తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలను వెండితెరపై ఆవిష్కరించడంలో తైవాన్ చిత్రాలు మంచి గుర్తింపు పొందాయి. చెప్పదల్చుకున్న అంశాలకు ఫిలాసఫికల్ టచ్ ఇవ్వడం మరో ప్రత్యేకత. వైవిధ్యమైన చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ విశేష ప్రేక్షకాదరణ పొందిన కొన్ని తైవాన్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
దీదీ డ్రీమ్
తన సోదరిలా సూపర్ స్టార్ అవ్వాలని నటి దీదీ కలలు కంటుంది. తన ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నం కొనసాగిస్తుంటుంది. ఈ క్రమంలో నూడిల్ షాప్ నిర్వహిస్తున్న చున్మీ ఆమెకు పరిచయం అవుతుంది. తన ప్యాషన్‌ను, లక్ష్యాలను షేర్ చేసుకున్న దీదీని చున్మీ ఎగతాళి చేస్తుంటుంది. ఈ ఇద్దరి జీవితాల్లో చోటు చేసుకున్న మలుపులేెంటి, తమ లక్ష్యాలను చేరుకున్నారా? లేదా అనేది మిగిలిన సినిమా. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు కెవిన్ సాయి రూపొందించారు. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే ఈ చిత్రంలో దీదీగా, చున్మీగా డీ హుసు ద్విపాత్రాభినయం చేసి తనదైన నటనతో మెప్పించింది. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్‌గానూ అలరించింది.
ది విలేజ్ ఆఫ్ నో రిటర్న్
అన్నింటికీ సుదూరంగా ఉన్న ఓ గ్రామంలో ప్రజలు చాలా ఇబ్బందులతో నివసిస్తుంటారు. రహస్య తైవాన్ పూజారి ఓ మెడికల్ (మ్యాజికల్) పరికరాన్ని తీసుకొచ్చి, దానితో ప్రజల సమస్యలను, ఆందోళనలను తొలగిస్తానని చెబుతాడు. అంతే నిజాయితీగా ఆ పరికరంతో వారి పాత జ్ఞాపకాలను, గతాన్ని మరచిపోయేలా చేస్తాడు. దీంతో గ్రామస్థులంతా సంతోషంగా ఉంటారు. కానీ దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంటుంది. ప్రజల్ని అమాయకుల్ని చేసి, తప్పుదారి పట్టించి వారిని దోచుకునేందుకు, వారిపై దాడి చేసేందుకు బందిపోట్లు పన్నిన పన్నాగమిది. ఈ నేపథ్యంలో గతాన్ని మరచిపోయిన ఆ ప్రజలు బందిపోట్లను ఎలా ఎదుర్కొన్నారు?, ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది సినిమా. గతం నుంచి తప్పించుకోవచ్చు కానీ విధి నుంచి తప్పించుకోలేం అనే ఇతివృత్తంతో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి చెన్ యు సూన్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం పలు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది.
ది మిస్టీరియస్ ఫ్యామిలీ
వరుస హత్యలకు గురైన ఓ కుటుంబానికి సంబంధించిన విషాధ గాథను తెలిపే చిత్రమిది. మియావో అనే యువతి తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా వింతైన అపరిచితుడి వల్ల లైంగిక దాడికి గురవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే తల్లిదండ్రులు, సోదరుడు దారుణంగా హ్యతకు గురవుతారు. జరిగిన దారుణం నుంచి క్రమంగా కోలుకున్న మియావో తన కుటుంబ సభ్యుల హత్యలకు కారణాలను, అందుకు కారకులను పట్టుకోవడం కోసం చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. సస్పెన్స్ డ్రామా చిత్రాన్ని దర్శకుడు పార్క్ యు హ్వాన్ 2014లో జరిగిన ఓ కేసు ఆధారంగా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో మియావో పాత్రలో ఏరియల్ లిన్ నటించి మెప్పించారు.
52 హెడ్జ్ ఐ లవ్ యూ
విభిన్నమైన పలు ప్రేమ కథలను తెలిపే చిత్రమిది. ప్రేమికుల రోజున ఆధునిక తైపీ సిటీలో చోటు చేసుకున్న ప్రేమ కథలకు సంగీతాన్ని జోడించి అత్యద్భుతంగా రూపొందించారు. ఏక కాలంలో వివిధ రకాల ప్రేమ జంటల ఫీలింగ్స్, ఎమోషన్స్‌ను ప్రతిబింబించే ఈ చిత్రంలో 18 పాటలుండటం విశేషం. సంగీతం సైతం మధురానుభూతిని కలిగించడం ఈ చిత్ర ప్రత్యేకత. 'ది వరల్డ్ లోనిలియెస్ట్ వేల్' (52 హెడ్జ్ వేల్) ఆధారంగా చిత్ర టైటిల్‌ను నిర్ణయించారు. ఈ మ్యూజికల్ డ్రామా చిత్రాన్ని వీ ఈ షెంగ్ తెరకెక్కించారు.
అవర్ టైమ్
ఇది ఓ మహిళకు సంబంధించి 20 ఏండ్ల జర్నీని తెలిపే చిత్రం. లిన్ హార్డ్ వర్కర్. తన సహోద్యోగి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మ్యూజిక్ వింటుంది. అలనాటి పాపులర్ సింగర్ ఆండీ లూ పాటలు వింటున్న క్రమంలో గతంలోని స్కూల్ డేస్‌లోకి వెళ్తుంది. అక్కడ లిన్ ప్రేమాయణం ఎలా సాగింది?, ప్రేమ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను ఎలా అధిగమించింది?, లిన్ ప్రేమలోని మలుపులు ఈ చిత్రంలో ఆసక్తికరం. రియల్ లైఫ్‌లో ప్రత్యక్ష్యంగా గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఫ్రాంకీ చెన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం 2015లో విడుదలై విశేష ప్రశంసలందుకుంది. రికార్డు కలెక్షన్లను సాధించింది. ఇందులో లిన్ చిన్ననాటి పాత్రలో జోయి చెన్, యువతి పాత్రలో వివియన్ సంగ్ నటించారు. ఈ చిత్రం క్రిటికల్‌గా ప్రశంలందుకోవడంతోపాటు పలు అవార్డులనూ సొంతం చేసుకుంది.
బ్లాక్ అండ్ వైట్
కల్పిత నగరంలో జరిగే అక్రమాలను అడ్డుకోవడానికి మరో డిటెక్టివ్‌తో కలిసి ఓ పోలీస్ అధికారి చేసే పోరాటమే ఈ చిత్రం. సాయి యు హ్యూన్న్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2012లో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'బ్లాక్ అండ్ వైట్: ది డాన్ ఆఫ్ జస్టిస్' అనే చిత్రం 2014లో వచ్చింది. నగరంలో భారీ స్థాయిలో క్రైమ్ జరుగుతుంటుంది. క్రైమ్‌ను అడ్డుకోవడానికి సిటీకి చెందిన ప్రముఖ పోలీస్ అధికారి మరో వ్యక్తితో కలిసి టీమ్‌గా ఏర్పడతాడు. అతన తనకు పూర్తి భిన్నమైన వ్యక్తి. మరి అతనితో కలిసి సిటీలో చోటు చేసుకునే అసాంఘిక కార్యక్రమాలను ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా. ఆద్యంతం యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని సాయి యు హ్యున్న్ 'బ్లాక్ అండ్ వైట్' అనే టెలివిజన్ సిరీస్ ఆధారంగా రూపొందించారు. మంచి ఆదరణ పొందిన ఈ చిత్రంలోని పోలీస్ పాత్రలో మార్క్ చావో నటన అబ్బురపరుస్తుంది.
ది రూఫ్‌టాప్
ఇది రెండు భిన్న సామాజిక వర్గాల జీవితాలను తెలిపే చిత్రం. గలిలీ నగరంలో ఉన్న రెండు గ్రూపుల్లో ఒక గ్రూపు ఎప్పుడూ పైకప్పులో నివసిస్తుంటారు. పాటలు, డాన్స్ చేసుకుంటూ హ్యాపీగా గడుపుతుంటారు. క్రింద ఉన్నవారు సంపన్నులు. శక్తివంతులు. డాన్సులు, పాటలు పాడుతూ హ్యాపీగా జీవనం గడిపే గ్రూపుకు చెందిన గవో అనే కుర్రాడు ఓ అమ్మాయిని చూస్తాడు. పేరు సియాన్. చాలా అందంగా ఉంటుంది, ఆర్టిస్టు కూడా. ఆమెను కలుసుకునేందుకు గవో ఏం చేశాడు?, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనేది సినిమా. మనం ఒకటి అనుకుంటే విధి మరొకటి నిర్ణయిస్తుందనేది ఈ చిత్ర కథాంశం. జే చౌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2013లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన జే చౌ హీరోగా నటించడంతోపాటు నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా, సంగీత దర్శకుడిగా ఇలా విభిన్న విభాగాలను నిర్వహించి సత్తా చాటి, సక్సెస్‌నూ అందుకున్నారు.
లవ్
ఒంటరిగా ఉన్న ఎనిమిది మంది పాత్రల జర్నీని తెలిపే చిత్రమిది. ఇందులో నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలుంటారు. విభిన్న రంగాలకు, విభిన్న నేపథ్యాలకు చెందిన వీరు రకరకాల కారణాలతో ఒంటరితనం ఫీలవుతుంటారు. ఆ ఫీలింగ్‌ను పోగొట్టుకోవడం కోసం తమకు సూట్ అయ్యే జోడీని సెర్చ్ చేసే క్రమంలో ప్రేమలో పడతారు. వారి ప్రేమలోని ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎలా ఉన్నాయి?, ప్రేమను ఒక్కొక్కరు ఏవిధంగా డీల్ చేశారు?, చివరికి ఎవరు మొదట తమ ప్రేమలో విజయం సాధించారనేది సినిమా. ఆద్యంతం రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని డోజ్ నియు 2012లో రూపొందించారు. భిన్న వ్యక్తుల్లోని విభిన్న భావోద్వేగాలను, ఫీలింగ్స్‌ను, ప్రేమలోని కోణాలను ప్రతిబింబించే ఈ చిత్రం ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రధాన పాత్రల్లో నటించిన షు క్వి, ఎథన్ జువాన్, ఇవి చెన్, మార్క్ చోవో, అంబర్ కుయో, ఎడ్డీ పెంగ్, జియావో వై, డోవ్ నియుల నటన కట్టి పడేస్తుంది.
Authorization