భావోద్వేగ పూరిత మెలోడ్రామాలకు నార్వే చిత్రాలు పెట్టింది పేరు. ఆసక్తికర కథలు, భిన్న ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ కూడా. ఆ చిత్రాల మాదిరిగానే నార్వే దేశంలోని లొకేషన్లు కూడా అద్భుతంగా ఉంటాయి. విశ్వవ్యాప్తంగా చాలా చిత్రాల షూటింగ్‌లు ఈ దేశంలో జరిగాయంటే అతిశయోక్తి లేదు. అందులో మన తెలుగు చిత్రాలూ ఉండటం విశేషం. భిన్న ప్రయోగాత్మక ఇతివృత్తాలతో తెరకెక్కి ప్రేక్షకులను అలరించిన కొన్ని నార్వే చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
హవాయి, ఓస్లో
ప్రజలు అనవసరంగా తమ హద్దులు దాటితే ఏం జరుగుతుందో ప్రతిబింబించే చిత్రమిది. విడర్ అనే వ్యక్తి సైకియాట్రిక్ హస్పిటల్లో నర్స్‌గా పని చేస్తూ రాత్రి సమయంలో కూడా మెలకువగానే ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే అతను నిద్రపోతే కలలు వస్తాయి.
ఆ కలల్లో జరగబోయే ప్రమాదాలు, ఘోరమైన సంఘటనలు వస్తుంటాయి. అవి నిజమవుతుంటాయి. ఈ నేపథ్యంలో నిద్ర పోకుండా అతనేం చేశాడు?, ఒకవేళ నిద్రపోయినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది సినిమా. ఎరిక్ పాపే రూపొందించిన ఈ సైకలాజికల్ డ్రామా చిత్రం 2004లో విడుదలై విశేషంగా ఆదరణ పొందింది.
విడర్గా ట్రాండ్ ఎస్పెన్ సీమ్ నటన ఆద్యంతం అలరిస్తుంది.
ట్రబుల్ వాటర్
చిన్నప్పుడు ఓ బాలుడిని హత్య చేసిన కేసులో జాన్ అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవిస్తాడు. పెరోల్ కింద కొన్ని రోజులకు విడుదలవుతాడు. తన గతాన్ని బయటకు రాకుండా, ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ ఓ చర్చ్‌లో ఉద్యోగం పొందుతాడు. తన టాలెంట్‌తో ఆ చర్చ్ పాస్టర్కి బాగా దగ్గరవుతాడు. ఈ క్రమంలో ఓ రోజు జాన్ టీచర్ జాన్‌ను గుర్తిస్తుంది. అతని గతాన్ని బహిర్గతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో అనంతరం చోటు చేసుకున్నఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. నీళ్ళలో జరిగే హత్యలకు, జాన్‌కు ఉన్న సంబంధమేంటనేది సస్పెన్స్. ఎరిక్ పాపే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2008లో విడుదలై ఆకట్టుకుంది. జాన్ పాత్రలో పాల్ సవర్ వల్హెమ్ హెగెన్ అద్భుతంగా నటించి మెప్పించారు.
వెగాస్
మన కుటుంబాన్ని మనం ఎంపిక చేసుకోలేం కానీ స్నేహితులను సంపాదించుకోగలమనే సందేశాన్ని తెలిపే చిత్రమిది. థామస్, మరియన్, టెర్జే ముగ్గురు యువతులు ఒకానొక దశలో సర్వస్వం కోల్పోతారు. తమ వారంతా దూరమవుతారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒక కుటుంబాన్ని పొందేందుకు, తమ కలలను నెరవేర్చుకునేందుకు చేసిన పోరాటం, సంఘర్షణ ఏంటనేది ఈ సినిమా కథాంశం. గున్నార్ వికీన్ దర్శకత్వంలో 2009లో రూపొందిన ఈ చిత్రం కుటుంబానికి, స్నేహానికి ఉన్న విలువను తెలియజేస్తుంది. థామస్ పాత్రలో జోర్గెన్ హాస్బెర్గ్ నిల్సెన్, మరియన్ పాత్రలో కరోలిన్ స్టెమెర్, టెర్జే పాత్రలో సిండ్రీ క్వాల్వాగ్ల నటన మెస్మరైజ్ చేయడంతోపాటు అందరినీ ఆలోచింపచేస్తుంది.
ఔట్ ఆఫ్ నేచర్..
మార్టిన్ జీవితం నిస్తేజంగా, బోర్‌గా సాగుతుంటుంది. తన ఆలోచనల్లో మార్పు రావడానికి, ఆధ్యాత్మిక పరమైన మార్పు కోసం ఒంటరిగా పర్వత ప్రాంత ప్రయాణానికి సిద్ధమవుతాడు. తనని తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి?, అతనిలో వచ్చిన మార్పు ఏంటి?, అతను తెలుసుకున్న విషయాలేంటి అనేది సినిమాలో ఆసక్తికరం, హాస్యభరితం కూడా. ముఖ్యంగా మానవత్వం, విలువలను తెలిపే ఈ చిత్రానికి ఓలె గియర్వర్ దర్శకత్వం వహించారు.
తన స్వీయ అనుభావాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించడంతోపాటు తనే మార్టిన్ పాత్రలో నటించి మెప్పించారు. 2014లో విడుదలైన ఈ కామెడీ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
హోమ్ సిక్
27 ఏండ్ల ఛార్లెట్ ఓ టీచర్. ఛార్లెట్, తన సోదరి హెన్రీక్ చాలా రోజుల తర్వాత కలుస్తారు. వారి మధ్య ఆకర్షణ పెరుగుతుంది. కుటుంబ వ్యవస్థలు, అందులోని నియమ, నిబంధనలు.. ఇలా అన్నింటిని బ్రేక్ చేస్తూ ఒకరికొకరు దగ్గరవుతారు. శారీరకంగానూ కలుస్తారు. ఇద్దరే ఇంట్లో ఉంటూ అంతకు ముందు పొందని కొత్త అనుభూతులను పొందడమే ఈ చిత్ర కథ. విభిన్న కథాంశంతో 2015లో వచ్చిన ఈ సినిమా టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో కాంటెంపరరీ వరల్డ్ సినిమా విభాగంలో ప్రదర్శితమై ప్రశంశలందుకుంది. అలాగే విదేశీ విభాగంలో ఆస్కార్‌కు పంపబడింది. అన్నే సెవిట్క్సీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చార్లెట్ పాత్రలో ఇనే మేరీ విల్మాన్, హెన్రిక్ పాత్రలో సైమన్ జె.బెర్గెర్లు తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.
ది బ్రదర్సమ్ మ్యాన్
40ఏండ్ల వయసున్న ఆండ్రియా ఒక వింతైన నగరానికి వస్తాడు. అక్కడికి ఎలా వచ్చాడనేది అతనికి తెలియదు. మెమరీ లాస్ అవుతుంది. ఓ అపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ తన భార్యతో జీవిస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత తాను ఉండే ప్లేస్‌లో ఏదో తప్పు జరుగబోతుందని, ఆ వింత నగరం నుంచి పారిపోవాలని భావిస్తాడు. కానీ వెళ్లలేకపోతాడు. గోడలను పగుల గొట్టే వ్యక్తిని కలిసి, గోడలను పగులగొట్టి పారిపోయేందుకు ఆండ్రియా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆండ్రియాకు తగిలిన ఎదురుదెబ్బలు, ప్రమాదాలు, అతను అలా ప్రవర్తించడానికి కారణమేంటన్నది సినిమా. జేన్స్ లియాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2006లో విడుదలై ఒక కొత్త రకమైన చిత్రంగా విమర్శకులతో అభివర్ణించబడింది. ఇందులో ఆండ్రియా పాత్రలో ట్రెండ్ ఫౌసా ఔర్గ్వ్ నటన కడుపుబ్బా నవ్విస్తూనే ఆద్యంతం కట్టిపడేస్తుంది.
బ్రేవ్‌హార్ట్స్
2012లో వచ్చిన డాక్యుమెంటరీ చిత్రమిది. వివిధ పార్టీలకు చెందిన నలుగురు యువకులు దేశంలో రాజకీయ పరమైన మార్పు కోసం పాటుపడుతుంటారు. 69 మందితో కూడిన లేబర్ పార్టీల నాయకులు ఎలక్షన్ల సందర్భంగా క్యాంపెయిన్ చేపడతారు. 2011 జులై 22న ఉటోయా ద్వీపంలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేయటంతోపాటు కిరాతకంగా కాల్పులు జరుపుతారు. దీంతో సుమారు 77 మంది చనిపోతారు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన అక్కడి రాజకీయాలను ఎలా మలుపు తిప్పిందనే ఇతివృత్తంతో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. కరీ అన్నె మొయి దర్శకత్వంలో 2012లో రూపొందిన ఈ డాక్యుమెంటరీ చిత్రంలో హెన్రిక్ వాంగ్బర్గ్, సానా ఎల్ మొరాబిట్, జోహన్న బుట్టెన్స్బోన్ లిండ్హీమ్, హాకాన్ వెడమ్ వంటి తదితర ప్రధాన నటీనటుల నటన ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.
రిప్రైజ్
సాహిత్య రంగంలో ఉన్నత స్థాయికి చేరాలనుకునే ఇద్దరు స్నేహితుల జీవిత గమనాన్ని తెలిపే చిత్రమిది. ఎరిక్, ఫిలిప్స్ మంచి స్నేహితులు. ఇద్దరూ సాహిత్య ఆకాంక్షలు కలిగినవారే. తాము రాసిన సాహిత్యాన్ని పుస్తకరూపంలోకి తీసుకురావాలనుకుంటారు. అందులో నార్వే సంస్కృతిని ప్రతిబింబించేలా ఫిలిప్స్ రాత ప్రతులుండటంతో పబ్లిషింగ్ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఎరిక్‌కు ఆ స్థాయి ప్రతిభ లేకపోవడంతో అతని సాహిత్యాన్ని తీసుకోరు. దీంతో ఎరిక్ మళ్ళీ మళ్లీ ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు ఫిలిప్స్ రాసిన అద్భుత సాహిత్యం పుస్తక రూపంలోకి రావడం, దానికి మంచి ఆదరణ రావడంతో రాత్రికి రాత్రే మంచి పేరు సొంతం చేసుకుంటాడు. ఆరునెలల తర్వాత ఎరిక్, అతని స్నేహితులు ఆస్పత్రిలో సైక్రియాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫిలిప్ వద్దకు వెళతారు. మరి ఫిలిప్ అలా మారడానికి కారణమేంటి?, తిరిగి తనని రైటర్‌గా మార్చేందుకు స్నేహితుడు ఎరిక్ ఏం చేశాడన్నదే సినిమా. జోచిం ట్రైయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2008లో విడుదలై విశేష ఆదరణ పొందింది. ఆస్కార్ నామినేషన్‌కు పంపబడింది. ఫిలిప్ పాత్రలో అండెర్స్ డానియెల్సెన్ లీ, ఎరిక్ పాత్రలో ఎస్పెన్ క్లోమాన్ హాయ్నేర్ నటన ఆద్యంతం అద్భుతం.
లౌడర్ థెన్ బాంబ్స్
వార్ ఫొటోగ్రాఫర్‌గా ఫేమసైన ఓ మహిళ భార్యగా, తల్లిగా, ఫొటోగ్రాఫర్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులుంటారు. ఓ రోజు అనుకోకుండా జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోతుంది. దీంతో వాళ్ళ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. ఏమీ తోచని స్థితిలో ఉంటారు. తండ్రి, ఇద్దరు కుమారులు ఆమె జ్ఞాపకాలతో బతుకుతుంటారు. ఈ క్రమంలో వారి భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని స్పృశిస్తాయి. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది సినిమా. ఈ నార్వే డ్రామా చిత్రాన్ని దర్శకుడు జోచిం ట్రైయర్ ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కించారు. ఈ చిత్రం కేన్స్‌లో ప్రదర్శితమైంది. 2015లో విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణతోపాటు కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. ఇందులో ఫొటోగ్రాఫర్ పాత్రలో ఇసబెల్లా హప్పర్ట్ నటించగా ఇతర పాత్రల్లో జెస్సీ ఇసేన్బెర్గ్, గాబ్రియేల్ బైరన్, డేవిడ్ స్ట్రతైర్న్ నటించి అలరించారు.
ఓస్లో ఆగస్ట్ 31
డ్రగ్స్‌కి బానిసైన ఆండర్స్ అనే కుర్రాడు డ్రగ్స్ నుంచి బయటపడేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ట్రీట్మెంట్ తర్వాత కొత్త ఉద్యోగం కోసం ఓ రోజు సెలవు పెట్టి ప్రయత్నిస్తున్న సమయంలో ఓస్లోలో ఉండే పాత స్నేహితులను కలుస్తాడు. దీంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. ఆండర్స్ ఒక్క రోజు జీవితాన్ని ప్రతిబింబించే ఈ చిత్రాన్ని దర్శకుడు జోచిం ట్రైయర్ 'విల్ ఓ ది విస్ప్' అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం విజయం సాధించడంతోపాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అలాగే ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికైంది. ఇక ఆండర్స్ పాత్రలో ఆండర్స్ డేనియల్సెన్ లీ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది.
గర్ల్స్
నార్వేలోని టీనేజ్ అమ్మాయిల జీవన చిత్రాన్ని తెలియజేసిన సినిమా. ఇసెలిన్, మెహ్సతోపాటు మరికొంత మంది స్నేహితుల గ్యాంగ్ ఉంటుంది. ఇసెలిన్, మెహ్స బెస్ట్ ఫ్రెండ్స్. విభిన్న నేపథ్యాలతో పెరుగుతారు. తనలోని భావాలను బయటికి చెప్పుకోలేని మనస్తత్వంతో ఇసెలిన్ ఉంటే, మెహ్స మాత్రం చాలా రెబల్. చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. మరి వీళ్ళిద్దరి జర్నీ ఎలా సాగింది. ఈ టీనేజ్ అమ్మాయిలు బారుఫ్రెండ్స్ని, తల్లిదండ్రులని, స్కూల్‌ని, ఆల్కాహాల్‌ను ఎలా డీల్ చేశారనేది కథ. అత్యంత క్రూరంగా సాగే కథాంశంతో దర్శకుడు హర్నె మైరిన్ ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని 2007లో రూపొందించారు.
వన్ నైట్ ఇన్ ఓస్లో
సామ్, అమిర్ 15ఏండ్ల వయసున్న టీనేజ్ కుర్రాళ్ళు. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. నార్వే లిబరేషన్ డే (మే 17) రోజు రాత్రి ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉండాలని, అందుకోసం ఏదైనా చేయాలని ఈ స్నేహితులిద్దరూ నిర్ణయించుకుంటారు. అంతేకాదు వాళ్ళ స్నేహానికి పరీక్ష పెట్టుకుంటారు. ఈ క్రమంలో అమిర్ తన మాజీ ప్రియురాలికి తిరిగి దగ్గరవ్వాలనుకుంటాడు. కానీ ఆమె సామ్‌కు దగ్గరవ్వాలనుకుంటుంది. దీంతో ఈ ఇద్దరు స్నేహితుల ప్రవర్తనలో వచ్చిన మార్పేంటి?, వీరి స్నేహం ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. ఎరిక్ స్వేన్సన్ దర్శకత్వంలో 2014లో రూపొందిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అమిర్ పాత్రలో మహ్మద్ ఆల్ఘౌల్, సామ్ పాత్రలో సమాకాబ్ ఒమర్, ప్రియురాలి పాత్రలో థియా సోఫీ లోచ్ల నటన ఆద్యంతం కనువిందు చేస్తుంది.
నెక్ట్స్ డోర్
జాన్ తన ప్రియురాలు నుంచి దూరమవుతాడు. అదే సమయంలో పక్కింట్లో ఉండే ఇద్దరు అందమైన అమ్మాయిలు అన్నె, కిమ్‌లు జాన్ని ఎట్రాక్ట్ చేస్తారు. దీంతో వాళ్లుండే ఇంట్లోకి జాన్ వెళతాడు. అదంతా ఓ మిస్టరీ అపార్ట్మెంట్. ఆ అమ్మాయిలు, అక్కడి పరిస్థితులు నిజమా, కాదా? అనేది అర్థం కాదు. అంతా మిస్టరీగా ఉంటుంది. దాన్నుంచి బయటపడేందుకు డెడ్లీ గేమ్ ఆడాల్సి వస్తుంది. అత్యంత క్రూరమైన, భయానక పరిస్థితుల్లో ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు జాన్ చేసిన పోరాటమే ఈ చిత్రం. పాల్ స్లెట్యూన్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం 2005లో విడుదలై ఘన విజయం సాధించింది. జాన్ పాత్రలో క్రిస్టోఫర్ జోనర్, కిమ్ పాత్రలో జులియా స్కాట్, అన్నె పాత్రలో అన్నె బాచె విగ్‌ల నటన అబ్బురపరుస్తుంది.
హెడ్ హంటర్
రోజర్ బ్రౌన్ కార్పొరేట్ కంపెనీల్లోని ఉద్యోగాలకు సరైన అభ్యర్థులను కనిపెట్టే ఉద్యోగంతోపాటు పార్ట్‌టైమ్‌గా దొంగలను పట్టించేందుకు పెయింటింగ్ వేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. ఈ క్రమంలో క్లాస్ గ్రెవ్స్ అనే మాజీ మిలటరీకి చెందిన సభ్యుడు రోజర్ కెరీర్‌ను నాశనం చేయాలనుకుంటాడు. ఈ రివేంజ్‌తో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. మోర్టెన్ టైల్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయం సాధించింది. 2011లో విడుదలై విమర్శకుల ప్రశంసలతోపాటు అనేక అవార్డులనూ అందుకుంది. రోజర్ పాత్రలో అకేల్ హన్నీ, క్లాస్ గ్రెవ్ పాత్రలో నికోలజన్ కోస్టర్లు తమదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.
Authorization