యాక్షన్ సినిమాలను అమితంగా ఇష్టపడే సినీ ప్రేమికులకు ఈ ఏడాది మొత్తం ఓ పండుగనే చెప్పాలి. గత 7 నెలల కాలంలో ఎన్నోయాక్షన్ చిత్రాలు విడుదలై వసూళ్ల సునామీతో వరల్డ్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ప్రేక్షకుల అపూర్వ ఆదరణ పొంది ఈ ఏడాది హల్చల్ చేసిన కొన్ని యాక్షన్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'...
డన్కిర్క్
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఫ్రెంచ్ పట్టణం డన్కిర్క్ సముద్ర తీరాన్ని నాజీ జర్మన్ సైన్యం ఆక్రమిస్తుంది. వీరి నుంచి తప్పించుకోవడానికి బ్రిటీష్, దాని మిత్ర రాజ్యాల సైన్యం ఎలాంటి పోరాటం చేశారు?, తొమ్మిది రోజులపాటు జరిగిన భీకరయుద్ధం అనంతరం యుద్ధం కంటే ప్రాణం ముఖ్యమని బ్రిటీష్ సైన్యం సముద్రం గుండా పారిపోవాల్సి వస్తుంది. యుద్ధం చేసినా చనిపోతారు, సముద్రంలోకి వెళ్ళినా చనిపోతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటీష్ సైన్యం ప్రాణాలతో బయటపడేందుకు చేసే పోరాటమే ఈ చిత్రం ఇతివృత్తం. 1940లో చోటు చేసుకున్న యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించారు. ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. అదే సమయంలో కొన్ని వాస్తవాలను ఈ చిత్రం వక్రీకరించిందనే విమర్శలూ ఎదుర్కొంది. ముఖ్యంగా మన భారతీయ సైనికులు కూడా ఈ యుద్ధంలో పాల్గొని, ప్రాణాలతో బయటపడ్డారని చరిత్ర చెబుతోంది. అయితే ఈ విషయాన్ని దర్శకుడు విస్మరించారని అందరూ విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ జులై 21న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అంతేకాదు 100 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 280 మిలియన్ డాలర్లను వసూలు చేయటం విశేషం.
త్రిఫులెక్స్: రిటర్న్స్ ఆఫ్ గ్జెండర్ కేజ్..
త్రిబులెక్స్ సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడవ చిత్రమిది. ప్రత్యర్థి వర్గం నుంచి ప్రపంచాన్ని కాపాడటమే అంతిమంగా ఈ చిత్రాల ఇతివృత్తం.
చిన్న చిన్న దొంగతనాలు, స్మగ్లింగ్ చేసే ఒక గ్యాంగ్‌ను పట్టుకునేందుకు సిఐఏ బలగాలు ప్రయత్నాలు చేస్తాయి. వారితో జరిగిన పోరాటంలో సిఐఏ ఏజెంట్ గ్జెండర్ చనిపోయినట్టుగా ప్రభుత్వం నమ్మిస్తుంది. కానీ రహస్యంగా గ్జెండర్ను తిరిగి అపరేషన్‌కు పంపిస్తుంది. అదే సమయంలో ప్రత్యర్థి వర్గం ప్రపంచంపై దాడికి తెగబడతారు. దీంతో చిన్న చిన్న స్మగ్లింగ్స్ చేసే టీమ్‌తో కలిసి సిఐఏ బృందం ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా. డిజే కరుసో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరిలో విడుదలై విమర్శకులను మెప్పించలేకపోయినప్పటికీ కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించుకుంది. 85మిలియన్ డాలర్లతో తెరకెక్కి 346మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నటించడం విశేషం.
ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్..
కార్ల రేస్ ప్రధానంగా సాగే చిత్రమిది. 'ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్' సిరీస్‌లో భాగంగా వచ్చిన 8వ చిత్రం. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో అక్రమంగా జరుగుతున్న రేసింగ్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ప్రధాన రేసరైన డామినిక్ టోరెట్టో, అతని భార్య లెట్టీ హానీమూన్ టిప్పులో ఉంటారు. వీరి గ్యాంగ్‌కు వ్యతిరేకంగా మరో ముఠా రేసింగ్‌లో పాల్గొంటారు. దీంతో డామినిక్ మళ్లీ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర యాక్షన్ సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. ఎఫ్ గారీ గ్రే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. 250 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 1.240 బిలియన్ డాలర్లను వసూలు చేసింది.
జాన్ విక్: చాప్టర్ 2
అనుకోని పరిస్థితుల్లో బలవంతంగా తన వృత్తి నుంచి నిష్క్రమించిన పేరు మోసిన హంతకుడు జాన్ విక్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన కిల్లర్స్‌కు వ్యతిరేకంగా, వారిని కంట్రోల్ చేసేందుకు పనిచేయాల్సి వస్తుంది. మరి వారిని జాన్ విక్ ఎలా ఎదుర్కొన్నాడనే ఇతివృత్తంతో రూపొందిన యాక్షన్ఎంటర్టైనర్ చిత్రమిది. చాద్ స్టాహెల్కీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఆకట్టుకుంటుంది. ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగే ఈ చిత్రం 40 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 171 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
కాంగ్: స్కుల్ ఐలాండ్
వియత్నం యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్తున్న సైనికులు, వారితోపాటు ఉన్న సైంటిస్టులు పసిఫిక్ మహాసముద్రం పై నుంచి హెలికాప్టర్స్‌లో ప్రయాణిస్తున్న క్రమంలో సముద్రంలోని ఒక దీవిలో భారీ ఆకారంలో ఉన్న కాంగ్తోపాటు పలు భయానక జంతువులు వీరిపై దాడి చేస్తాయి. దీంతో ఆ కాంగ్‌ను, భయానక జంతువులను సైనికులు ఎలా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న అత్యంత భీకరమైన పోరాటమే ఈ చిత్రం. విజువల్ వండర్‌గా నిలిచే ఈ చిత్రం కింగ్ కాంగ్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రాన్ని జోర్డాన్ వోగ్ట్ రాబర్ట్స్ రూపొందించారు. 185 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 566మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
గోస్ట్ ఇన్ ది షెల్
సూపర్ సోల్జర్‌గా మారిన ఓ లేడీ.. మనుషులపై దాడి చేయబోతున్న రోబోలను ఎలా నిలువరించింది?, వాటి బారి నుంచి మనుషులను కాపాడేందుకు ఆ లేడీ సూపర్ సోల్జర్ చేసే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. రూపర్డ్ స్టాండర్డ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలైన విశేష ప్రేక్షకాదరణ పొందింది. విజువల్గానూ, సైంటిఫికల్గానూ అడ్వాన్డ్స్ చిత్రంగా నిలిచింది. లేడీ సూపర్ సోల్జర్ పాత్రలో స్కార్లెట్ జాన్సన్ అత్యద్భుతంగా నటించింది.
ది మమ్మీ
ఆర్మీ సైనికులు ప్రయాణిస్తున్న విమానం కొన్ని భయానక రాక్షస పక్షుల దాడి వల్ల నేలపై కూలిపోతుంది. వెయ్యి సంవత్సరాలకుపైగా మమ్మీ శవపేటికలో దాచబడిన ఓ రాక్షస లేడీ.. విమానం కూలి పోవడంతో దాన్నుంచి బయటికొచ్చి ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తుంటుంది. దీంతో ఆర్మీ అధికారులు, ఆర్కియాలజిస్ట్‌లు కలిసి ఆ మమ్మీని ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా. 'మమ్మీ' ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన 14వ చిత్రమిది. అలెక్స్ కుర్ట్జ్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌లో విడుదలైంది.125 మిలియన్ డాలర్లతో తెరకెక్కి సుమారు 400 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ : డెడ్ మెన్ నో టేల్స్ టెల్
సముద్రపు దొంగల ప్రధానంగా సాగే చిత్రమిది. 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' చిత్ర సిరీస్‌లో భాగంగా రూపొందిన 5వ చిత్రమిది. సముద్ర గర్భంలో ఉన్న త్రిశూలాన్ని వెతకడం కోసం జాక్ స్పారో బృందం భారీ ఓడలతో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో పాత శత్రువు దెయ్యం రూపంలో ఈ బృందంపై దాడి చేసేందుకు వస్తుంటారు. జాక్ బృందం కంటే చాలా శక్తివంతమైన, భయానకమైన రాక్షసులు కావడంతో వారితో పోరాడేందుకు భయపడ్డప్పటికీ ఓ శక్తి వల్ల వారిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ చిత్రం ఇతివృత్తం. ఈ ఏడాది మేలో విడుదలై ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. జోచిం రెన్నింగ్, ఎస్పెన్ సాండ్బర్డ్ దర్శకత్వంలో 230 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 776మిలియన్ డాలర్లను వసూలు చేసింది. విజువల్‌గా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది.
లోగన్
'ఎక్స్‌మెన్' సిరీస్‌లో భాగంగా వచ్చిన 10వ చిత్రమిది. లోగన్ సూపర్ హీరో శక్తి కలిగి ఉంటాడు. శత్రు సైన్యంతో భీకరంగా పోరాడిన అనంతరం తన ప్రొఫెసర్ ఎక్స్‌కు తీవ్ర అస్వస్థత కావడంతో కొన్ని రోజులపాటు ప్రపంచానికి దూరంగా జీవితాన్ని గడుపుతుంటాడు. చాలా రోజుల తర్వాత లోగన్‌ను పట్టుకోవడానికి డార్క్ ఫోర్స్ బృందం వస్తుంది. వారిని ఎదుర్కొనేందుకు తిరిగి లోగన్ సూపర్ హీరోగా ఎలా మారాడన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. జేమ్స్ మంగోల్డ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 97మిలియన్ డాలర్లతో తెరకెక్కి 616 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆద్యంతం భీకరంగా సాగే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
ఏలియన్: కోవినంట్
కొంతమంది పరిశోధన సిబ్బంది కాలనీ షిప్లో అంతరిక్షంలో ప్రయాణించి ఓ కొత్త గ్రహాన్ని (అపరిచిత స్వర్గం) కనిపెడతారు. ఆ గ్రహంపై దిగి అక్కడి వాతావరణాన్ని గమనించే క్రమంలో కొన్ని విచిత్రమైన ఆకారంలో ఉన్న మృగాలు ఈ సిబ్బిందిపై దాడి చేసి చంపేస్తుంటాయి. దీంతో వాటిని ఈ బృందం ఎలా ఎదుర్కొంది?, వాటి నుంచి ఎలా బయటపడిందనేది సినిమా. అత్యంత భయానక సన్నివేశాలతో సాగే ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది. రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ హర్రర్ యాక్షన్ చిత్రం 97మిలియన్ డాలర్లతో తెరకెక్కి 232 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇందులో మైఖేల్ ఫాస్బెండర్, కేథరీన్ వాటర్స్టన్, బిల్లీక్రూడన్, డానీ మెక్బ్రిడ్లు నటించి మెప్పించారు.
విజువల్గానూ ఈ చిత్రం కనువిందు చేస్తుంది.
Authorization