ్య చోటు చేసుకుని సన్నివేశాలు హాస్యభరితంగా సాగుతాయి. అదే సమయంలో ఆనాటి సామాజిక పరిస్థితులు, ఒక అమాయకుడి జీవనశైలి, విషాధ సన్నివేశాలు ఆలోచింప చేస్తాయి, కంటతడి పెట్టిస్తాయి. ఇందులో ట్రంప్ పాత్రలో చాప్లిన్, బాలుడి పాత్రలో జాకీ కూగన్ నటించారు. చాప్లిన్ తన బాల్య జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది సాంస్కృతికంగా, చరిత్ర పరంగా విశిష్టమైన చిత్రంగా అభివర్ణిస్తూ అమెరికా కాంగ్రెస్ లైబ్రరీలో రిజిస్టర్ చేయబడింది. మూకీ చిత్రాల్లో ఒక గొప్ప చిత్రంగా నిలిచింది.
ఈ.టి.. ది ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్
ఎలైట్ అనే కుర్రాడు ఒంటరితనాన్ని ఫీలవుతుంటాడు. అతనికి ఒక గ్రహాంతర వాసి స్నేహితుడవుతాడు. అతని సహాయంతో పైకి వెళ్లాలని భావిస్తారు. గ్రహాంతర వాసి గురించి తన అమ్మకుగానీ, ప్రభుత్వానికిగాని తెలియకుండా దాచిపెడతాడు. ఈ క్రమంలో ఓ సారి గ్రహాంతర వాసికి, ఎలైట్కి కొన్ని క్లిష్టపరిస్థితులు ఎదురవుతాయి. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర, భయానక సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రాన్ని స్టీవెన్ స్పెల్బర్గ్ రూపొందించారు. 1982లో విడుదలైన ఈ పిల్లల చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అమెరికన్ లైబ్రరీలోనూ భద్రపర్చబడింది. 11మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 793 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. నాలుగు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.
హ్యూగో
1930 పారిస్‌లో ఒక అనాధ కుర్రాడు రైల్వే స్టేషన్లో నివసిస్తుంటాడు. అక్కడ అతను చనిపోయిన తన తండ్రికి, రోబోకు సంబంధించిన ఒక మిస్టరీని కనిపెట్టే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న సాహసభరిత సన్నివేశాల సమాహారమే 'హ్యూగో' చిత్రం. ప్రతి సన్నివేశం ఒక సాహసోపేతంగా సాగే ఈ చిత్రంలో ఫొటోగ్రఫీ కనువిందు చేస్తుంది. మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో రూపొందిన ఈ పారిస్ చిత్రం 2011లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొంది, కలెక్షన్లలోనూ సత్తా చాటింది. 11 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేటై ఐదు ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఇందులో అనాధ కుర్రాడు పాత్రలో ఆసా బటర్ఫీల్డ్ నటన మెప్పిస్తుంది.
వేర్ ఈజ్ ది ఫ్రెండ్స్ హోమ్?
ఎనిమిదేండ్ల వయసున్న విద్యార్థి అహ్మాద్ బై మిస్టేక్‌లో తన స్నేహితుడు నోట్ పుస్తకాన్ని తీసుకుంటాడు. ఆ పుస్తకాన్ని కచ్చితంగా అతనికివ్వాలి. లేదంటే స్కూల్లో తనను బహిష్కరించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తన ఫ్రెండ్స్ ఇంటిని వెతుకుంటూ వెళ్ళిన అహ్మద్‌కు చోటు చేసుకున్న పరిణామాలేంటి ? అనేదే 'వేర్ ఈజ్ ది ఫ్రెండ్స్ హోమ్?' చిత్ర కథ. అబ్బాస్ కిరరోస్టామి దర్శకత్వంలో రూపొందిన ఈ ఇరానియన్ చిత్రం 1987లో విడుదలై విశేష ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలందుకుంది.
హోమ్ ఎలోన్
ఫ్యామిలీ అంతా క్రిస్మస్ వేడుకల కోసం రెడీ అవుతారు. ఫ్లైట్ టైమ్ అవుతుండడంతో ఇంట్లో వాళ్లంతా హడావుడిగా ఎయిర్ఫోర్ట్కి బయలు దేరుతారు. కానీ వాళ్ళ 8ఏండ్ల అబ్బాయి కెవిన్‌ను మర్చిపోతారు. అతను ఇళ్లును డెకరేట్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. ఫ్యామిలీ అంతా వెళ్లిపోవడంతో కెల్విన్ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ టైమ్‌లో ఆ ఇంటికి ఇద్దరు దొంగలు వస్తారు. వచ్చిన వాళ్లిద్దరిని కెవిన్ ఎలా ఆడుకున్నాడనేది ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిస్ కొలంబస్ రూపొందించారు. 1990లో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. కేవలం 18 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 477 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. పలు అవార్డులనూ అందుకుంది. ముఖ్యంగా కుర్రాడు కెవిన్ పాత్రలో నటించిన మెక్ కాలే కుల్కిన్ నటన కడుపుబ్బా నవ్విస్తుంది.
సన్ ఆఫ్ రాంబో
ఇద్దరు విభిన్న నేపథ్యానికి చెందిన స్కూల్ బార్సు అనుకోకుండా ఓ రోజు 'ఫస్ట్ బ్లడ్' అనే సినిమాను చూస్తారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ సినిమాను తీసేందుకు ప్లాన్ చేస్తారు. ఆ సినిమాలో ప్రేమ, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ ఇలా అన్ని అంశాలుంటాయి. మరి వాళ్లిద్దరు సినిమాను ఎలా తీశారు. సినిమా తీసే క్రమంలో చోటు చేసుకున్న కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'సన్ ఆఫ్ రాంబో'. ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రానికి గార్త్ జెన్నింగ్స్ దర్శకత్వం వహించారు. 2007లో విడుదలైన మల్టీలింగ్వల్ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ఇద్దరు కుర్రాళ్ళ పాత్రల్లో బిల్ మిల్నేర్, విల్ పౌల్టర్ల నటన ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సత్తా చాటింది.
జుమాంజి
జుమాంజి అనేది ఒక మ్యాజికల్ గేమ్. ఇద్దరు పిల్లలు ఓ పురాతన గదిలో ఈ మ్యాజికల్ బోర్డ్‌ను కనిపెడతారు. ఆ గేమ్ ఆడేందుకు ప్రయత్నించగా ఆ కుర్రాడు ఆటలో భాగంగా మాయమైపోతాడు. మ్యాజికల్ బోర్డ్‌లో జరిగేదంతా బయట కూడా జరుగుతుంది. ఆడే వారు దాని ప్రభావానికి లోనవుతారు. ఆట మూగిసిన తర్వాతే మళ్ళీ వాళ్ళంతా యదార్థ స్థితికి చేరుకుంటారు. ఆటలో భాగంగా చోటు చేసుకున్న ఆసక్తికర, భయానక, విధ్వంసకర సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. జో జాన్స్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ చిత్రం 1995లో విడుదలై ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ సాధించింది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మాయాజాలంతో సాగే ఈ చిత్రం కనువిందు చేసింది. 65మిలియన్ డాలర్లతో తెరకెక్కి 262 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ చిల్డ్రన్ చిత్రంలో రాబిన్ విలియమ్స్, కిర్సన్ దంట్, డేవిడ్ అలన్ గ్రీర్, బోనీ హంట్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
ది వైట్ బాల్రూమ్
ఒక పాపకి షాప్‌లో ఉన్న గోల్డ్‌ఫిష్ బాగా నచ్చింది. ఎలాగైనా దాన్ని కొని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటుంది. ఎట్టకేలకు వాళ్ళ అమ్మను కన్విన్స్ చేసి దానికి అయ్యే డబ్బును తీసుకుంటుంది. తీరా ఆ స్టోర్ వద్దకు వెళ్లే సరికి ఆ పాప చేతులోనుంచి నోటు జాలివేసిన గుంతలో పడిపోతుంది. ఆ నోట్‌ను తీసేందుకు ఎంతో మంది పిల్లలు శ్రమిస్తారు. మరి నోటును పైకి తీసుకోగలిగారా? గోల్డ్ ఫిష్ కొనాలన్న ఆ పాప కోరిక నెరవేరిందా ? అన్నది సినిమా. దర్శకుడు జాఫర్ పనాహి రూపొందించిన ఈ ఇరానియన్ చిత్రం 1995లో విడుదలై ఆకట్టుకుంది. ఆస్కార్‌కు సైతం నామినేట్ అయ్యింది. ఈ చిత్రంలో ఐద మహ్మద్కాని, మొహ్సెన్ కాఫఙలి, ఫెరేతే సాద్ తదితరులు నటించి అలరించారు.
లిటిల్ మ్యాన్‌హట్టన్..
పదేండ్ల కుర్రాడు గేబ్, 11ఏండ్ల అమ్మాయి రోస్మేరీని ఓ గార్డెన్లో కలుస్తాడు. తొలిచూపులోనే వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు. దీంతో వీరిలో తెలియని ఆందోళన, టెన్షన్, కొత్త ఫీలింగ్. వీరికి ప్రపంచం అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అదే సమయంలో సందిగ్దత నెలకొంటుంది. మొత్తానికి ఒకరినొకరు కలుసుకుంటారు. ప్రేమికులుగా తమ లైఫ్‌ను ఎంజారు చేస్తారు. కానీ లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతుంటుంది. ఆ మార్పు ఏంటి? చివరికి ప్రేమలోని మధురమైన జ్ఞాపకాలే ఎలా మిగిలాయనేది సినిమా. చిల్డ్రన్ ప్రేమను తెలిపే ఈ చిత్రాన్ని దర్శకుడు మార్క్ లెవిన్ రూపొందించారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం 2005లో విడుదలై విమర్శకుల ప్రశంసలతోపాటు కలెక్షన్లలోనూ సత్తా చాటింది. ఇందులో గేబ్ పాత్రలో జోష్ హట్చెర్సన్, రోస్‌మేరీ పాత్రలో చార్లీ రేల నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
వీటితోపాటు 'మిలియన్స్', 'ది నెవర్ ఎండింగ్ స్టోరీ', 'ఎ లిటిల్ ప్రిన్సెస్' వంటి చిత్రాలు పిల్లల ప్రధానంగా వచ్చి అలరించాయి.
Authorization