నిరంతరం వైవిధ్యభరిత నేపథ్య కథలతో కొరియన్ సినిమాలు ప్రేక్షకుల మనసుల్ని
గెల్చుకుంటూనే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ సినీ చరిత్రలో ఓ ప్రత్యేక గుర్తింపూ పొందాయి.
భిన్న కథలు, ప్రయోగాత్మక నేపథ్యాలు, సహజ నటనకు ప్రాముఖ్యత ఇస్తూ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండేండ్లలో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన కొన్ని కొరియన్ సినిమాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..!
వన్ స్టెప్
సి యున్ అనే విద్యార్థినికి కారు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఆ యాక్సిడెంట్తోపాటు గతాన్నీ మరచిపోతుంది. హాస్పిటల్లో ఉన్న రాత్రి సమయాల్లో నిద్రలోనే సంగీతానికి సంబంధించి సరికొత్త పదాలను, శబ్ధాలను పలుకుతుంటోంది. ఇది గమనించిన ఓ కుర్రాడు ఆమె చెప్పే పదాలను ట్యూన్లుగా రూపొందించి మ్యూజిక్ రూపంలో ఆమెకు వినిపిస్తాడు. దీని వల్ల క్రమంగా ఆమె తన గతాన్ని గుర్తుచేసుకుంటుంది. మరి గతంలో సియున్ ఏంటి?, మ్యూజిక్ కంపోజ్ చేసే వ్యక్తికి, ఆమెకున్న సంబంధమేంటన్నది సినిమా.
సి యున్ పాత్రలో సండారా పార్క్ నటించారు. మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సండారా పార్క్ నటన, ఆమె ఇచ్చే మ్యూజిక్ షోస్
ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది.
ఆర్డినరి పర్సన్ కాంగ్ సంగ్ జిన్ నీతికి, నిజాయితీకి మారుపేరు. తన భార్య, కుమారుడితో సంతోషంగా గడుపుతుంటాడు. టు స్టేర్ హౌస్ కొనుక్కోవాలనేది అతని కల. పై అధికారులు అతనపై కుట్ర పన్ని ఓ మర్డర్ కేసులో ఇరికిస్తారు. ఆ టైమ్‌లో తన కొడుకుకి కాళ్లకు సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అందుకు డబ్బు కావాలి. దాని కోసం కొందరు కాంగ్‌ను పక్కదారి పట్టించి అవినీతి వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారు. మరి కొడుకు కోసం తను నమ్ముకున్న నీతి మార్గంలో వెళ్ళాడా లేదా అవినీతి దారి పట్టాడా అనేదే ఈ చిత్ర కథాంశం. మార్చిలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలందుకోవడంతోపాటు కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. కిమ్ బాంగ్ హాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై పలు అవార్డులనందుకుంది.
మిస్సింగ్ యు
రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. హీ జూ ఏడేండ్ల బాలిక. తన తండ్రిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ కి బుమ్ని చంపాలని చూస్తుంటుంది. ఓ కేసులో పట్టుబడి 15 ఏండ్ల శిక్ష అనుభవించిన తర్వాత కి బుమ్ జైలు నుంచి బయటికొచ్చే తరుణం కోసం హీ జూ ఎదురు చూస్తుంటే, కి బుమ్ రాక కోసం ఓ డిటెక్టీవ్ కూడా ఎదురు చూస్తుంటాడు. ఈ ముగ్గురు కలిసిన తర్వాత జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ చిత్రానికి మో హంగ్ జిన్ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో బాలిక పాత్రలో షిమ్ యున్ క్యుంగ్ నటన ఆద్యంతం అలరిస్తుంది.
ది ట్రూత్ బినీత్
నేషనల్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతున్న రోజులవి. జాంగ్ చాన్ ఎన్నికల రేసులో ఉంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్ చాన్ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్ జిన్ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్ చాన్ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రాన్ని లీ క్యౌంగ్ మై రూపొందించారు. గతేడాది విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అనేక అవార్డులనూ అందుకుంది. ఇందులో జాంగ్ చాన్ పాత్రలో కిమ్‌జూ య్యూక్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ది వరల్డ్ ఆఫ్ హస్
ఇద్దరు చిన్న పిల్లల ప్రపంచాన్ని తెలియజేసే సినిమా ఇది. సన్ అనే బాలిక చుట్టూ కథ తిరుగుతుంది. పదేండ్ల వయసున్న సన్ అనే చిన్నారి వేసవి కాలంలో తన వీధిలోకి వచ్చిన జియా అనే సేమ్ తన ఏజ్ ఉన్న బాలికను కలుస్తుంది. వీళ్లిద్దరూ అతి తక్కువ టైమ్‌లోనే మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఈలోపు స్కూల్లో కొత్త సెమిస్టర్ ప్రారంభమవుతుంది. సన్, ఇతర పిల్లల మధ్య వచ్చిన కొత్త మార్పును చూసి జియా ఆశ్చర్యపోయి, క్రమంగా పిల్లల గ్రూప్‌కు దగ్గరవుతుంది. దీంతో అత్యంత స్నేహంగా ఉన్న సన్, జియాల మధ్య దూరం పెరుగుతుంది. సున్నితమైన మనస్తత్వం కలిగిన ఈ ఇద్దరు పిల్లలు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణే ఈ చిత్రం. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు యున్ గ యన్ రూపొందించారు. గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలతోపాటు పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇందులో సన్ పాత్రలో చోరు సూ ఇన్, జియా పాత్రలో సీయోల్ హై ఇన్ల నటన అబ్బురపరుస్తుంది.
డోంగ్జు: ది పోర్టైట్ ఆఫ్ ఏ పోయెట్..
కొరియాను జపాన్ దేశం ఆక్రమించిన రోజులు. స్వాతంత్య్రం కోసం కొరియన్లు పోరాటం చేస్తున్నారు. ఈ టైమ్‌లో ఓ వ్యక్తి పోయెట్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం తపిస్తుంటాడు. తనకది ఆ టైమ్‌లో లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడం కోసం చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. బయోగ్రాఫికల్ పీరియడ్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కించడం విశేషం. గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని లీ జున్ ఇక్ రూపొందించారు. ఈ చిత్రం పలు అవార్డులను అందుకుంది. ఇందులో పోయెట్ పాత్రలో కాంగ్ హా నల్ నటించి మెప్పించారు.
ది కింగ్..
అత్యంత పేదరిక కుటుంబంలో పుట్టిన పార్క్ టై సోయు ఎప్పటికైనా ప్రాసిక్యూటర్ కావాలనే లక్ష్యంతో ఉంటాడు. దీని కోసమై సౌత్ కొరియాలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చేరి, అతి తక్కువ కాలంలోనే బెస్ట్ ప్రాసిక్యూటర్‌గా తయారవుతాడు. ప్రాసిక్యూటరైన వాళ్లలో తానే చిన్నవాడు కూడా. ప్రాసిక్యూటర్‌గా మంచి పేరు తెచ్చుకుంటూ లక్ష్యాన్ని చేరి సంతోషంగా గడుపుతున్న తరుణంలో అప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, అత్యంత శక్తివంతమైన ప్రాసిక్యూటర్ హాంగ్‌కాంగ్ కిన్ పరిచయం పార్క్ టై జీవితాన్నే మార్చేస్తుంది. పార్క్ టై కూడా శక్తివంతమైన ప్రాసిక్యూటర్‌గా మారే తరుణంలో దాని వెనుకున్న చీకటి కోణాలను చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు హన్ జే రిమ్ రూపొందించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. పార్క్ టై పాత్రలో జో ఇన్ సంగ్ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటిందీ చిత్రం.
న్యూ ట్రయల్
ఏ తప్పూ చేయకుండానే పది ఏండ్ల జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి వ్యథే ఈ సినిమా. తన అనుమతి లేకుండా పదేండ్ల విలువైన సమాయాన్ని, జీవితాన్ని దొంగిలించిన న్యాయవ్యవస్థను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి కథతో టై యున్ కిమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000వ సంవత్సరంలో జరిగిన ఇక్సాన్ మర్డర్ కేసు ఆధారంగా రూపొందిన చిత్రమిది. టాక్సీ డ్రైవర్ మర్డర్ కేసులో హున్ వూ ప్రత్యక్ష సాక్షి. కానీ ఆ హత్యకు అతనే కారణమని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంతేకాదు న్యాయస్థానం పదేండ్ల పాటు జైలు శిక్ష కూడా వేస్తుంది. అప్పుల ఊబిలో ఉన్న ఓ యువ లాయర్ ఈ కేసుని టేకప్ చేస్తాడు. ఈ నేపథ్యంలో కేసు గెలవడం కోసం ఆ యువ లాయర్ చేసే పోరాటం ఆద్యంతం ఆసక్తికరం. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. న్యాయం కోసం పోరాడే సన్నివేశాలు, నిందితుడి దీన స్థితిని ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు దర్శకుడు చూపించిన వైనం అద్భుతం. హున్ వూ పాత్రలో కాంగ్ హా నౌల్, లాయర్ పాత్రలో జంగ్ వూల నటన ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది.
బ్లూ బియర్డ్
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే చిత్రమిది. కన్స్ట్రక్షన్ అవుతున్న అపార్ట్మెంట్లో జరిగిన హత్య మిస్టరీగా మారుతుంది. ఈ క్రమంలో ఓ డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వస్తాడు. అతను నిద్రలో హత్యకు సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటాడు. దీంతో అపార్ట్మెంట్లో జరిగిన హత్యకు ఈ పేషెంటే కారణమని డాక్టర్ అనుమానిస్తాడు. ఆ తర్వాత ఆ పేషెంట్ కాకుండా ఆ పేషెంట్ కొడుకు దీనికి సూత్రధారి అనే అనుమానం డాక్టర్‌కి కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమా. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు సోయో యున్ లీ రూపొందించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో చో జిన్ వోంగ్, పేషెంట్ పాత్రలో షిన్ గూ, అతని కొడుకు పాత్రలో కిమ్ డే మైంగ్ల నటన ఆకట్టుకుంటుంది.
పార్ట్ టైమ్ స్పై
జాంగ్ యంగ్ సిల్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) ఏజెంట్. ఎన్ఎస్ఏ గురించి పాజిటివ్ ఆర్టికల్స్ రాసేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరుతుంది. మాజీ డిటెక్టివ్ నాజంగ్ యాన్‌తో కలిసి తమ బాస్ దగ్గర్నుంచి దొంగిలించబడిన వాయిస్ ఫిష్షింగ్ సిండికేట్ మనీని కనిపెట్టే అండర్ కవర్ ఆపరేషన్ చేపడతారు. మరి ఈ ఇద్దరు కలిసి అపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారా? ఆపరేషన్ డీల్ చేస్తున్న తరుణంలో ఈ ఇద్దరు లేడీ ఏజెంట్లు చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి డీక్ సూయో కిమ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
మిడ్నైట్ రన్నర్స్
హాంగ్ కి జున్ది లెక్క చేయని తత్వం. హీ యేల్ పుస్తకాల పురుగు. అంతేకాదు చాలా మృదు స్వభావి. విరుద్ధ భావాలు కలిగిన వీళ్ళిద్దరు కొరియన్ నేషనల్ పోలీస్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకుంటుంటారు. అనుకోకుండా ఓ రోజు ఓ కిడ్నాప్ ఇన్సిడెంట్ను ప్రత్యక్షంగా చూస్తారు. దాన్ని చేధించే క్రమంలో సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోవడం, అంతేకాదు అధికారులు సైతం వీరిని నిరాశపర్చడంతోపాటు ఈ కేసు తామే సొంతంగా పరిష్కరించాలని రంగంలోకి దిగుతారు. ట్రైనింగ్ క్యాంప్ నుంచి రాత్రి సమయంలో రహస్యంగా బయటికొచ్చి కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కిడ్నాపర్ల కోసం వెతికే క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర, ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. ఈ యాక్షన్ కామెడీ చిత్రాన్ని దర్శకుడు కిమ్ జు హాన్ రూపొందించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదలైన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. హీ యేల్ పాత్రలో సియో జూన్ పార్క్, హాంగ్ కి జున్ పాత్రలో పార్క్ సియో జూన్ నటన అలరించడంతోపాటు ఆలోచింపచేస్తుంది. హాంకాంగ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది.
వి.ఐ.పి
క్వాంగ్ ఇల్ నార్త్ కొరియన్ అధికారికి చెందిన తనయుడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వరుస హత్యలకు పాల్పడుతున్నట్టుగా అతన్ని అనుమానిస్తారు. ఈ నేపథ్యంలో ఆ హత్యలను ఆపడానికి సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇంటర్‌పోల్ అధికారులు చేసిన ప్రయత్నాలు ఏమిటి?, ఈ క్రమంలో చోటు చేసుకున్న భయానక, ఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. పార్క్ హీ సూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో పలు విమర్శలెదుర్కొంది. క్వాంగ్ ఇల్ పాత్రలో లీ జాంగ్ సక్ నటన మెప్పిస్తుంది.
ది బ్యాటిల్‌షిప్ ఐలాండ్
జపనీస్ వలసల కాలంలో హషిమా ద్వీపంలో సుమారు 400మంది కొరియన్ కార్మికులు నిర్భందంగా బొగ్గు గనుల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేయాల్సి వస్తుంది. అత్యంత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉన్న ఆ పని నుంచి, ఆ ద్వీపం నుంచి తమ జీవితాలను రక్షించుకునేందుకు, తమ స్వేచ్ఛ కోసం ఆ 400 మంది చేసే పోరాటమే ఈ చిత్రం. 1945లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సీంగ్ వాన్ ర్యు యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుని, కలెక్షన్ల పరంగానూ ఫర్వాలేదనిపించుకుంది.
ది మెర్సీలెస్
గ్యాంగ్స్టర్స్లోని స్నేహాన్ని, నమ్మకద్రోహాన్ని తెలిపే చిత్రమిది. జే హో ఒక గ్యాంగ్‌కి నాయకుడు. జైల్లో ఏదైనా సరే తాను చెప్పినట్టు నడిచేలా చేసుకుంటాడు. తన రూల్స్‌నే అందరు పాటించేలా చేసి, ఖైదీలందరినీ తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఆ టైమ్‌లో హున్ సూ అనే కొత్త ఖైదీ జైలుకొస్తాడు. జే హోతో స్నేహం పెంచుకుంటాడు. జైల్‌నుంచి బయటికొచ్చాక గ్యాంగ్స్టర్స్ ఆర్గనైజేషన్ మొత్తానికి తానే బాస్ కావాలనుకుంటాడు. హున్ని కలవడం వల్ల జే ఏం తెలుసుకున్నాడు, తను అనుకున్నట్టుగా మాఫియాకు బాస్ అయ్యాడా? లేదా అన్నది సినిమా. క్రైమ్ యాక్షన్ చిత్రాన్ని దర్శకుడు బైయున్ సుంగ్ హున్ రూపొందించారు. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు కేన్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. ఇందులో జే హో పాత్రలో సోల్ క్యుంగ్ గ్య్, హున్ సూ పాత్రలో ఇమ్ సి వాన్ల నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
Authorization