కమర్షియాలిటీకి పెద్ద పీట వేయకుండా వాస్తవికతకు అద్దంపట్టేలా ఉండటమే ఇటాలియన్ సినిమాల ప్రత్యేకత. డ్రామా నేపథ్య చిత్రాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో ఇటాలియన్ దర్శకులు నిష్ణాతులని వేరే చెప్పక్కర్లేదు. సహజత్వ ధోరణిలో రూపొంది సినీ ప్రేమికుల మనసుల్ని దోచుకున్న కొన్ని ఆసక్తికర ఇటాలియన్ చిత్రాల గురించి
ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'...
ది ఫ్యామిలీ ఫ్రెండ్
ఇటాలియన్ డ్రామా చిత్రమిది. పోలో సోర్రెంటినో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓ వడ్డీ వ్యాపారి చుట్టూ తిరుగుతుంది. జెరెమియా వయసు మీద పడిన టైలర్, వడ్డీల వ్యాపారి. తన పాత ఇంట్లో మంచానపడిన తల్లితోపాటు జీవిస్తుంటాడు. డబ్బు పిచ్చి, అనారోగ్యంతోనూ బాధపడుతుంటాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లోని అక్రమ సంబంధాలను ఎక్కువగా గమనిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన కూతురు పెళ్ళికోసం జెరేమియా దగ్గరకు డబ్బు కోసం వచ్చినప్పుడు ఆయన కూతురు రోసల్బాని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జెరేమియా జీవితం ఎలాంటి పలుపులు తిరిగిందనేది సినిమా. 2006లో విడుదలైన ఈ చిత్రం విజువల్‌గాను, కథాంశపరంగానూ మంచి ప్రశంసలందుకుంది. గెరేమియా పాత్రలో గియో కోమో రిజ్జో నటన ఆకట్టుకుంటుంది. రోసల్బా పాత్రలో లారా చియట్టి నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.
ది ఫస్ట్ బ్యూటిఫుల్ థింగ్..
ఒక కుటుంబానికి సంబంధించి సుఖ, దు:ఖాలను, ఒడిదుడుకులను తెలిపే చిత్రమిది. చనిపోవడానికి చివరి రోజుల్లో ఉన్న తన తల్లిని చూసేందుకు పరదేశంలో ఉన్న ఓ ప్రొఫెసర్ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన క్రమంలో తల్లి, ఫ్రొఫెసర్, ప్రొఫెసర్ భార్యల మధ్య చోటుచేసుకునే సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. తల్లీకొడుకుల బంధానికి, భార్యాభర్తల అనుబంధానికి ప్రతిబింబంగా నిలిచిన చిత్రమిది. పోలో వీర్జి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ డ్రామా చిత్రం 2010లో విడుదలై విశేష ఆదరణ పొందింది. ఇందులో ప్రధాన పాత్రల్లో వాలెరియా మాస్టండ్రె, మిచెల్లా రమజ్జోట్టి నటించారు. ఈ చిత్రం విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ కావడం విశేషం. ఆరోగ్యకర కామెడీ, ఎమోషన్స్, నాటకీయత చిత్ర విజయంలో భాగమయ్యాయి.
ది గర్ల్ బై ది లేక్..
ఒక కొలను ఒడ్డున ఓ యువతి శవం పడి ఉంటుంది. మిస్టరీగా మారిన ఆ యువతి మరణాన్ని చేధించే బాధ్యతను రిటైర్మెంట్కు దగ్గర్లో పడిన ఓ డిటెక్టీవ్కు అప్పగిస్తారు. అయితే ఆ డిటెక్టీవ్ ఇంట్లో పరిస్థితి బాగోక ఎన్నో సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతుంటాడు. అయినప్పటికీ డెత్ మిస్టరీని చేధించే క్రమంలో అనేక కొత్త విషయాలను తెలుసుకుంటాడు. అతను తెలుసుకున్న కొత్త విషయాలేంటి?, తన కుటుంబ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. ఆండ్రియా మొలాయిలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2007లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంలోని నాటకీయత, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తాయి.
ది కాన్సిక్వీన్సెస్ ఆఫ్ లవ్
టిట్టా డి గిరోలమో స్విట్జర్లాండ్ హోటల్లో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అనుకోకుండా తనలో మార్పు వస్తుంది. దానికి కారణం ఆ హోటల్లోని బార్ గర్ల్. ఆమె పరిచయంతో అతని లైఫ్ పూర్తిగా మారిపోతుంది. తన వ్యక్తిగత రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తాడు. ఎమోషన్స్, లవ్, సెక్స్, మాఫియా, హత్యలు చేయటం.. వంటి వాటితో ఒక్కసారిగా అతని లైఫ్ టర్న్ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో చివరికి అతని లైఫ్‌లో ఎలాంటి మజిలీలు చోటు చేసుకున్నాయనే ఇతివృత్తంతో దర్శకుడు పోలో సెర్రెంటినో ఈ చిత్రాన్ని రూపొందించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. టిట్టా పాత్రలో టోని సర్వీలో నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
వన్ మ్యాన్ అప్
ఇద్దరి ప్రముఖుల జీవిత గమనాన్ని ప్రతిబింబించే చిత్రం. ఒకరు టోని పాప్ సింగర్. పాప్ సామ్రాజ్యాన్ని ఊపేస్తున్న తరుణంలో సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుంటాడు. అలాగే మరొకరు అంటోనియో ఫుట్‌బాల్ హీరో. తన అద్భుతమైన ఆటతీరుతో బాగా పాపులర్ అవుతాడు. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల్లో ఇరుక్కుపోతాడు. ఇలా ఇద్దరి గొప్ప వ్యక్తుల జీవితాల వెనకాల ఉన్న చీకటి కోణాలను చూపే ఈ కామెడీ చిత్రానికి సంచలన దర్శకుడు పోలో సోర్రెంటినో తొలిసారి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రంలో టోనీ పాత్రలో టోనీ సర్వీలో, అంటోనియో పాత్రలో ఆండ్రియా రెంజాల నటన మైమరపిస్తుంది.
అవర్ లైఫ్
రోమ్‌లో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న క్లాడియోకి భార్య అంటే పిచ్చి. అతనికి ఇద్దరు పిల్లలుంటారు. మూడోసారి క్లాడియో భార్య గర్భవతి అయిన క్రమంలో కన్స్ట్రక్షన్ వర్క్ జరిగే ప్లేస్‌లో మరో మహిళతో క్లాడియో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. దీంతో క్లాడియో కుటుంబంలో చోటు చేసుకున్న ఇబ్బందికర పరిణామాల ఇతివృత్తమే ఈ చిత్రం. అద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రానికి డానియెల్ లుచెట్టి దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణతోపాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. క్లాడియో పాత్రలో నటించిన ఎలియో జర్మో నటన సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ది ఎంబాల్మర్
ప్రముఖ వైద్యుడు (టాక్సీడెర్మిస్ట్) పెప్పినో విచిత్రమైన పనులు చేస్తుంటాడు. అతని తీరు చూసి అందరూ ఎగతాళి చేస్తుంటారు. కానీ వలెరియో అనే వ్యక్తికి పెప్పినో చేసే పని బాగా నచ్చుతుంది. అలాగే వలెరియో పని విధానం నచ్చి తనకు అసిస్టెంట్‌గా పెట్టుకుంటాడు పెప్పినో. ఈ క్రమంలో వలెరియో ఓ అమ్మాయితో లైంగికపరమైన సంబంధం పెట్టుకోవడం నచ్చని పెప్పినో ఏం చేశాడనేది సినిమా. ఈ డ్రామా చిత్రాన్ని దర్శకుడు మాటెయి గరోన్ అత్యంత నాటకీయంగా తెరకెక్కించారు. 2002లో విడుదలైన ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. అలాగే పలు ఇతర అవార్డులనూ సొంతం చేసుకుంది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో పెప్పినో పాత్రలో ఎర్నెస్టో మహీక్స్, వలెరియో పాత్రలో ఫోగ్లియా మాన్జిలో అద్భుతంగా నటించారు.
గోమోర్రా
గోమోర్రా ప్రాంతంలోని మాఫియా సామ్రాజ్య చరిత్రను తెలిపే చిత్రమిది. ఐదుగురు వ్యక్తులు ఒకేసారి మాఫియాలో తమ ఆధిపత్య కోసం చేసే ప్రయత్నమే ఈ చిత్రం. క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మాటెయి గరోన్ దర్శకత్వం వహించారు. ఇటలీలోని సాంప్రదాయ నేర సామ్రాజ్యాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం 2008లో విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఆస్కార్‌కి నామినేట్ అవ్వడమే కాకుండా కేన్స్‌లో ప్రదర్శితమై గ్రాండ్ ఫ్రిక్స్ అవార్డు సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ప్రధాన పాత్రల్లో నటించిన టోని సర్వీలో, జియాన్ఫెలిన్ ఇంపార్టో, మారియా నాజియోనేల్, సాల్వాటోర్ కాంటలూపో, గిగియో మోరాల నటన ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
వన్ హండ్రెడ్ స్టెప్స్
సిసిలీ పట్టణంలో మాఫియా సామ్రాజ్యం రాజ్యమేలుతుంటుంది. మాఫియాకు టానో బడాల్మెంటి నాయకుడు. ఆయనకు వ్యతిరేకంగా రాజకీయ కార్యకర్త పెప్పినో ఇంపాస్టానో పోరాడుతుంటాడు. వీళ్లిద్దరి ఇండ్లకు మధ్య దూరం కేవలం వంద అడుగులు మాత్రమే. మాఫియాకు వ్యతిరేకంగా పెప్పినో చేస్తున్న పోరాటం చూసి అతన్ని బాంబ్‌బ్లాస్ట్‌లో చంపేస్తారు. 1978లో వాస్తవంగా జరిగిన ఈ సంఘటన ఆధారంగా దర్శకుడు మార్కె టుల్లియో గిర్డానా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది విశేష ప్రేక్షకాదరణతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. పెప్పినో పాత్రలో లుయిగి కాస్సియో, గియిటనో పాత్రలో టోనీ స్పెరాండియో నటన అద్భుతంగా ఉంటుంది.
మాక్సిమమ్ వెలాసిటీ
స్ట్రీట్ రేసింగ్ కల్చర్‌ను ప్రతిబింబించే చిత్రమిది. 17ఏండ్ల వయస్సున్న క్లాడియో మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. స్ట్రీట్ రేసింగ్‌లో గెలిస్తే ఓ కారు సొంతంగా ఇస్తానని ఒక ఇన్వెస్టర్ చెప్పినప్పటికీ ప్రతిసారి క్లాడియో ఓడిపోతుంటాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర, భావోద్వేగాల సమాహారమే ఈ చిత్రం. డానియల్ వికారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2002లో విడుదలై ఆకట్టుకుంది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమైంది. ఇందులో క్లాడియా పాత్రలో క్రిస్టియానో మోరోని నటించి మెప్పించారు.
గుడ్ మార్నింగ్... నైట్
రెడ్ బ్రైగేడ్స్ అనే టెర్రరిస్ట్ సంస్థ ఇటలీ మాజీ ప్రధాని అల్డో మోరోను కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్చెర నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాలని ఇటలీ ప్రభుత్వానికి మోరో ఎన్ని ఉత్తరాలు రాసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోదు. ఈ క్రమంలో మోరో కిడ్నాప్చెర నుంచి బయటపడ్డాడా.. లేదా?.. అనేది మిగిలిన కథ. మార్కో బెలోచియో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2003లో విడుదలై అందరి ప్రశంసలందుకుంది. ఇందులో ఆల్డో మోరో పాత్రలో రాబర్టో నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
ఆఫ్టర్ మిడ్నైట్
ఓ ప్రేమ జంట విచిత్రమైన కోరిక నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇటలీలోని మ్యాజికల్ మ్యూజియంలో మూకీ సినిమా చూడాలని ఓ ప్రేమ జంట ఆరాటపడుతుంది. భయస్తుడైన వాచ్‌మెన్‌ను అర్థరాత్రి బయపెట్టి ఆ జంట మ్యూజియంలోకి అడుగిడి తాము కోరుకున్నట్టు మూకీ సినిమా చూస్తుంటారు. ఈ క్రమంలో వారిలో కలిగిన భావాలేంటి?, ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని డావిడే ఫెర్రరియో రూపొందించారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ చిత్రంలో జార్జియా పాసోటీ, ఫ్రాన్సెస్కా ఇనాడి ప్రేమ జంటగా నటించి అలరించారు.
హ్యాపీ ఫ్యామిలీ
స్క్రీన్‌ప్లే రైటరైన ఈజో ఓ స్క్రిప్ట్‌కి సంబంధించి హ్యాపీ ఎండింగ్ సన్నివేశాలు రాసేందుకు ఇబ్బంది పడుతుంటాడు. సరైన ఆలోచనలు తట్టక మదనపడుతుంటాడు. తనకు క్రియేటివిటీ లేదని భావిస్తున్న క్రమంలో అన్నా అనే మహిళ కారులో వెళ్తూ ఈజోను యాక్సిడెంట్ చేస్తుంది. ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో ఏర్పడిన పరిచయంతో ఈజోను డిన్నర్‌కు ఆహ్వానిస్తుంది అన్నా. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఈజోకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఓ సరికొత్త ఆసక్తికర స్క్రీన్‌ప్లే మెరుపులా మెరుస్తుంది. ఆ స్క్రీన్‌ప్లే ఏంటన్నదే సినిమా. గాబ్రియేల్ సాల్వాటోర్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ హాస్యభరిత చిత్రం 2010లో విడుదలై మంచి ప్రశంసలందుకుంది. ఇందులో ఈజో పాత్రలో ఫాబియో డె లుగి, అన్నా పాత్రలో మార్ఘరిలా బై నటన ఆద్యంతం అద్భుతం.
మై మదర్ స్మైల్
ఎర్నెస్టో గొప్ప పెయింటర్ అయినప్పటికీ అతని లైఫ్ చాలా ఒడిదుడుకులతో ఉంటుంది. ఈ క్రమంలో తల్లి హత్యకు గురవుతుంది. ఈ హత్యకు, తన సోదరులకు ఉన్న సంబంధమేంటి? అందుకు ఎర్నెస్టో ఏం చేశాడనేది సినిమా. ఎర్నెస్టో ఆలోచనా దృక్పథాన్ని, ఆయన పెయింటింగ్ గొప్పతనాన్ని, నాస్తిక లక్షణాలను అద్భుతంగా ప్రతిబింబించే సినిమా ఇది. మార్కో బెలోచియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డ్రామా చిత్రం అంతే నాటకీయంగా సాగుతుంది. 2002లో విడుదలై కేన్స్‌లో ప్రదర్శితమై జ్యూరీ అవార్డు సొంతం చేసుకుంది. ఎర్నెస్టో పాత్రలో సెర్గియో క్యాస్టెల్లిటో నటన అందరినీ అలరిస్తుంది.
ది స్టోలెన్ చిల్డ్రన్
పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించే ప్రాంతంలో 11 ఏండ్ల అమ్మాయితో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను ఆంటోనియో అరెస్ట్ చేస్తాడు. దీంతో అనాధలుగా మారిన ఆ మహిళకు సంబంధించిన ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకునే బాధ్యతను డిపార్ట్మెంట్ ఆంటోనియోకు అప్పగిస్తుంది. ఆ పిల్లల వల్ల ఆంటోనియో పడిన ఇబ్బందులేంటి?, అంతిమంగా వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కావడమనేది సినిమా. ఆద్యంతం భావోద్వేగపూరితంగా, నాటకీయంగా సాగే ఈ చిత్రానికి జియాన్ ఆమేలియో దర్శకత్వం వహించారు. ఆస్కార్‌కు నామినేటైన ఈ చిత్రంలో ఆంటోనియా పాత్రలో ఎన్రికో లో వెర్సో తనదైన నటనతో మెప్పించారు.
ది జువెల్
వ్యవసాయానికి సంబంధించిన పెద్ద కంపెనీ లెడా ఫుడ్. దాని ఫౌండర్ అమాంజియో రాస్టెల్లీ. ఆ కంపెనీలో అకౌంటెంట్‌గా ఎర్నెస్టో బోల్టా పనిచేస్తుంటాడు. కంపెనీ అన్ని రకాలుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు మంచి లాభాలనూ గడిస్తుంది. ఈ క్రమంలో ఓ భారీ కుంభకోణం చోటు చేసుకోవడంతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో కంపెనీని నిలబెట్టేందుకు టీమ్ పడిన సంఘర్షణే సినిమా. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రానికి ఆండ్రియా మొలయిలీ దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో అకౌంటెంట్ పాత్రలో టోని సర్వీలో, ఫౌండర్ పాత్రలో రెమో గిరోనె, అసిస్టెంట్ సారా ఫెల్బ్ర్బమ్ల నటన ఆకట్టుకుంటుంది.
టెర్రాఫెర్మా
మత్య్సకారులకు జీవనాధారమైన సిసిలియన్ ద్వీపకల్పంలోకి ఇమ్మిగ్రేషన్ అధికారుల అనుమతి లేనిదే ఇతరులు అడుగుపెట్టకూడదు. దీన్ని అతిక్రమిస్తే కఠిన శిక్ష పడుతుందని తెలిసినప్పటికీ ఆపదలో ఉన్న ఓ కుటుంబాన్ని బోట్ నడిపే ఫిలిప్పో అనే కుర్రాడు కాపాడతాడు. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగే ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. అలాగే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది.
Authorization