బంధాలు, అనుబంధాలు, సమాజంతో ముడిపడిన మనుషుల జీవితాలే.. సినిమాలకు కథా వస్తువులు. వీటిని అత్యంత సమర్థవంతంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రపంచ సినిమా చరిత్రలోనే
ఫ్రెంచ్ సినిమా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంది. ఎన్నో అద్భుతమైన, ఆసక్తికరమైన చిత్రాలకు
ఫ్రెంచ్ సినిమా కేరాఫ్‌గా నిలిచిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆద్యంతం అబ్బురపరచి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన కొన్ని ఫ్రెంచ్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ఈడెన్..
టీనేజర్ పాల్ తన స్నేహితులతో కలిసి డీజే ప్రొగ్రామ్స్ నిర్వహిస్తుంటాడు. రోజు రోజుకి వాళ్లుంటున్న ప్రాంతంలో ఆదరణ తగ్గిపోతున్న టైమ్‌లో న్యూయార్క్ నుంచి పాల్‌కు ఆఫర్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళిన పాల్ తక్కువ టైమ్‌లో బాగా పాపులర్ అవుతాడు. ఈ క్రమంలో తన స్నేహితుడి ఆత్మహత్య, వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడం వంటి కారణాలతో డ్రగ్స్, సెక్స్ వంటి చెడు అలవాట్లకు పాల్ బానిసవుతాడు. దీంతో అతని మ్యూజిక్ లైఫ్ ఎలా ముగిసిపోయిందనే అంశాలకు ప్రతిరూపమే ఈ చిత్రం. ఒక టీనేజ్ కుర్రాడి జీవితంలోని ఎత్తుపల్లాలను చూపించిన ఈ చిత్రానికి మియా హాస్సెన్ లోవ్ దర్శకత్వం వహించారు. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రం 2014లో విడుదలైంది.
పలు
ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులనూ అందుకుంది. ముఖ్యంగా ఇందులో పాల్ పాత్రలో నటించిన ఫెలిక్స్ డే గివరి నటన ఆద్యంతం అలరిస్తుంది. ఈ సినిమా కమర్షియల్గానూ సత్తా చాటింది.
అమౌర్
జార్జెస్, అన్నే 80ఏండ్లు దాటిన భార్యాభర్తలు. ఇద్దరూ మ్యూజిక్ టీచర్లుగా రిటైర్ అవుతారు. వాళ్ళ కూతురు కూడా మ్యూజిషియనే. ఆమె బ్రిటన్‌లో ఉంటుంది. ఓ రోజు అన్నేకు హార్ట్స్ట్రోక్ రావడంతో కుడిభాగమంతా పక్షవాతానికి గురవుతుంది. అనుకోకుండా అన్నే జీవితంలో జరిగిన అలజడికి ఆ కుటుంబ సభ్యులంతా ఎలా రియాక్ట్ అయ్యారనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రం ప్రధానంగా భార్యభర్తల అనుబంధం, కుటుంబ సభ్యుల భావోద్వేగాల సమాహారంగా దర్శకుడు మైఖేల్ హానేక్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు. 2012లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకోవడంతోపాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై పాల్మె డి ఓర్ అవార్డును, అలాగే నాలుగు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేటై ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అలాగే అనేక ఇతర పురస్కారాలను దక్కించుకుంది. ఇందులో జార్జెస్ పాత్రలో జీన్ లూయిస్ ట్రిన్జినన్ట్, అన్నే పాత్రలో ఏమ్మాన్యుల్లే రివా నటన ఆద్యంతం మనసుల్ని స్పృశిస్తుంది. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం సత్తా చాటింది.
అమేలి
సినిమా ప్రధానంగా అమేలి అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. తను చేసిందే కరెక్ట్ అనుకునే మనస్తత్వం గల అమ్మాయి అమేలి. కానీ నాన్న కారణంగా అణచివేయబడుతుంది. దీంతో నెగటివ్ దృక్పథాన్ని ఏర్పర్చుకుంటుంది. తనకు నచ్చినట్లు ఉండాలని, ప్రేమతో కూడిన ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవించాలని కలలు కంటుంది. ప్రేమ కోసం ఆరాటపడుతుంది. తాను ఊహించుకున్న అద్భుతమైన లోకం దొరక్కపోవడంతో అమేలి ఏం చేసిందనేది కథ. ఒక అమ్మాయి తన కలలు కన్న ప్రపంచం కోసం చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో సంతరించుకున్న కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్. 2001లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని దర్శకుడు జీన్ పియర్ రూపొందించారు. అమేలి పాత్రలో ఆడ్రీ టాటౌ నటన ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ మ్యూజిక్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది.
హోలీ మోటర్స్
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వ్యక్తి జీవితం ఎన్ని రకాలుగా మారిందనేది ఈ చిత్రం చూపిస్తుంది. మాన్స్యూర్ ఆస్కార్ కాసేపు సంపన్నుడిగా ఉంటాడు. కారులో ప్రయాణిన్నప్పుడు మహిళగా, కారు దిగాక ముసలివాడిగా, కెమెరా ముందు అమ్మాయిని చూసినప్పుడు వికలాంగుడిగా, ఆ తర్వాత పిచ్చివాడుగా, రాక్షసుడిగా, హంతకుడిగా.. టైమ్ మారే కొద్ది విభిన్న పాత్రల్లోకి, వివిధ రకాల మనుషులుగా మారడమే ఈ చిత్ర ఇతివృత్తం. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కెమెరా వర్క్స్‌లో, సినిమా టేకింగ్‌లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు లియోస్ కారాక్స్ రూపొందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు విమర్శకులనూ మెప్పించింది. కేన్స్‌లో ప్రదర్శితమై గోల్డెన్ పామ్ అవార్డును దక్కించుకుంది. ఆస్కార్ పాత్రలో డేనిస్ లావేంట్ నటన కట్టిపడేస్తుంది.
35షాట్స్ ఆఫ్ రమ్
తండ్రీకూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. కూతురు జీవితంలోకి ఓ అబ్బాయి రావడంతో తండ్రీకూతుళ్ళ బంధం చాలా సంక్లిష్టంగా మారుతుంది. మరి దీన్నుంచి బయటపడేందుకు వాళ్ళేం చేశారు?, 35 రమ్ గ్లాస్‌లకు, ఈ కథకు ఉన్న సంబంధమేంటన్నది సినిమా. ఆద్యంతం భావోద్వేగాలతో సాగే ఈ చిత్రానికి క్లైరే డెనిస్ దర్శకత్వం వహించారు. 2008లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా ఆకట్టుకోవడంతోపాటు విమర్శకుల్నీ మెప్పించింది. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమై అభినందలు అందుకుంది. తండ్రీ కూతుళ్ళుగా అలెక్స్ డెస్కాస్, మతి డియోప్ల నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
లా సాపియెన్జా
ఆందోళలను అధిగమించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అనే సందేశాన్ని అంతర్లీనంగా చెప్పేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం అందరి ప్రశంసలను పొందింది. ఆర్కిటెక్చర్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు పొందిన తర్వాత ప్రఖ్యాత వాస్తుశిల్పి బోరోమినిపై ఓ పుస్తకాన్ని ప్రచురించాలనే కాంక్షతో అలెగ్జాండర్ తన భార్యతో సహా ఇటలీ వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధం తగ్గి భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఓ అన్నా, చెల్లెళ్ళ పరిచయం బోరోమిని పుస్తక పనిలో ఉన్న అలెగ్జాండర్ జీవితాన్నే మార్చేస్తుంది. దాని ఫలితంగా దూరమైన తన భార్య చెంతకు చేరాల చేస్తుంది. యూజీన్ గ్రీన్ దర్శకత్వం వహించిన ఈ డ్రామా చిత్రం 2014లో విడుదలై విశేష ఆదరణ పొందింది.
ఆఫ్ గాడ్స్ అండ్ మెన్
1996లో అల్జిరియాలో ఫ్రాన్స్‌కు చెందిన 8 మంది సన్యాసులు ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని వెనుకబడిన తరగతుల ప్రజలకు సేవ చేస్తుంటారు. అల్జిరియాలో సివిల్ వార్ మొదలవ్వడంతో టెర్రరిస్టుల నుంచి ఈ సన్యాసులకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలా? లేక ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్ళి పోవాలా అనే సందిగ్ధంలో పడతారు. ఈ నేపథ్యంలో మనుగడ కోసం సన్యాసులు చేసిన పోరాటమే ఈ సినిమా. జేవియర్ బ్యూవోయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలైంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కించుకుంది. మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన లాంబెర్ట్ విల్సన్, మైఖేల్ లాన్స్డేల్ నటన అలరిస్తుంది.
సమ్‌థింగ్ ఇన్ ది ఎయిర్
తనకిష్టమైన పెయింటింగ్‌తో కెరీర్లో ఎదగాలా? లేక హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడాలా అనే సందిగ్ధంలో ఉన్న ఓ స్టూడెంట్ గిల్లీస్ కథతో రూపొందిన చిత్రమిది. 1970 టైమ్‌లో గిల్లీస్ అనే విద్యార్థి ఉండే చోట హక్కుల కోసం భారీ ఆందోళనలు జరుగుతుంటాయి. తోటి సహచరులు, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతుంటారు. కెరీర్లో ఎదగాలా లేక హక్కుల కోసం పోరాడాలా అనే మీమాంసలో ఉన్న గెల్లీన్ ప్రేమలో పడతాడు. దీంతో అతని జీవితంలో చేసుకున్న పరిణామాలేంటనేది ఆద్యంతం నాటకీయంగా చూపించిన చిత్రమిది. ఆలివర్ ఆసియస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో విడుదలైంది. ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూనే పెయింటర్ ప్రేమను అద్భుతంగా తెరపై ఆవిష్కరించింది. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రంలో గిల్లీస్గా క్లెమెంట్ మెటియెర్, ప్రియురాలిగా లోలా క్రెటన్ నటించి ఆకట్టుకున్నారు.
బీయింగ్ 17
17ఏండ్ల టీనేజ్ కుర్రాళ్ళ జీవితాలను ప్రతిబింబించే చిత్రమిది. డామియెన్, థామస్ ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే క్లాస్‌లో చదువుతుంటారు. కానీ వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పుడూ గొడవపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దీంతో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ సినిమా. ఇద్దరు టీనేజర్స్‌లో ఒకరిపై మరొకరికి ప్రేమ కలగడమనేది ఇందులో హైలైట్. ఆండ్రే టెనిచే రూపొందించిన ఈచిత్రం 2016లో విడుదలై విశేష ఆదరణ పొందింది. బెర్లిన్‌తోపాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది. థామస్ పాత్రలో కోరింథిన్ ఫిలా, డామియెన్ పాత్రలో కసే మోట్టెట్ క్లైన్‌ల నటన అందరినీ అలరిస్తుంది.
హౌస్ ఆఫ్ టోలరెన్స్
విలాసవంతమైన వేశ్యాగృహల్లో ఉండే వేశ్యల జీవన స్థితికి తెరరూపమిచ్చిన చిత్రమిది. క్లయింట్స్‌తో వేశ్యలు పడే బాధలు, బలవంతంగా మాదక ద్రవ్యాల వినియోగం, గర్భధారణ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక, శారీరక దాడులు, వయసు రీత్యా ఎదురయ్యే ఇబ్బందులు.. ఇలా వారి బాధలు, భయాలు, కష్టసుఖాలకు ఈ చిత్రం అద్దం పట్టింది. దర్శకుడు బెర్ట్రాండ్ బోనోల్లో ఈ చిత్రాన్ని ఆద్యంతం వాస్తవికంగా, నాటకీయంగా రూపొందించారు. 2011లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను పొందడంతోపాటు కేన్స్‌లోనూ ప్రదర్శితమవ్వడం విశేషం. ఇందులో హాఫ్సియా హెర్జీ, సెలైన్ సాలెట్టే, జాస్మిన్ త్రిన్కా, అడేల్ హేనెల్, అలిస్ బర్నోల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
గుడ్‌బై ఫస్ట్ లవ్
ప్రేమలో పడిన టీనేజర్లు కామెల్లె, సుల్లివన్ శారీరకంగానూ దగ్గరవుతారు. ఈ క్రమంలో ప్రియుడు సుల్లివన్ తన స్నేహితులతో కలిసి సౌత్ అమెరికాకు టూర్ వెళ్తాడు. ప్రియుడు లేకపోవడంతో ఒంటరితనం అనుభవిస్తున్న కామెల్లె క్రమంగా మానసికంగా కృంగిపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళి ఆసుపత్రి పాలవుతుంది. ఆ తర్వాత కోలుకుని ఆర్కిటెక్చర్ కాలేజ్‌లో జాయినై ప్రొఫెసర్ లోరెంజ్తో ప్రేమలో పడుతుంది. అతని వల్ల ప్రెగెంట్ అవుతుంది. అదే సమయంలో మొదటి ప్రియుడు సుల్లివన్ టూర్ నుంచి తిరిగొస్తాడు. దీంతో తాను కోల్పోయిన జెన్యూన్ ప్రేమను కామెల్లె పొందడమే ఈ చిత్ర కథాంశం. మియా హాన్సెన్ లోవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీనేజర్స్లోని అమాయక ప్రేమను, ఆకర్షణను, వాళ్లు చేసే తప్పులను, దాన్ని సరిదిద్దుకోవడం వంటి అంశాలను అద్భుతంగా ఆవిష్కరించింది. సుల్లివన్ పాత్రలో సెబాస్టియన్ ఉర్జెన్డోస్కీ, కామెల్లె పాత్రలో లోలా క్రెటన్ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది.
బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్
టీనేజ్ గర్ల్ అడిలెకు బ్లూ కలర్ హెయిర్ ఉన్న ఎమ్మా అనే యువతి పరిచయం అవుతుంది. ఆమె పరిచయం వల్ల తనని తాను తెలుసుకోవడంతోపాటు తన కోరికలేమిటో గ్రహిస్తుంది. ఎమ్మాతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండటంతో అడిలె జీవితమే మారిపోతుంది. మానసికంగా ఎదిగినప్పటికీయ తన రియాలిటీని కోల్పోతుంది. ప్రేమ విషయంలో, తను కోల్పోయిన అంశాల విషయంలో అడిలె ఏం తెలుసుకుందనేది సినిమా. ఒక అమ్మాయి మానసిక పరిస్థితిని, ఎదిగే వయసులో చేసే చేష్టలను ప్రతిబింబించే ఈ చిత్రాన్ని దర్శకుడు అబ్దేల్లతిఫ్ కెచీచే రూపొందించారు. కమింగ్ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2013లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతోపాటు కలెక్షన్లలోనూ సత్తా చాటింది. కేన్స్‌లో ప్రదర్శితమై గోల్డెన్ పామ్ అవార్డు పొందింది. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డులతోపాటు అనేక పురస్కారాలను దక్కించుకుంది. ఇందులో ఎమ్మా పాత్రలో లెయా సెడౌక్స్, అడిలె పాత్రలె ఎడెసెల్ ఎక్సోచోపోలస్ల నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
టామ్బారు
ఒక ఫ్యామిలీ వేసవి సెలవుల్లో తమ వీధి నుంచి పక్క వీదిలోకి ఇల్లు మారతారు. పదేండ్ల కుర్రాడు లారే తన పేరును మైఖేల్‌గా మార్చుకుని ఆ వీధిలోని పిల్లలతో కలుస్తాడు. వారితో ఆడుకునే టైమ్‌లో మైఖేల్‌లో ట్రాన్స్‌జెండర్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మైఖేల్ మనుగడ ఎలా సాగిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. 2011లో సెలిన్ సైన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అస్పష్టమైన లింగత్వం కలిగిన వారి జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు.
Authorization