అకిరా కురోసావా..
వెండితెరపై అద్భుత కళాఖండాలను సృష్టించిన దిగ్దర్శకుడు. రైతు సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ, యుద్ధనేపథ్యంలో రాజనీతి, మధ్యతరగతి కుటుంబాల స్థితి గతులు, మానవీయ విలువలు.. ఇలా ప్రతి కోణాన్ని తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించిన ఘనుడు. కథ, కథనం, అద్భుతమైన పెయింటింగ్స్‌లా మైమరపించే విజువల్స్‌తో జపాన్ ప్రజల బతుకు చిత్రాన్ని అత్యంత హృద్యంగా తెరకెక్కించిన మార్గదర్శి. నాటి, నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిన అకిరా కురోసావా వర్థంతి (ఈనెల 6వ తేదీ, బుధవారం) సందర్భంగా అందిస్తున్న స్పెషల్ 'షో'...
అతలాకుతలం చేసిన భూకంపం..
అకిరా కురోసావా టోక్యో దేశంలో ఓమోరి జిల్లాలోని సంపన్న కుటుంబంలో ఇసాము, షీమా దంపతులకు 1910 మార్చి 23న జన్మించారు. తండ్రి ఇసాము ఆర్మీ ఫిజికల్ ఎడ్యూకేషన్ ఇనిస్టిట్యూట్‌లో లోయర్ సెకండరీ స్కూల్‌కి డైరెక్టర్. ఎనిమిది మంది సంతానంలో చిన్నవాడైన అకిరాపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఫిజికల్ ట్రైనింగ్‌లో మంచి పట్టు సాధించారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు చిన్నప్పట్నుంచే కథలు, బయోగ్రఫీలు, స్క్రీన్‌ప్లేలు చదవడం ప్రారంభించారు. దీంతో పిల్లల ఆసక్తిని గమనించిన తండ్రి ఒక థియేటర్‌ను కట్టించాడు. అందులో విభిన్న సంస్కృతులకు చెందిన సినిమాలను చూపించే వారు. అలా చిన్నప్పట్నుంచే కురోసావా జీవితంలో సినిమా మమేకమైంది. 13 ఏండ్ల వయసులోనే స్నేహితుడు యుకుసాతో కలిసి 'హ్యుమనిస్ట్ క్రైబేబీ' నవల రాశారు. ఆ టైమ్‌లో టోక్యోలో వచ్చిన భూకంపంతో కురోసావా ఉండే ప్రాంతమంతా శవాలు దిబ్బలుగా మారిపోయింది. ఈ సంఘటన కురోసావాను చలింపచేసింది. ఈ ప్రభావమే కురోసావా సినిమాలు తీయడానికి, ఆర్టిస్టుగా మారడానికి దోహదపడ్డాయట. భూకంపం కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి థియేటర్లలో, సర్కస్‌లో నటుడిగా, ఎగ్జిబిషన్లో పెయింటర్‌గా.. ఇలా దొరికిన పనల్లా చేస్తూ డబ్బు సంపాదిస్తున్న తరుణంలో పెద్ద అన్నయ్య ఆత్మహత్య, ఆ తర్వాత నాలుగు నెలల్లో మరో అన్నయ్య అనారోగ్య మరణం అకిరాను మానసికంగా కృంగతీశాయి.
దర్శకుడిగా పరిచయం..
1936లో మినియో నరుసె, ఎసుకె టాకిజావా, షిగియో యాగురా, ఒసాము ఫ్యుషిమిజు వంటి సీనియర్ దర్శకుల వద్ద పనిచేసి దర్శకత్వంపై అవగాహన పెంచుకున్నారు. అకిరా ప్రతిభ చూసిన కజిరో యామమోటో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టుకుని అకిరా ప్రతిభకు మెరుగులు దిద్దారు. ఆయన వద్ద 17 సినిమాలకు పనిచేసి కథను అభివృద్ధి చేయడం, కథకు తగ్గట్టుగా లొకేషన్లు ఎంచుకోవడం, లైటింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, కెమెరా ఇలా అన్ని విభాగాలపై పట్టు సాధించారు. అదే సమయంలో 'హోర్స్' చిత్రాన్ని నిర్మించి నిర్మాతగానూ అకిరా అభిరుచి చాటుకున్నారు. ఈ సినిమా సాధించిన సంచలన విజయం తర్వాత స్వతహాగా కథలు రాసుకోవడం ప్రారంభించారు. స్కీన్‌ప్లే రైటర్‌గానూ డబ్బులు సంపాదించవచ్చనే విషయం తెలుసుకున్న అకిరా దర్శకుడిగానూ నిరూపించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. రచయిత సునియో టోమిట రాసిన జుడో నవల 'సాంషిరో సుగట' హక్కులు తీసుకుని అదే పేరుతో దర్శకుడిగా తొలి చిత్రం ప్రారంభించారు. 1943 మార్చి 25న విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయంతోపాటు విమర్శకుల ప్రశంసలందుకున్నారు. మహిళా ప్రధానంగా 'ది మోస్ట్ బ్యూటిఫుల్' అనే డాక్యుమెంటరీని తీశారు. 'సాంషిరో సుగట'కు సీక్వెల్‌గా 'సాంషిరో సుగట 2' కాస్త భిన్నంగా, ప్రయోగాత్మకంగా తీశారు. ఆ తర్వాత తెరకెక్కించిన 'ది మెన్ హు ట్రీడ్ ఆన్ ది టైగర్స్ టెయిల్' చిత్రం భూస్వామ్య వ్యవస్థపై విమర్శనాత్మకంగా, తమను తక్కువ చేసి చూపినట్టుగా ఉందని అమెరికా సెన్సార్ అధికారులు సినిమా విడుదలను నిలిపివేశారు.
విభిన్న చిత్రాలపై అకిరా దృష్టి..
మహిళా ప్రధానంగా 'ది మోస్ట్ బ్యూటిఫుల్' అనే డాక్యుమెంటరీని రూపొందించేటప్పుడు మహిళ వర్కర్లకు అధ్యక్షురాలైన యోకో యాగుచితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 1945 మే 21న పెళ్ళి చేసుకున్నారు. వీరికి కొడుకు హిసాహో, కూతురు కజుకో ఉన్నారు. 1933లో టాకిగావా భూకంపం సంఘటన నేపథ్యంలో తీసిన 'నో రిగ్రేట్ ఫర్ అవర్ యూత్' చిత్రం మార్క్సిస్ట్టు భావజాలాన్ని విస్తరింపచేసేదిగా ఉందని జపాన్ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో కాన్సెప్ట్‌లను పక్కన పెట్టి ప్రేమ కథ నేపథ్యంతో 'ఫోర్ లవ్ స్టోరీస్' (కథ అందించారు) 'డ్రంకెన్ ఎంజెల్', 'ది క్వైట్ డుయల్', 'స్ట్రే డాగ్', స్కాండల్' వంటి చిత్రాలను రూపొందించారు. 1950లో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన 'ఇన్ ఎ గ్రోవ్' చిత్రం మంచి ఆదరణ పొందింది. దీంతో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు
1950లో విడుదలైన 'రాషోమోన్' సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లలోనూ సత్తా చాటింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో 'బ్లూ రిబ్బన్' అవార్డును సొంతం చేసుకుంది. అలాగే 'వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో' మొదటి జపాన్ సినిమాగా ప్రదర్శితమై 'గోల్డెన్ లయన్' అవార్డును దక్కించుకోగా, ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకుంది. తర్వాత 'ఐకిరు' చిత్రం సైతం సూపర్ హిట్‌గా నిలవడంతోపాటు ఉత్తమ చిత్రంగా కినెమా జాంపో అవార్డు, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమైన ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. ఆ సమయంలోనే అకిరా తల్లి షీము అనారోగ్య కారణంగా మరణించారు. దీంతో కొన్ని రోజులు మానసికంగా ఇబ్బంది పడినా ఆ తర్వాత 'సెవెన్ సమురారు' అనే మరో శక్తివంతమైన సినిమాకు రూపకల్పన చేశారు. ఇది అప్పట్లో ఓ సంచలనం. 'సెవెన్ సమురారు' తర్వాత అకిరా జపాన్‌లో అణుబాంబు దాడి నేపథ్యంతో తెరకెక్కించిన 'రికార్డ్ ఆఫ్ ఎ లివింగ్ బియింగ్', విలియమ్ షేక్స్‌స్పియర్ నవల ఆధారంగా రూపొందించిన 'థ్రోన్ ఆఫ్ బ్లడ్', 'ది క్వైట్ డుయల్ అండ్ స్ట్రే డాగ్',
'ది హిడెన్ ఫెస్ట్రెస్' చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి.
నిర్మాతగా, దర్శకుడిగా సంచలనాలు
మిత్రుల సహకారంతో 1959లో 'కురోసావా ప్రొడక్షన్ కంపెనీ' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా 'ది బ్యాడ్ స్లీప్ వెల్' చిత్రాన్ని నిర్మించారు. జపాన్ రాజకీయాల్లో చోటు చేసుకున్న అవినీతిని ప్రతిబింబించేలా రివేంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కురోసావా చిత్రాల్లో ఇదొక మాస్టర్ పీస్‌గా నిలిచింది. ఆ తర్వాత ఏడాది పాటు యుఎస్ఏతో సహా పలు దేశాల్లో తిరిగి అక్కడి సినిమా స్థితిగతులు, సినిమాలను ప్రమోషన్ చేసుకోవడానికి అనువైన మార్గాలను వెతికారు. అంతేకాదు 'సెవెన్ సమురారు' చిత్రాన్ని అమెరికాలోకి రీమేక్ చేశారు. తర్వాత 'యోజింబో' అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా హిట్ కావడంతోపాటు భారీ కలెక్షన్లు రాబట్టి ఆర్థికంగా పుంజుకునేలా చేసింది. తన రెగ్యులర్ రైటర్స్ కికుషిమా, హిడియో, ఈజిరోతో కలిసి 'హై అండ్ లో' అనే చిత్రాన్ని రూపొందించారు. 1963లో విడుదలైన ఈ చిత్రం జపాన్ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర విజయంతో వెంటనే 'రెడ్ బీయర్డ్' అనే చిత్రాన్ని 'ఫ్యోడర్ డోస్టోయివిస్కీ' అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం జపాన్ సినీ చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఈ చిత్రంతో అకిరా సినీ వర్గాలకు మార్గదర్శిగా నిలిచారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం
హాలీవుడ్ నిర్మాతలో తెరకెక్కించాలనుకున్న 'రన్‌వే ట్రైన్', 'తోరా తోరా తోరా' చిత్రాలు కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోవడంతో నిరాశ చెందిన అకిరా మరోసారి తన సొంత బ్యానర్లోనే సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యారు. 1970లో మొదటి సారి 'డుదెసుకాడెన్' చిత్రాన్ని కలర్లో తీశారు. ఇది రష్యాలోని మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ జపాన్‌లో విడుదలై తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో భారీ నష్టాలు రావడంతో అకిరా మానసికంగా కృంగిపోయారు. తిరిగి టోక్యోలోని తన ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశారు.
అకిరా ఈజ్ కమ్ బ్యాక్
ఆత్మహత్య ప్రయత్నాల నుంచి తిరిగి కోలుకుని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. 1975లో తెరకెక్కించిన 'దెర్సు ఉజాల' చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. తర్వాత గతంలో తనతో పనిచేసిన అమెరికాకు చెందిన యువ దర్శకులు మార్టిన్ స్కోర్సెస్, స్టీవెన్ స్పెల్బర్గ్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోప్పోల, జార్గ్ లుకస్ల సహకారంతో 1977లో 'స్టార్ వార్స్' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదలై దాదాపు 200మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అనంతరం 'కగెముషా' చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేసి భారీ విజయాన్ని సాధించింది. కేన్స్‌లో ప్రదర్శితమై 'గోల్డెన్ ఫామ్' అవార్డుతోపాటు పలు ఇతర పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ చిత్ర విజయంతో అకిరా కెరీర్ కొత్త శోభ సంతరించుకుంది. ఈ ఉత్సాహంతో విలియమ్ షేక్స్పియర్ రాసిన 'కింగ్ లయర్' నవల ఆధారంగా 'రాన్' చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆర్థిక కారణాల వల్ల 1983లో ప్రారంభమైన ఈ చిత్రం పలు మార్లు వాయిదా పడుతూ 1985లో విడుదలై సంచలనం సృష్టించింది. పలు అవార్డులతోపాటు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో కురోసావా ఈజ్ బ్యాక్ అని అందరూ ప్రశంసించారు. తన కలల ప్రాజెక్ట్ 'డ్రీమ్స్' చిత్రం సైతం ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. తర్వాత నాగసాకి అణుబాంబు దాడి నేపథ్యంతో 'రాప్సోడి ఇన్ అగస్ట్' చిత్రాన్ని రూపొందించారు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే వేలమంది జనంతో ఆయన పెద్ద పెద్ద వైడ్షాట్స్ తీసి అబ్బుర పరిచారు. ఆయన చిత్రాల్లోని కొన్ని షాట్స్‌ని ఇప్పటి తరం దర్శకులు రిఫరెన్స్ షాట్స్‌గా వాడటం విశేషం. ముఖ్యంగా యుద్ధనేపథ్యంలోని సన్నివేశాల్ని చిత్రీకరించడంలో అకిర తనకు తానే సాటని నిరూపించుకున్నారు.
చివరి రోజులు..
1995లో 'ది సి ఈజ్ వాచింగ్' చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్న తరుణంలో అనుకోకుండా కింద పడిపోవడంతో వెన్నముక విరిగి వీల్ చైర్‌కే పరిమితమయ్యారు. దీంతో కురోసావా దర్శకత్వం చేస్తాడనే ఆశలు ఆవిరైపోయాయి. చాలా రోజులు ఆసుపత్రిలో ఉన్న ఆయన నెమ్మదిగా కోలుకుని టోక్యోలోని సొంత ఇంట్లో చివరి రోజులు గడిపారు. ఎన్నో అద్భుత కళాఖండాల సృష్టికర్తగా యావత్ సినీ వర్గాలకు ఆరాధ్యుడిగా పేరొందిన అకిరా 1998 సెప్టెంబర్ 6న అందరికీ వీడ్కోలు చెబుతూ తుది శ్వాస విడిచారు. అకిరా చనిపోయిన తర్వాత మధ్యలో ఆపేసిన 'ఆఫ్టర్ ది రైన్' చిత్రాన్ని తకాషి కోయిజుమి దర్శకత్వం వహించి పూర్తి చేశారు. అలాగే కెయి కుమయి 'ది సి ఈజ్ వాచింగ్' చిత్రానికి దర్శకత్వం వహించి రిలీజ్ చేశారు.
జపాన్ ప్రజల బతుకు చిత్రానికి ప్రతిరూపాలు
జపాన్ ప్రజల బతుకు చిత్రానికి తన సినిమాలతో అద్దంపట్టేలా అకిరా కురోసావా ఎన్నో అద్భుతమైన కళాఖండాలను వెండితెరపై ఆవిష్కరించారు. 'సాన్షిరో సుగతా', 'ది మోస్ట్ బ్యూటిఫుల్', 'సాన్షిరో సుగతా పార్ట్ 2', 'ది మెన్ హు ట్రెడ్ ఆన్ ది టైగర్స్ టైల్', 'నో రీగ్రెట్స్ ఫర్ అవర్ యూత్', 'వన్ వండర్ఫుల్ సండే', 'డ్రంకెన్ ఏంజెల్', 'ది క్వైట్ డ్యూయల్', 'స్ట్రే డాగ్', 'స్కాండల్', 'ది ఇడియట్', 'రాషోమాన్', 'సెవెన్ సమురారు', 'ఐ లైవ్ ఇన్ ఫియర్', 'థ్రోన్ ఆఫ్ బ్లడ్', 'ది లోయర్ డెప్త్స్', 'ది హిడెన్ ఫోర్టెస్', 'ది బాడ్ స్లీవ్ వెల్', 'యోజింబో', 'సంజురో', 'హై అండ్ లోవర్', 'రెడ్ బార్డ్', 'దోడెసుకాడెన్', 'దెర్సు ఉజాల', 'కగెముషు', 'రాన్', 'డ్రీమ్స్', 'రాప్సోడి ఇన్ ఆగస్టు' వంటి తదితర చిత్రాలు ప్రపంచ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నాయి.
దిగ్దర్శకుడు సాధించిన ఘనతలు
1940 నుంచి 90 వరకు దాదాపు అర్థ శతాబ్ధ కాలంపాటు జపాన్ సినిమా చరిత్ర దశదిశను మార్చిన ఫిల్మ్ మేకర్‌గా ప్రపంచ వ్యాప్తంగా అకిరా ప్రసిద్ధి చెందారు. నవ చిత్ర దర్శక, నిర్మాతలకు స్ఫూర్తిగానూ నిలిచారు. 'రాషోమాన్' చిత్రానికి అవుట్‌స్టాండింగ్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. అలాగే నేషనల్ బోర్డ్ రివ్యూ పురస్కారమూ ఆయన్ని వరించింది.
ఉత్తమ విదేశీ చిత్రంగా 'దెర్సు ఉజాలా' ఆస్కార్ దక్కించుకుంది. 1965లో ఆస్కార్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆస్కార్ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో అయన్ని సినీ ప్రపంచం సముచితంగా గౌరవించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 'కగెముషు' చిత్రం ప్రదర్శితమై గోల్డెన్ ఫామ్ అవార్డుని కైవసం చేసుకుంది.
ఇక సినిమా తీయడంలో ఆయన సృష్టించిన కొత్త టెక్నిక్స్ అన్నీ, ఇన్నీ కావు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వైడ్ షాట్, లాంగ్ షాట్లతో ఆయన తీసే సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపర్చడం విశేషం. ఆయన తీసే ప్రతి సనివేశంలోనూ ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుంది. ఎడిటింగ్‌లోనూ ఆయనది ప్రత్యేక శైలి. ఆర్ట్, మ్యూజిక్ కంపోజింగ్, ప్రొడక్షన్ డిజైనింగ్, సినిమా నెరేషన్ స్టయిల్ భిన్నంగానే ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్‌లో కొత్త టెక్నీక్స్ కనిపెట్టి వరల్డ్ సినిమాకు దిక్సూచిగా నిలిచారు.
ప్రముఖుల ప్రశంసలు
1952లో 'రాషోమాన్' చిత్రం గురించి విన్నప్పుడు నాలో విద్యుత్ ప్రవహించినట్లనిపించింది. ఆ సినిమాను వెంటవెంటనే మూడు సార్లు చూశా. చూసిన ప్రతి సారీ ఓ అద్భుతంలా అనిపించింది. ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు నన్ను మెస్మరైజ్ చేసింది. సినిమాపై ఆయనకున్న పట్టుకు ఇది నిదర్శనమని చెప్పొచ్చు.
- ప్రముఖ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే
కురోసావా సృష్టించిన పాత్రలు నాకు టీచర్‌గా, రోల్ మోడల్‌గా కనిపించాయి. ఈ ప్రపంచంలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరి కంటే కురోసావా నుంచే నేను ఎక్కువగా నేర్చుకున్నాను.
- నటుడు, దర్శకుడు, నిర్మాత స్టీవెన్ స్పీల్బర్గ్
కురోసావా తీసిన ఒక సినిమా మాత్రమే భిన్నంగా ఉంటుందని చెప్పడం కాదు దాదాపు ఎనిమిది మాస్టర్ పీస్‌లు తీశారు.
- హాలీవుడ్ దర్శకుడు ఫోర్డ్ కొప్పోల
నిజం చెప్పాలంటే సినిమా గురించి నాకింకా పూర్తిగా తెలియదు. అందుకే సినిమాలు తీసే ప్రతిసారి నాకు భయమేస్తుంటుంది. సినిమా సారాంశాన్ని ఇంకా నేను పట్టుకోలేకపోతున్నాను.
కాని సినిమా అనేది ఒక అద్భుతమైన ఆలోచన. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
బహుశా ఒక సినిమాను పూర్తిగా అర్థం చేసుకోవడం కోసమే నాకు అవార్డులు వస్తున్నాయేమో..
- తొలి ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంలో కురోసావా
Authorization