భిన్న కాన్సెప్ట్‌లకు, వైవిధ్యమైన కథనాలకు, ప్రయోగాత్మక గ్యాంగ్‌స్టర్ చిత్రాలకు కేరాఫ్ బ్రెజిల్ చిత్రాలు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భావోద్వేగాలను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించడంలోనూ ఈ దేశ చిత్రాలు ఓ ప్రత్యేకత చాటుకున్నాయి. ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలతోపాటు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన కొన్ని బ్రెజిల్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
గెటులియో
ఇది దేశ అధ్యక్షుడికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న వార్తాపత్రిక అధినేత మధ్య వైరుధ్యం నేపథ్యంలో సాగుతుంది. ప్రధానంగా 1954 ఆగస్టు 24 రోజున సాగే కథ ఇది.
అధ్యక్షుడు గెటులియోకు దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వార్తా పత్రిక యాజమాని కార్లాస్ లేకెడ్రా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటాడు. ఈ క్రమంలో దేశ అధ్యక్షుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తాడు. దీంతో దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంటుంది. అనంతరం వార్తా పత్రిక అధినేత హత్యకు ప్లాన్ చేస్తారు.
ఆ తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. 2014లో వచ్చిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రాన్ని జాహవో జార్డిమ్ రూపొందించారు. గెటులియో పాత్రలో టోనీ రామోస్, పత్రికా అధినేత పాత్రలో అలెగ్జాండర్ బోర్జెస్ నటించి మెప్పించారు.
నియాన్ బుల్..
ఇరెమర్ నార్త్ ఈస్ట్ బ్రెజిట్లో రొడియోలో పనిచేస్తుంటాడు. తన ట్రక్‌తో పశువులను ఇతర ప్రాంతాలకు ట్రాన్ఫోర్ట్ చేయడం అతని పని. ఎప్పటికైనా బట్టల వ్యాపారం ప్రారంభించాలని,
క్లబ్ డాన్సర్లకు సూట్ అయ్యే దుస్తులు కుట్టాలనేది అతని కల.
మరి దాన్ని సాధించేందుకు ఏం చేశాడనేది ఈ చిత్ర ఇతివృత్తం.
ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రాన్ని గాబ్రియెల్ మాస్కరో
2015లో రూపొందించారు. వెనిస్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ఈ చిత్రం పలు అవార్డులను దక్కించుకుంది.
ఇందులో ఇరెమర్ పాత్రలో జూలియనో కజారే నటించారు.
అమాయకత్వం, ఆశయం మేళవింపుగా సాగే అతని నటన ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.
కిల్ మీ ప్లీజ్
రియో డి జెనీరియోలోని వెస్ట్ సైడ్ జోన్లో ఓ రోజు రాత్రి
ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. ఆ అమ్మాయిని ఎవరు చంపారనేది తెలియదు. దీంతో అక్కడున్న కుర్రాళ్ళకు భయం పట్టుకుంటుంది.
తమకి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడుతుంటారు.
ఈ క్రమంలో పదిహేనేండ్ల అమ్మాయి బియా ఏం చేసింది?,
హత్యకు సంబంధించి ఆమె ఎలాంటి సమాచారం కనుక్కుంది?,
హత్యల వల్ల ఆమెలో వచ్చిన మార్పేంటి అనేది ఈ సినిమా.
ఈ థ్రిల్లర్ డ్రామా చిత్రాన్ని అనితా రోచా డా సిల్వెరియా రూపొందించారు. ఆమెకిది తొలి చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం 2015లో విడుదలై ఆకట్టుకుంది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొని ప్రశంసలందుకుంది. ఇందులో బియా పాత్రలో వేలెంటినా
నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది.
బారు అండ్ ది వరల్డ్
ఇదొక నవ్యమైన యానిమేషన్ చిత్రం.
ఆధునిక ప్రపంచంలో ఓ చిన్న కుర్రాడు తన తండ్రి అన్వేషణ కోసం సాగించిన సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రం కథాంశం.
ఆధునిక సమాజంలోని అనేక సమస్యలను, ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చే ప్రమాదాలను, ఆర్థిక వ్యవస్థలోని లోపాలను, సౌకర్యాలను ఈ చిత్రం ప్రతిబింబించింది.
నేటి తరానికి మంచి సందేశాన్నిచ్చిన ఈ సినిమాను అలీ అబ్రేయు రూపొందించారు.
డ్రాయింగ్, పెయింటింగ్, డిజిటల్ యానిమేషన్ సమ్మేళనంగా దర్శకుడు అలీ 2013లో
ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ప్రశంసలతోపాటు పలు అవార్డులనూ అందుకుంది. అలాగే ఆస్కార్‌కి కూడా నామినేట్ అయ్యింది.
ఆర్టిఫిషియల్ ప్యారడైజ్
ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి జీవితాన్ని తెలిపే చిత్రమిది. బ్రెజిల్లో ఆర్ట్, ఆల్టర్నేటివ్ కల్చర్‌కు సంబంధించి ఓ భారీ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ విభిన్న నేపథ్యాలకు చెందిన కుర్రాడు నండో, అమ్మాయిలు ఎరికా, లారా స్నేహితులవుతారు. ఎరికా డీజే నిర్వాహకురాలు. ఈ ముగ్గురు బాగా ఎంజారు చేస్తారు, డ్రగ్స్, రొమాన్స్ ఇలా అన్ని విషయాల్ని ఆస్వాదిస్తారు. కొద్ది రోజులకు విడిపోతారు.
ఆ తర్వాత చాలా గ్యాప్‌తో ఎరికా, నాండో కలుస్తారు. ప్రేమలో పడతారు. అట్నుంచి ఈ ముగ్గురు జీవితంలో వచ్చిన రాడికల్ ఛేంజెస్ ఏంటనేది సినిమా. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ మ్యూజికల్ రాక్ చిత్రాన్ని మార్కోస్ ప్రాడో రూపొందించారు. 2012లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఎరికాగా నతిలియా డిల్, లారాగా లియా డి బ్యూనో, నండోగా లూకా బియాంచీల నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
అబ్సెన్స్
బాల్య దశ నుంచి యవ్వన దశలోకి మారుతున్న తరుణంలో ఓ టీనేజ్
కుర్రాడి జీవితాన్ని తెలిపే చిత్రమిది. సెర్గిన్హో కు తల్లితోపాటు ఐదేండ్ల సోదరుడు ఉంటాడు. ఓ స్ట్రీట్ మార్కెట్లో జాబ్ చేస్తుంటాడు. జీవితం చాలా రొటీన్‌గా సాగుతుంది. అతనికి ముడిన్హో, సెల్విన్హతో మంచి స్నేహం ఉంటుంది. అదే సమయంలో తన ప్రొఫెసర్‌తో సెక్స్, ఎఫెక్షన్ విషయంలో సంక్షిష్టమైన అనుబంధం కలిగి ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆ కుర్రాడి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. ఫ్యామిలీ, సెక్స్, ఎమోషన్స్‌ను ఎలా డీల్ చేశాడనేది సినిమా. చికో టెక్షీరారా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో వచ్చి విశేష ఆదరణ పొందింది. సెర్గిన్హో పాత్రలో మాథ్యూస్ ఫగుందెస్ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది.
హార్డ్ లేబర్
హెలేనా అనే ఇల్లాలికి కిరాణ షాప్ ప్రారంభించాలనేది ఓ కల. ఎట్టకేలకు ఓ మంచి ప్లేస్‌లో షాప్ ప్రారంభిస్తుంది. తన కూతురిని, ఇల్లును చూసుకోవడానికి ఓ పని మనిషిని కూడా పెడుతుంది. పని చేస్తున్న బీమా కంపెనీలో ఇబ్బందులు తలెత్తడంతో హెలేనాపై తరచూ భర్త కోప్పడుతుంటాడు. దీంతో కుటుంబ భారమంతా హెలేనా మీదే పడుతుంది. ఇదిలా ఉంటే, పని మనిషి నుంచి కూడా సమస్యలెదురవుతాయి. ఈ నేపథ్యంలో హెలేనా వ్యాపారానికి ఎదురైన అడ్డంకులను ఎలా ఎదుర్కొందనేది సినిమా. జూలియానా రోజస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2011లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. కేన్స్‌లోనూ ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. హేలేనా పాత్రలో హెలేనా ఆల్బర్గారియా, ఆమె భర్త పాత్రలో మారాట్ డెస్కార్టస్, పని మనిషి పాత్రలో గిల్డా నోమక్కెల నటన ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంది.
ది క్లౌన్
తండ్రీ కొడుకులు వల్డెమర్, బెంజమిన్ బ్రెజిల్లో ఊరూర తిరుగుతూ సర్కస్ నిర్వహిస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. ఓ అడ్రస్ లేకుండా, తమ కంటూ ఓ ప్లేస్ లేకుండా, ఇరుగుపొరుగు అనేవారు లేకుండా ఊరూర తిరగడమనేది కొడుకైన బెంజమిన్‌కు నచ్చదు. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు, తనకంటూ ఓ నివాస స్థలం, ఇరుగుపొరుగు సంబంధబంధావ్యాల కోసం తండ్రి బాటలో కాకుండా బెంజమిన్ ఏం చేశాడు?, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో సర్కస్ ద్వారా ప్రజలకు ఎంత దగ్గరయ్యాడనేదే ఈ సినిమా. ఆద్యంతం వినోదభరిత డ్రామాతో సాగే ఈ చిత్రానికి సెల్టన్ మెల్లో దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతోపాటు ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికైంది. తండ్రి పాత్రలో పాలో జోస్‌గా నటించగా, కొడుకు బెంజమిన్ పాత్రలో చిత్ర దర్శకుడు స్టెలన్ మెల్లోనే నటించడం విశేషం. ఆయన నటన ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.
ది వే హి లుక్స్
లియోనార్డో అంధుడు. చూపు లేకపోవడంతో వాళ్లమ్మ అతి జాగ్రత్తగా చూసుకుంటుంది. లియోనార్డో దీన్నుంచి బయటపడి స్వతంత్ర జీవితం గడపాలనుకుంటున్న తరుణంలో తన క్లాస్‌లో ఓ కొత్త కుర్రాడు గాబ్రియెల్ జాయిన్ అవుతాడు. తను చాలా తెలివైన, చురుకైన కుర్రాడు. లియోనార్డోతో స్నేహం చేస్తాడు. కొద్ది రోజుల్లోనే వీళ్ళిద్దరు మంచి స్నేహితులవుతారు. లియోనార్డోను గాబ్రియెల్ తనతోపాటు బయటికి తీసుకెళ్ళి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. సమాజంలోని పరిస్థితులను, పరిసరాలను వివరిస్తాడు. లియోనార్డోలో కొత్త ఉత్తేజానిస్తాడు. అనంతరం ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, వీళ్లిద్దరి జర్నీ ఎలా సాగిందనేది సినిమా. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో సాగిన ఈ చిత్రాన్ని డేనియల్ రిబినో రూపొందించారు. 2014లో విడుదలై బెర్లిన్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. అలాగే ఆస్కార్ నామినేషన్‌కూ ఎంపికైంది. లియోనార్డో పాత్రలో గిల్హెర్మ్ లోబో, గాబ్రియెల్ పాత్రలో ఫాబియో ఆడి, గియోవనా పాత్రలో టెస్ అమోరిమ్ల నటన ప్రేక్షక హృదయాలను స్పృశిస్తుంది.
హెలెనో
బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు హెలెనో డీ ప్రీటస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. 1940 టైమ్‌లో హెలెనో హైలీ టాలెంటెడ్ ఫుట్‌బాల్ ప్లేయర్. బోటఫోగో (ఫుట్‌బాల్ టీమ్) నుంచి ప్రాతినిధ్య వహించి, కెరీర్లో 209 గోల్స్ చేసి రికార్డు సృష్టించాడు. ప్రతిభావంతమైన ఆటగాడైనప్పటికీ విధ్వంసకరమైన అతని ప్రవర్తననే కెరీర్ పరంగా మనుగడ లేకుండా చేసింది. దీంతోపాటు హెలెనో జీవితంలోని ఆసక్తికర అంశాలను మేళవించి 2011లో ఈ చిత్రాన్ని రూపొందించారు. జోస్ హెన్రికా ఫోన్సెకా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది.
ది హౌస్ ఆఫ్ సాండ్
1910 టైమ్‌లో బ్రెజిల్‌కు చెందిన మరన్హో సమీపంలోని ఎడారి ఇసుక ప్రాంతంలో మూడు తరాలకు చెందిన ముగ్గురు మహిళలు ఎదుర్కొన్న సవాళ్ళని తెలిపే చిత్రమిది. మారియా బ్రెజిల్‌లోని ఓ ప్రాంతంలో ఏడారి ఇసుక దిబ్బల్లో నివసిస్తుంటుంది. ఆమెతోపాటు తల్లి, కూతురు ఉంటారు. భర్త చనిపోవడంతో ఈ ముగ్గురు తమ జీవితాన్ని ఎలా గడిపారు. అక్కడికి వచ్చిపోయే మగాళ్ళతో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. మనుగడ కోసం వాళ్లు చేసే పోరాటమే ఈ చిత్రం. నిరాశ, నిస్పృహల మధ్య తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు దొరకని గడ్డు పరిస్థితుల్లో వాళ్ళు అనుభవించిన దుర్భర పరిస్థితులకు ఈ చిత్రం అద్దం పట్టింది. ఆండూచా వాద్దింగ్టన్ దర్శకత్వంలో రూపొంది 2005లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. మారియా పాత్రలో ఫెర్నాండా టోర్రెస్, ఆమె తల్లి పాత్రలో ఫెర్నాండా మాంటేనెగ్రో, కూతురు పాత్రలో రురు గెర్రా నటించి మెప్పించారు.
టు మై బిలవ్డ్
భార్యాభర్తల అనుబంధాన్ని తెలిపే చిత్రమిది. భార్య చనిపోవడంతో ఫెర్నాండో ముభావంగా మారిపోతాడు. కొడుకు డానియెల్ ఉన్నప్పటికీ ఒంటరి ఫీలింగ్‌తో ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటాడు. కొడుకు రాత్రి నిద్రపోయాక భార్య గదిలోకి వెళ్ళి ఆమె దుస్తులు, ఇతర వస్తువులను స్పృశిస్తూ ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విహెచ్ఎస్ క్యాసెట్లో చూసిన సంఘటనలు అతని జీవితాన్ని మార్చేస్తాయి?, ఆ క్యాసెట్లో ఏముందనేది మాటల్లో కంటే వెండితెర మీద చూడాల్సిందే. అలీ మురితిబా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2015లో విడుదలై విశేషంగా అలరించింది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై పురస్కారాలనూ సొంతం చేసుకుంది. ఫెర్నాండో పాత్రలో ఫెర్నాండో అల్వెస్ పింటో నటన ప్రేక్షకులను మైమరపిస్తుంది.
ఏ ఊల్ఫ్ ఎట్ ది డోర్
ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. సిల్వియా, బెర్నాడ్రో భార్యాభర్తలు. ఓ రోజు వాళ్ళ బాబు కిడ్నాప్ అవుతాడు. రోసా అనే అమ్మాయే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు అనుమానిస్తుంటారు. మరి కిడ్నాప్‌కు, రోసాకు, రోసాతో బెర్నాడ్రోకు ఉన్న సంబంధం ఏంటనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో సిల్వియా, బెర్నాడ్రో, రోసా ముగ్గురులో ఉండే కోరికలు, అసత్యాలు, అవసరాలు, బలహీనతలను ప్రతిబింబించేదే ఈ సినిమా కథాంశం. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఫెర్నాండో కోయింబ్రా రూపొందించారు. సిల్వియా పాత్రలో ఫాబిలా నస్కింటో, రోసా పాత్రలో లియాండ లీల్, బెర్నాడ్రో పాత్రలో మిలెం కోర్టాజ్లు పలికించే భావోద్వేగాలు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తాయి. 2013లో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది.
రీచింగ్ ఫర్ ది మూన్
విభిన్న నేపథ్యాలు కలిగిన మహిళా ప్రేమికుల విషాద ప్రేమ కథను తెలిపే చిత్రమిది. అమెరికన్ కవయిత్రి ఎలిజబెత్ బిషప్, బ్రెజిలియన్ ఆర్కిటెక్ లోటా డీ మెకాడె సోర్స్ ప్రేమలో పడతారు. 1951 నుంచి 1967 మధ్య వీరి ప్రేమ ఎలా సాగింది?, బిషప్ తన అభిరుచిని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసింది. ఈ క్రమంలో ప్రియురాలు లోటా వల్ల ఆమె లైఫ్ ఎలాంటి ఒడిదుడుకులకు లోనైందనేది సినిమా ఇతివృత్తం. ప్రేమికులుగా బిషప్, లోటాల భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని స్పృశిస్తాయి. 2013లో వచ్చిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రాన్ని బ్రూనో బర్రెటో రూపొందించారు. బిషప్ పాత్రలో మిరాండ ఒట్టో, లోటా పాత్రలో గ్లోరియా పైరెస్ నటన ప్రేక్షకులను అలరిస్తుంది. పలు ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలతోపాటు అవార్డులనూ కైవసం చేసుకుంది.
Authorization