ప్రపంచ సినీ చరిత్రలో ఆఫ్రికన్ చిత్రాలకే కాదు ఆఫ్రికన్ నేపథ్య చిత్రాలకూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆఫ్రికన్ల బతుకు చిత్రానికి ప్రతిబింబంగా నిలిచే రీతిలో ఇతర దేశ దర్శక, నిర్మాతలు కూడా ఎన్నో చిత్రాలను రూపొందించారు.
ఈ చిత్రాలు సైతం విశేష ప్రేక్షకాదరణ పొంది వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. నవ్య, వైవిధ్య కథ, కథనాలతో తెరకెక్కి ప్రేక్షక లోకాన్ని మెప్పించిన కొన్ని ఆఫ్రికన్ నేపథ్య చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
క్వీన్ ఆఫ్ కాట్వే
ఉగాండాకు చెందిన చెస్ క్రీడాకారిణి ఫియోనా మియుసి జీవితాన్ని ప్రతిబింబించే బయోగ్రాఫికల్ చిత్రమిది. ఉగాండాలోని కాట్వే ప్రాంత మురికి వాడల్లో ఉండేఓ కుటుంబంలో జన్మించిన ఫియోనా పదేండ్ల పాటు అత్యంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంది. అనేక సమస్యలతో పోరాడుతూనే చెస్‌లో రాణిస్తుంది. ఉగాండా మహిళల జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో 3 సార్లు గెలుపొందింది. అలాగే చెస్ ఒలంపియాడ్లో నాలుగు సార్లు ఉగాండా దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది. అంతేకాదు చెస్ చరిత్రలోనే ఒలంపియాడ్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి ఉగాండా మహిళాగా ఫియోనా మియుసి రికార్డు సృష్టించింది. అత్యంత స్ఫూర్తివంతమైన ఆమె జీవితం తెరపైకి ఎక్కి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని భారతీయ దర్శకురాలు మీరానాయర్ రూపొందించడం విశేషం. గతేడాది విడుదలైన ఈ సినిమా విమర్శకులు ప్రశంసలందుకోవడంతోపాటు టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఫియోనాగా మదీనా నల్వాంగ నటన అబ్బుర పరుస్తుంది.
ది సీజ్ ఆఫ్ జాడోట్విల్లే
డెక్లన్ పవర్ రాసిన 'ది సీజ్ ఎట్ జోడోట్విల్లే: ది ఐరిష్ ఆర్మీ ఫర్గాటెన్ బ్యాటిల్' అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. యునైటెడ్ నేషన్‌లో శాంతి కోసం కోంగో పట్టణంలో 1961 సెప్టెంబర్‌లో చేపట్టిన 'పీస్ కీపింగ్ మిషన్'లో ఐరీష్ ఆర్మీ పాత్రను, ఆర్మీ పోరాటాన్ని తెలియజేస్తుంది. ఐరీష్ ఆర్మీ అధికారుల నిర్ణయాలు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనేది ఈ చిత్రంలో ప్రతిబింబించింది. హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు రిచీ స్మిత్ 2016లో రూపొందించారు. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రం విశేషంగా ఆదరణ పొందింది. ఇందులో జామీ డోర్నన్, మార్క్ స్ట్రాంగ్, మైఖేల్ పెర్స్బ్రాంట్, డానీ సపనీ, జసోన్ ఓ మారా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
బీస్ట్స్ ఆఫ్ నో నేషన్
ఒక బాలుడు సైనికుడిగా ఎదిగిన వైనాన్ని తెలిపే చిత్రమిది. అగు అనే ఓ చిన్న కుర్రాడు పశ్చిమ ఆఫ్రికా దేశంలో నివసిస్తుంటారు. వారున్న ప్రాంతంలో ఎప్పుడూ యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. తమ ప్రాంతాన్ని కాపాడటం కోసం పోలీసులు యుద్ధం చేస్తుంటారు. దీని కోసం పిల్లలను సైతం బలవంతంగా సైనికులుగా మారుస్తారు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు, హింసలకు గురిచేస్తుంటారు. తుపాకీ పట్టి ప్రత్యర్థులను చంపేందుకు శిక్షణ ఇస్తారు. మరి అలా తుపాకి పట్టిన అగు అనే కుర్రాడు భయపడే స్థితి నుంచి భయపెట్టే స్థితికి ఎలా ఎదిగాడు. ఎదిగే క్రమంలో అతని శారీరక, మానసిక సంఘర్షణ ఏంటన్నది ఆసక్తికరం. బాల సైనికుడి స్ట్రగుల్‌ను తెలియజేసే ఈ వార్ డ్రామా చిత్రాన్ని దర్శకుడు కారీ జోజి ఫుకునాగా రూపొందించారు. 2015లో విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. వెనిస్, టొరంటో వంటి పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమై, పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో చైల్డ్ సోల్జర్ అగు పాత్రలో అబ్రహం అట్టా నటన మంత్రముగ్దులను చేస్తుంది.
ద గన్‌మన్
మాజీ సైనికుడైన జిమ్ టెర్రీర్ ప్రస్తుతం కిరాయి హంతకుడిగా పనిచేస్తుంటాడు. అందులో భాగంగా అతని దగ్గరికి కోంగో మైనింగ్ మినిస్టర్‌ను హత్య చేసే పని వస్తుంది. ఓ కార్పొరేట్ కంపెనీ అధినేత ఈ పనిని జిమ్‌కు అప్పగిస్తాడు. తను అనుకున్న ప్రకారం ఆ మంత్రిని చంపేస్తాడు జిమ్. కొన్నాళ్ళ తర్వాత తన వృత్తిని మానేస్తాడు. కానీ ప్రత్యర్థులు జిమ్‌ను వెంబడిస్తారు. ఈ నేపథ్యంలో జిమ్ చేసే పోరాటమే ఈ చిత్రం. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను పియర్ మోరెల్ రూపొందించారు. జిమ్ పాత్రలో సీయన్ పెన్న్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 2015లో విడుదలైన ఈ చిత్రం క్రిటికల్‌గా ఆకట్టుకుంది.
థింగ్స్ ఆఫ్ ది ఎయిమ్‌లెస్ వండర్
19వ శతాబ్దంలో పశ్చిమ ఆఫ్రికలో ఓ తెల్లజాతీయుడు పర్యటిస్తుంటాడు. అనుకోకుండా ఓ దట్టమైన అడవిలో తప్పిపోతాడు. తాను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అడవిలో ఓ నల్లజాతి యువతి కనిపిస్తుంది. ఆమెతో కాసేపు గడిపిన తర్వాత అనుకోకుండా ఆమె మాయమవుతుంది. 20వ శతాబ్దంలో విదేశీ న్యూస్ కరెస్పాండెంట్ నైట్ క్లబ్లో ఓ వేశ్యను కలుస్తాడు. ఆమెతో రాత్రి గడుపుతాడు. ఆ మరుక్షణం ఆమె కనిపించకుండా పోతుంది. ఆమె కనిపించకుండా పోవడానికి గల కారణమేంటనేది కనుగొనేందుకు అతను ఏం చేశాడు.
19వ శతాబ్దానికి, దీనికి ఉన్న సంబంధమేంటనేది సినిమా. కివూ రురు హోజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2015లో విడుదలై మంచి ఆదరణ పొందింది. రామథన్ బిజిమనా, జస్టిన్ ముల్లికిన్ అద్భుతంగా నటించారు.
ది గుడ్ లై
సుడాన్ దేశంలో జరిగిన సివిల్ వార్ కారణంగా వేల మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. ఎంతో మంది హత్యాకాండకు బలవుతారు. సుమారు 3600 మంది అక్కడి నుంచి పారిపోయి రక్షిత ప్రాంతం కోసం ప్రయాణం సాగిస్తారు. 15ఏండ్ల పాటు వేల మైళ్ళు ప్రయాణించిన తర్వాత చివరికి అమెరికాకు చేరుకుంటారు. కొంత మంది సహకారంతో అమెరికాలో సెటిలైన తర్వాత వారి జీవితం ఎలా సాగింది. వాళ్లు ఎదుర్కొన్న ఆటుపోట్లు ఏంటనేది సినిమా. ముగ్గురు సుడాన్ శరణార్థులను ప్రధాన పాత్రలుగా తీసుకుని యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఫిలిప్ ఫాలర్డియు ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఈ చిత్రం 2014లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ప్రధాన పాత్రల్లో రీస్ విథర్స్పూన్, జెరు డునీ, ఆర్మేల్డ్ ఓకేంమ్గా ఇమ్మాన్యుయల్ జల్ నటించి అలరించారు.
టింబక్టు
టింబక్టు సమీపంలో పురాతన నగరంలోని ఏడారి ఇసుక దిబ్బల్లో పశువుల కాపరి కిడనె, తన భార్య సతిమా, కూతురు టోయా, తోటి కాపరి ఇస్సాన్తో కలిసి శాంతియుతమైన జీవితం గడుపుతుంటాడు. ఈ తరుణంలో అక్కడ టెర్రరిస్టుల నుంచి ఇబ్బందులెదురవడం ప్రారంభమవుతుంది. వారి నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితులుంటాయి. ఈ క్రమంలో కిడనే ఫ్యామిలీ మనుగడ కోసం చేసే పోరాటం సినిమాలో ఆసక్తికరం. మంచి సందేశాన్ని దర్శకుడు ఆబ్డ్రేరామానే సిసోకో చమత్కారంగా, వినోదాత్మకంగా తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ప్రధాన పాత్రలో ఇబ్రహీం అహ్మాద్ దిట్ పినో, టౌలౌ కికి, లల్యా వాలెట్, మెహిదీ అగ్ల నటన ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కేన్స్‌లో ప్రదర్శితమై జ్యూరీ అవార్డునందుకుంది. అలాగే ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఆఫ్రికా అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది.
మండేలా : లాంగ్ వాక్ టు ఫ్రీడమ్
దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికైన నల్లజాతీయుడు నెల్సన్ మెండేలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. గ్రామీణ నిరుపేద కుటుంబంలో జన్మించిన మండేలా లాయర్‌గా పనిచేసిన అనంతరం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో జాయిన్ అవుతాడు. అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న తమ దేశ ప్రజల బతుకులను మార్చాలని సుదీర్ఘ కాలం పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఆనాటి నియంత పాలనపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో మండేలా ఎదుర్కొన్న స్ట్రగుల్స్‌ను ప్రతిబింబించే చిత్రమిది. మొదటసారి దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎలక్షన్లలో అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అత్యంత స్ఫూర్తివంతమైన మండేలా జీవితాన్ని అంతే అద్భుతంగా దర్శకుడు జస్టిన్ చాడ్విక్ తెరపై ఆవిష్కరించారు. 2013లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. మండేలా పాత్రలో ఎడ్ల్రిస్ ఎల్బా నటించి మెప్పించారు.
జులు
ఇద్దరు పోలీసులు అలీ సోఖేలా, బ్రియాన్ ఎప్కీన్ ఓ తెల్లజాతీయురాలి హత్యకు సంబంధించిన కేసును విచారిస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళు అక్కడ చట్టవిరుద్ధంగా జరిగే మద్యం వ్యాపారాన్ని, వీధి బాలలు కిడ్నాప్‌లు, అక్రమాయుధాల వ్యాపారానికి గల కారణాలను కనిపెడతారు. ఈ క్రమంలో వాళ్ళు తెలుసుకున్న నిజాలేంటనేది సినిమాలో ఆసక్తికరం. ఆఫ్రికాలో జరిగే అక్రమ వ్యాపారాలకు ప్రతిరూపంగా ఈ చిత్రాన్ని దర్శకుడు జెరోమ్ సాలే 2013లో రూపొందించారు. ఈ సినిమా మంచి ప్రశంసలందుకుంది. పోలీస్ అధికారులుగా ఓర్లాండో బ్లూమ్, ఫారెస్ట్ విట్టేకర్ అద్భుతంగా నటించారు.
హీట్ స్ట్రోక్
ఓ రీసెర్చ్ సైంటిస్ట్ తన భార్య, కూతురుతో కలిసి విహార యాత్రలో భాగంగా ఆఫ్రికన్ ఏడారులకు బయలు దేరుతాడు. అక్కడ కొన్ని రోజులు సరదాగా గడుపుతాడు. తన కూతురుతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఆయుధాల వ్యాపారిని చూస్తాడు. వారి మధ్య గొడవ కావడంతో ఆ వ్యాపారి సైంటిస్ట్‌ను చంపేస్తాడు. దీంతో తన కూతురితో కలిసి సైంటిస్ట్ భార్య ఆఫ్రికన్ ఏడారిలో మనుగడ కోసం సాగించిన పోరాటమే ఈ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు ఎవెలిన్ పుర్సెల్ రూపొందించారు. 2013లో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ముఖ్య పాత్రల్లో స్టెఫెన్ డాఫ్ట్ర్, స్వెట్లానా మెట్కినా, మైసీ విలియమ్స్ తమదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
Authorization