కొత్త సినిమాల విడుదల రూపంలో సినీ ప్రియులకు ఈ ఏడాది క్రిస్మస్ పండుగ బోల్డెన్ని కానుకలు ఇవ్వబోతోంది. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయనే విషయం విదితమే. ఈ పండుగ నేపథ్యంలో విడుదలవ్వబోతున్న భిన్న దేశాల సినిమాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ఫాంటమ్ థ్రెడ్
ఉడ్ కాక్ గొప్ప ఫ్యాషన్ డ్రెస్ మేకర్ (ట్రైలర్). హీరోలకు, సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు, సామాజిక కార్యకర్తలకు, రాజకీయ నాయకులకు వివిధ రకాల ఫ్యాషన్‌తో కూడిన డ్రెస్స్‌లను తయారు చేస్తూ బాగా పాపులర్ అవుతాడు. అతని ఉన్నతికి సోదరి కిరిల్ సహకారం ఎంతో ఉంది. రాయల్‌గా సాగుతున్న ఉడ్‌కాక్ జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమె ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఉడ్ కాక్ అన్నింటిని కోల్పోయి బికారిగా సాధారణ స్థాయికి చేరుకోవడమనే కథాంశంతో దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఈ అమెరికన్ పీరియడ్ డ్రామా చిత్రాన్ని రూపొందించారు. వుడ్‌కాక్ పాత్రలో డేనియల్ డే లూయిస్, సిరిల్ పాత్రలో లాస్లే మాన్విల్లె, ప్రియురాలి పాత్రలో విక్కీ క్రెప్స్ నటించారు. ఈ చిత్రం ఇప్పటికే అనేక ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి అవార్డులను కూడా దక్కించుకుంది. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విశ్వవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ది పోస్ట్ వియత్నాం
వార్ సమయంలో అమెరికా చేసిన కుట్రలకు సంబంధించిన 'పెంటగాన్ పేపర్స్'ను వాషింగ్టన్ పోస్ట్, ది న్యూయార్ టైమ్స్ పత్రికలు లీక్ చేయడం జరిగింది. ఈ ఇతివృత్తాన్ని ప్రధానంగా తీసుకుని అమెరికా ప్రభుత్వానికి, మహిళా పత్రికాధినేతకు మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో 'ది పోస్ట్' చిత్రాన్ని తెరకెక్కించారు. గ్రేట్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. 'ఇండియానా జోన్స్', 'ది టెర్మినల్', 'బిఎఫ్జీ' వంటి తదితర గొప్ప చిత్రాలను స్పీల్బర్గ్ తెరకెక్కించిన విషయం విదితమే. ఈచిత్రాలన్ని విశేష ప్రేక్షకాదరణతో వరల్డ్ బాక్సాఫీస్‌ని కలెక్షన్ల వర్షంతో షేక్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజా చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. మెరిల్ స్ట్రీవ్, టామ్ హ్యాంక్స్, సారా పాల్సన్, బాబ్ ఒడెన్కిర్క్, ట్రేసీ లెట్స్, బ్రాడ్లీ విట్పోర్డ్ వంటి అగ్ర నటీనటులు నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 22న విడుదల కానుంది.
బ్రైట్
లాస్ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన పోలీస్ అధికారి, మరో మిస్టీరియస్ శక్తి కలిగిన విచిత్రమైన ఆకారం పోలిన వ్యక్తితో కలిసి నగరంలో జరిగే క్రైమ్‌ను అరికట్టాల్సి వస్తుంది. ప్రతి రోజు రాత్రి సమయాల్లో ఈ ఇద్దరూ కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని మాయా శక్తులు వీరిపై దాడి చేస్తుంటాయి. వాటిని ఈ ఇద్దరు ఎదుర్కోవడమనే కథాంశంతో యాక్షన్ క్రైమ్, ఫాంటసీ చిత్రంగా దర్శకుడు డేవిడ్ అయర్ ఈ సినిమాను రూపొందించారు. విల్ స్మిత్ ఇందులో పోలీస్ అధికారిగా నటించారు. హాలీవుడ్ పాపులర్ హీరో విల్ స్మిత్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా ఈ నెల 22న విడుదల కానుంది.
హోస్టైల్స్
1892లో చెయెన్నె వార్ ప్రధాన అధికారి, అతని కుటుంబాన్ని సురక్షితంగా తమ ప్రాంతానికి తరలించే బాధ్యతను అమెరికాకు చెందిన ఆర్మీ కెప్టెన్ జోసెఫ్ అంగీకరిస్తాడు. దీని కోసమై ట్రైబల్స్‌కి చెందిన భూభాగం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో ట్రైబల్స్, బందిపోట్లు చెయెన్నె వార్ అధికారిపై దాడులు చేస్తుంటారు. వారిని కెప్టెన్ జోసెఫ్ ఎలా ఎదుర్కొన్నాడు?, ఈ క్రమంలో తనెలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చిందనే ఇతివృత్తంతో పీరియాడికల్ డ్రామాగా దర్శకుడు స్కాట్ కూపర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కెప్టెన్ పాత్రలో క్రిస్టియన్ బాలె నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైంది.
ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్..
1973లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. రోమ్ నగరానికి చెందిన జాన్ పాల్ గెట్టి ఆయిల్ మాగేట్. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. కానీ మోసపూరితమైన వైఖరి కలిగి ఉండటంతోపాటు ఎవరికీ సహాయం చేయడు. ఈ నేపథ్యంలో అతని మనవడు మూడవ జాన్ పాల్ గెట్టిని దుండగులు కిడ్నాప్ చేస్తారు. కిడ్నాపర్స్ భారీ డిమాండ్స్ పెడతారు. అందుకు జాన్ పాల్ గెట్టి అంగీకరించకుండా చాలా కఠినంగా ఉంటాడు. అనంతరం ఏం జరిగిందనే ఇతివృత్తంతో దర్శకుడు రిడ్లీ స్కాట్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిలియనీర్ జాన్ పాల్ గెట్టి పాత్రలో క్రిస్టోఫర్ ప్లమ్మర్, మనవడి పాత్రలో ఛార్లీ ప్లమ్మర్ నటించారు. ఈ సినిమా కూడా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న రిలీజ్ కానుంది.
డౌన్ సైజింగ్
మనుషులను అతిచిన్నగా మార్చేసి, వారి కోసం ప్రత్యేకంగా ఓ ప్రపంచాన్ని సృష్టించేందుకు నార్వేకు చెందిన సైంటిస్ట్‌లు ప్రయోగం చేస్తుంటారు. చిన్న పరిమాణంలో మారిపోయేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
ఓ జంట తమ ఒత్తిడి జీవితం నుంచి విముక్తి పొందాలని చిన్న సైజ్ ప్రపంచంలోకి వెళ్లేందుకు థెరపీ చేయించుకుంటారు. ఆ థెరపీతో వాళ్ళిద్దరూ చిన్నగా మారిపోతారు. వారితోపాటు చాలా మంది చిన్నసైజ్ ప్రపంచంలోకి మారతారు. అలా మారడం వల్ల వచ్చే ఇబ్బందులేంటి?, లాభాలేంటి?, దాన్నుంచి ఎలా రియలైజ్ అయ్యారనే ఇతివృత్తంతో అలెగ్జాండర్ పెనే ఈ చిత్రాన్ని రూపొందించారు. సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో మాట్ డామన్, క్రిస్టెన్ విగ్ జంటగా నటించారు. ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈచిత్రం కూడా క్రిస్మస్ కానుకగా ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతోంది.
'హ్యాంగ్ మ్యాన్', 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది టూ వరల్డ్స్', 'ఇన్ ది ఫేడ్', 'ఫిల్మ్ స్టార్స్ డోంట్ డైఇన్ లివర్ పూల్' చిత్రాలు కూడా క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్నాయి.
స్టార్ వార్స్: ది లాస్ట్ జెడీ
అంతరిక్షంలో ఉన్న గ్రహాలపై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య సాగే యుద్ధం నేపథ్యంలో 'స్టార్ వార్స్' సిరీస్ చిత్రాలు రూపొందుతున్న విషయం విదితమే. తాజాగా జెడీ అనే కల్పిత ప్రపంచంపై ఆధిపత్యం కోసం సూపర్ మ్యాన్ శక్తులు, సాంకేతిక పరమైన శక్తిని కలిగిన వర్గాల మధ్య పోరాటాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఉపగ్రహాల మీద నివసించే మంచి వర్గం, చెడు వర్గం ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం నిరంతరాయంగా చేసే ఈ యుద్ధంలో చివరికి మంచి (హీరో వర్గం)జాతి గెలవడమనే ఇతివృత్తంతో సినిమా సాగుతుంది. 'స్టార్ వార్స్' సిరీస్‌లో భాగంగా 'స్టార్ వార్స్' సీక్వెల్ ట్రయాలజీలో వస్తున్న రెండవ చిత్రమిది. రెండేండ్ల క్రితం 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్' చిత్రం విడుదలైంది. రియాన్ జాన్సన్ ఈ చిత్రాన్ని యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందించారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈ నెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గత చిత్రాల్లో నటించిన ప్రధాన తారాగణం మార్క్ హామిల్, క్యారీ ఫిషన్, ఆడమ్ డ్రైవర్, డైసీ రిడ్లీ, జాన్ బోయోగా, ఆస్కార్ ఐజాక్, ఆండీ సెర్కిస్, లుపిటా నైంగ్వో తదితరులు ఈ చిత్రంలోనూ నటించారు.
జుమాంజి: వెల్కమ్ టు ది జంగిల్
యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. నలుగురు టీనేజర్లు జుమాంజి వీడియో గేమ్ ఆడాలనుకుంటారు. ఆ గేమ్‌ను ప్రారంభించడంతో ఒక్కసారిగా వాళ్ళ రూపాలన్ని మారిపోతాయి. అంతేకాదు వాళ్ళంతా ఓ మిస్టీరియస్ జంగిల్లో పడిపోతారు. అక్కడ జంతువులు, ప్రత్యర్థుల నుంచి దాడులు ఎదురవు తుంటాయి. దీంతో వీటినెలా ఎదుర్కొన్నారనేది సినిమా. జేక్ కస్డాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ ఈ నెల 20న విడుదల కానుంది. ఇందులో హాలీవుడ్ స్టార్స్ డ్వైన్ జాన్సన్, జాన్ బ్లాక్, కెవిన్ హార్ట్, కరెన్ గిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించడంతో సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. ఇది మన దేశంలో ఈ నెల 29న విడుదలవుతోంది.
పిచ్ పర్ఫెక్ట్ 3
మ్యూజికల్ కామెడీ చిత్రమిది. వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలుపొందిన తర్వాత మ్యూజికల్ షోస్ ప్రదర్శించే బెల్లాస్ టీమ్ విడిపోతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు యుఎస్ఓలో మ్యూజికల్ షో ప్రదర్శించే అవకాశం వస్తుంది. దాని కోసం విడిపోయిన బెల్లాస్ టీమ్ ఎలా కలిశారు? ఆ తర్వాత వీరు ఎదుర్కొన్న సంఘటనలేంటనేది సినిమా. 'పిచ్ పర్ఫెక్ట్' సిరీస్‌లో భాగంగా వస్తున్న 3వ చిత్రమిది. అన్నా కెండ్రిక్, రెబెల్ విల్సన్, హైలీ స్టీన్ఫీల్డ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ట్రిష్ సి దర్శకత్వం వహించారు. ఆద్యంతం సంగీతం, కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.
ది బాలద్ ఆఫ్ లెఫ్టీ బ్రౌన్
లెఫ్టీ బ్రౌన్ 65 ఏండ్లున్న కౌబారు. తన చిరకాల పార్టనర్, కొత్త సెనేటర్‌గా ఎంపికైన ఎడ్వర్డ్ జాన్సన్ దారుణ హత్యకు గురవుతాడు. తన స్నేహితుడి హత్యకు కారణమైన హంతకులను పట్టుకునేందుకు ప్రయాణం సాగిస్తాడు. ఈ క్రమంలో అతనెదుర్కొన్న ఆటుపోట్లు ఏంటి?, హంతకులను పట్టుకున్నాడా..లేదా అనేది మిగిలిన కథ. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ చిత్రాన్ని దర్శకుడు జారేడ్ మోషే రూపొందించారు. లెఫ్టీ బ్రౌన్ పాత్రలో బిల్ పుల్‌మ్యాన్, ఎడ్వర్డ్ జాన్సన్ పాత్రలో పీటర్ ఫాండా నటించారు. విడుదలకు ముందే ఆసక్తిగా మారిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
పర్మనెంట్
1982లో జరిగే కథ ఇది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రధానంగా బ్యాడ్ హెయిర్ (జుట్టు), కౌమారదశను, సామాజిక ఇబ్బందులను ప్రతిబింబిస్తుంది. భిన్న రీతుల్లో కర్లీ హెయిర్ కలిగిన పేద విద్యార్థులను కొంతమంది ఆటపట్టిస్తుంటారు. నాసిరకంగా తయారు చేయబడిన విచిత్రమైన టోపీలు ధరించిన ఈ విద్యార్థులు రోజువారి జీవనంలో ఎదుర్కొన్న ఇబ్బందులేంటనే ఇతివృత్తంతో దర్శకుడు కోల్లెట్ బర్సన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో పాట్రిసియా అర్క్వెట్, రెయిన్ విల్సన్, కిరా మక్లీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆద్యంతం కామెడీగా సాగే ఈ చిత్రం అమెరికాలో క్రిస్మస్ని పురస్కరించుకుని ఈ నెల 15న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ది థౌజండ్ ఫేసెస్ ఆఫ్ దుంజియా
రహస్య శక్తులు కలిగిన వ్యక్తులు ఓ ఊరులో సంచరిస్తూ అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఖడ్గవీరులు ఆ రహస్య శక్తులు కలిగిన వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారు. కానీ వీరికి కత్తియుద్ధంలో అంతగా ప్రావీణ్యం ఉండదు. అనుపయుక్త యోధులకు, రహస్య శక్తులు కలిగిన వారికి మధ్య జరిగే పోరాట నేపథ్యంలో దర్శకుడు యు ఎన్ వూ పింగ్ ఈ చిత్రాన్ని ఆద్యంతం యాక్షన్ అడ్వెంచరస్ ఫాంటసీగా రూపొందించారు. ఈ చైనీస్ చిత్రం సైతం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులో కీలక పాత్రల్లో దా పెంగ్, ని ని, ఆరిఫ్ లీ, జూ డోంగ్యూ, వు బాయి, అదా లియు నటించారు. చైనా మార్క్ మార్షల్ ఆర్ట్స్, కత్తియుద్ధాలు ఈ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ది గ్రేటెస్ట్ షోమ్యాన్
అమెరికన్ గ్రేట్ షోమ్యాన్ (సర్కస్ చేసేవ్యక్తి)గా పేరు తెచ్చుకున్న పి.టి.బార్నమ్ సర్కస్‌కు ఆద్యుడు. బార్నమ్ అండ్ బెయిలీ సర్కస్‌ను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద సర్కస్ సంస్థగా సుదీర్ఘకాలంగా సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో షోమ్యాన్గా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, రచయితగా పి.టి.బార్నమ్ ఎదిగిన తీరు ఆదర్శప్రాయం. పి.టి.బార్నమ్ జీవితం ఆధారంగా దర్శకుడు మైఖేల్ గ్రేస్సీ 'ది గ్రేటెస్ట్ షోమ్యాన్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బార్నమ్గా హ్యూ జాక్మన్, యంగ్ ఏజ్ పాత్రలో ఎల్లిస్ రుబిన్గా నటించారు. అత్యంత ప్రతిష్టాతకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు.
మాల్లీస్ గేమ్
హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన హై స్టేక్స్ పోకర్ గేమ్ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మాలీ బ్లూమ్ అందమైన ఒలంపిక్ క్లాస్ స్త్కెయెర్. నిషేధించబడిన ఈ గేమ్‌ను రహస్యంగా నిర్వహిస్తూ మాలీ బాగా పాపులర్ అవుతుంది. ఈ గేమ్ జరిగే చోట అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో మాలీ బ్లూమ్‌ను, అక్కడ జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపేందుకు ఎఫ్‌బీఐ చేసే ప్రయత్నం నేపథ్యంలో బయోపిక్ డ్రామాగా దర్శకుడు ఆరోన్ సోర్కిన్ ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మాలీ బ్లూమ్ పాత్రలో జెస్సికా చస్టైన్ నటించారు. ఇప్పటికే సెప్టెంబర్ 8న టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై మంచి ప్రశంసలందుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న అమెరికాలో విడుదల కానుంది. ఆ తర్వాత జనవరి 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
ఫాదర్ ఫిగర్స్
తండ్రిని కనుగొనేందుకు ఇద్దరు కుమారులు చేసే జర్నీ నేపథ్యంలో సాగే చిత్రమిది. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడని తల్లి చెప్పిన మాటలు వాస్తవం కాదని, తమ తండ్రి బతికే ఉన్నాడని, ఆయన్ని కనిపెట్టేందుకు ఈ ఇద్దరు అన్నదమ్ములు చేసే జర్నీలో తెలుసుకున్న కొత్త విషయాలేంటనే ఆసక్తికర కథాంశంతో లారెన్స్ షేర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. హాస్యభరితంగా సాగే ఈ సినిమాను క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. ఆద్యంతం కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఓవెన్ హిల్సన్, ఎడ్ హెల్మ్ అన్నదమ్ముల పాత్రల్లో నటించిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Authorization